Share News

New Sedition Law: పాత్రికేయులపై ప్రతాపం

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:44 AM

సీనియర్‌ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్‌, కరణ్‌ థాపర్‌ల మీద అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేయడం అమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది. భారతీయ న్యాయసంహితలోని కొత్త దేశద్రోహ చట్టం (సెక్షన్‌ 152)ను పాత్రికేయులమీద...

New Sedition Law: పాత్రికేయులపై ప్రతాపం

సీనియర్‌ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్‌, కరణ్‌ థాపర్‌ల మీద అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేయడం అమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది. భారతీయ న్యాయసంహితలోని కొత్త దేశద్రోహ చట్టం (సెక్షన్‌ 152)ను పాత్రికేయులమీద ప్రయోగించే దుస్సంప్రదాయానికి తెరదీయవద్దనీ, ఈ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలనీ గురువారం విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు అసోం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీల అధినేతలందరూ సామాజిక మాధ్యమాల్లో అసోం పోలీసుల దూకుడునూ, పత్రికాస్వేచ్ఛను నియంత్రించే ప్రయత్నాన్నీ ప్రశ్నిస్తున్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 124ఎ కింద ఇక ఎంతమాత్రం దేశద్రోహం కేసులు కుదరవంటూ సుప్రీంకోర్టు నిలిపివేయడంతో, అంతకంటే కఠినాతికఠినమైన కొత్తచట్టాన్ని తెచ్చి పాత్రికేయులను జీవితపర్యంతం జైల్లో ఉంచేందుకు డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు ప్రయత్నిస్తున్నాయని వీరంతా విమర్శిస్తున్నారు. సమన్ల జారీమీద ఎడిటర్స్‌ గిల్డ్‌ కూడా అభ్యంతరాన్ని ప్రకటిస్తూ, అసోం పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్న అపప్రథ మూటగట్టుకోకూడదని వ్యాఖ్యానించింది. ఆగస్టు 22న గువాహతి క్రైమ్‌బ్రాంచ్‌ ముందు హాజరుకానిపక్షంలో అరెస్టులు తప్పవంటూ అసోం పోలీసులు వీరిని హెచ్చరించారు.

ఆపరేషన్‌ సిందూర్‌మీద ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కథనాలు, విశ్లేషణలు, ఇంటర్వ్యూలు పాలకుల ఆగ్రహాన్ని చవిచూశాయి. కొత్తదేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయడంతోపాటు, అసోం పోలీసులు తమపై ఎటువంటి నిర్బంధచర్యలకు పాల్పడకుండా ది వైర్‌ పాత్రికేయులు సర్వోన్నత న్యాయస్థానం నుంచి రక్షణ కూడా సాధించుకున్నారు. వారి పిటిషన్‌ మీద ఆగస్టు 12న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వెంటనే, మోరిగావ్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుతో సంబంధం లేకుండా, అదేరోజున ఈ మారు గువాహతి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆపరేషన్‌ సిందూర్‌ గురించిన వేరొక కథనంపైన మరొక ఎఫ్‌ఐఆర్‌తో బరిలోకి దిగడం గమనార్హం. ఈ పరిణామాలు గమనించినప్పుడు, సుప్రీంకోర్టు నోటీసులు, ఆదేశాలు అసోం పాలకులను, వారి పోలీసులను ఏమాత్రం అడ్డలేకపోగా, నిర్దిష్టమైన లక్ష్యంతో, కక్షపూరితవైఖరితో ఇదంతా చేస్తున్నారని కూడా అనుకోవాలి. కొద్దిరోజుల తరువాత తమకు అందిన ఈ సమన్లలో కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తేదీని ప్రస్తావించకపోవడమేకాక, ఏ నేరానికి పాల్పడ్డారో, ఏ కారణంతో వీటిని జారీచేశారో కూడా తెలియజేయలేదని వైర్‌ అంటోంది. ఎన్నో ప్రయత్నాల తరువాత, మొన్న బుధవారంనాటికి కానీ తమమీద ఉన్న ఆరోపణలు ఏమిటో తెలియలేదనీ, సెక్షన్‌ 152ను ప్రయోగించారు కానీ, అందులో భాగంగా విధిగా పాటించాల్సిన నిబంధనలను మాత్రం పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌, ముందూ వెనుకా పరిణామాలమీద వెబ్‌సైట్‌లో సుప్రసిద్ధ పాత్రికేయులు రాసిన పన్నెండు కథనాల శీర్షికలు, దౌత్య, రక్షణరంగ నిపుణులతో పాటు, పొరుగుదేశం నాయకులతో సైతం కరణ్‌థాపర్‌ నిర్వహించిన ఇంటర్వ్యూల ప్రస్తావనలు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్టు సమాచారం. అసోం పోలీసులు వీరందరి జోలికీ పోకపోవచ్చును కానీ, ది వైర్‌ సంస్థనీ, ఈ ఇద్దరు పాత్రికేయులనూ సులభంగా వదలకపోవచ్చు.


ఆపరేషన్‌ సిందూర్‌లో విజయాల గురించే తప్ప, జరిగిన నష్టాలమీద మన ప్రభుత్వం నోరు విప్పనందున, మన సైనికరంగ నిపుణుల వ్యాఖ్యలు, విదేశీ మీడియా కథనాల ఆధారంగా విమానాల నష్టంమీద మీడియాలో కొంత విశ్లేషణ జరగకపోలేదు. ఈ విషయంలో వైర్‌ మరింత దూకుడుగా ఉండటం మన పాలకులకు నచ్చకపోవడం సహజం. సదరు కథనాలు, ఇంటర్వ్యూలను శుద్ధ అబద్ధాలంటూ ఖండించవచ్చు, సవరణలూ వివరణలూ ప్రచురించని పక్షంలో చట్టప్రకారం దండించవచ్చు. కానీ, పాలకుల అభిప్రాయానికి భిన్నంగా ఒక మీడియా సంస్థ వ్యాఖ్యలు, విశ్లేషణలు చేసినంతమాత్రాన, ఒక జర్నలిస్టు ఏలికలకు నచ్చని రీతిలో తన వృత్తిని నిర్వహించినంతమాత్రాన అది దేశద్రోహమైపోదు. దేశంలో కొన్ని ప్రధాన మీడియా సంస్థలను పాలకులు పలుమార్గాల్లో తమ దారికి తెచ్చుకున్న నేపథ్యంలో, గత పదేళ్ళకాలంలో వైర్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తూ అనేక కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. మూడేళ్ళక్రితం ఆ సంస్థ ఢిల్లీ కార్యాలయంలో సోదాలు కూడా జరిగాయి. 152వంటి భయానక చట్టంతో పాత్రికేయుల నోరునొక్కే ఈ ప్రయత్నాలను రేపోమాపో దానిని సమీక్షించబోతున్న సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 05:44 AM