Indian Constitution : ప్రజాస్వామ్య హృదయం మన రాజ్యాంగం
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:29 AM
గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమర్థమైన, ప్రభావశీలమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. యావద్భారతీయులూ ముఖ్యంగా మన సమాజంలోని సామాజిక దుర్బల వర్గాలు, మత మైనారిటీలు తమ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించే శక్తిగా రాజ్యాంగాన్ని
గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమర్థమైన, ప్రభావశీలమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. యావద్భారతీయులూ ముఖ్యంగా మన సమాజంలోని సామాజిక దుర్బల వర్గాలు, మత మైనారిటీలు తమ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించే శక్తిగా రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఆసేతు హిమాచలం ఒకే జాతి–ఒకే ప్రజ అన్న స్ఫూర్తిని పెంపొందించడంలో మన రాజ్యాంగం విజయవంతమయింది.
భారత రాజ్యాంగ ప్రస్థానానికి ఈ జనవరి 26న 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏడాది పొడుగునా ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్’ అనే ఉద్ఘోషతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నది. నవంబర్ 26, 2024న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన రాజ్యాంగ అమృతోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ‘మన దేశ పవిత్ర గ్రంథం’గా రాజ్యాంగాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్ర ప్రతి భారతీయునికీ గర్వకారణమైనది. మనకొక సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే ప్రయత్నాలు రాజ్యాంగ సభ ఏర్పాటుకు కనీసం 25 సంవత్సరాల ముందే ప్రారంభమయ్యాయి. ప్రప్రథమ భారత ప్రభుత్వ చట్టం–1858 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం (1857) పర్యవసానంగా వచ్చింది. ఆ చట్ట రూపకల్పనలో భారతీయులు ఎవరికీ భాగస్వామ్యం లేదు. ఆరు దశాబ్దాల అనంతరం కొత్త భారత ప్రభుత్వ చట్టం–1919 అమలులోకి వచ్చింది. అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్ ఛత్రం కింద జాతీయవాదులు ఏకమై స్వాతంత్ర్య సాధనకు పోరాడుతున్నారు. ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్ నిరసించింది. బ్రిటిష్ ప్రభుత్వం కాకుండా భారతీయ చట్ట సభే భారతదేశ సొంత రాజ్యాంగాన్ని రచించాలని జాతీయవాదులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ విభాగం అయిన స్వరాజ్ పార్టీ ఈ అంశాన్ని కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో లేవనెత్తింది. రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చించేందుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే వలసపాలకులు ఈ డిమాండ్‌ను ఉపేక్షించారు. భారత ప్రజలు అందరూ ఏకీభవించే, ఆమోదించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలని భారత జాతీయోద్యమ నాయకులను లార్డ్ బిర్కెన్ హెడ్ సవాల్ చేశారు. దేశానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన చర్యలను సూచించేందుకు పూర్తిగా బ్రిటిష్ నాయకులు, అధికారులతో ఒక కమిషన్‌ను కూడా ఆయన నియమించారు. ఇదే సైమన్ కమిషన్‌గా సుప్రసిద్ధమైనది. లార్డ్ బిర్కెన్ హెడ్ సవాల్‌ను కాంగ్రెస్ అంగీకరించింది. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డిసెంబర్ 1927లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీనేర్పాటు చేసింది. సుభాస్ బోస్, అనీబీసెంట్, ఎమ్‌ఆర్ జయకర్, జవహర్‌లాల్ నెహ్రూతో పాటు ముస్లింలీగ్ ప్రతినిధులు ఇరువురు ఆ కమిటీలో సభ్యులు. 1928లో ఆ కమిటీ ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు నివేదించింది. ఇదే ‘నెహ్రూ నివేదిక’గా సుప్రసిద్ధమైనది. ప్రాథమిక హక్కులు, ద్విసభీయ పార్లమెంటు, అధికారాల విభజన, న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు మొదలైన అంశాలపై 22 అధ్యాయాలు, 188 అధికరణలు నెహ్రూ రిపోర్ట్‌లో ఉన్నాయి. 21 సంవత్సరాల వయసు నిండిన ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించాలని ఆ నివేదిక సూచించింది. బిర్కెన్‌హెడ్ సవాల్‌కు నెహ్రూ నివేదిక ఒక దీటైన సమాధానమని వ్యాఖ్యానిస్తూ ‘మనం మన స్వాతంత్ర్య మాగ్నాకార్టాను రచించుకున్నామని’ ఒక ప్రముఖ దినపత్రిక వ్యాఖ్యానించింది. జనవరి 26, 1930ని ‘స్వాతంత్ర్య దినం’గా పాటించాలని డిసెంబర్ 1929లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభ పిలుపునిచ్చింది. ఆ చరిత్రాత్మక సందర్భాన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేందుకే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 నుంచి అమలుచేయాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది.
భారతీయులకు ‘ఆమోదయోగ్యమైన రాజ్యాంగం’ రూపొందించేందుకు రాజ్యాంగ సభని ఏర్పాటు చేయాలని మే 1924లో స్వరాజ్ పార్టీ తీర్మానం చేసింది. భారతీయులు రాజ్యాంగ సభ గురించి వినడం అదే మొదటిసారి. ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటాన్ని ముమ్మరం చేసింది. భారత స్వాతంత్ర్య చట్టం–1947ను తీసుకురావడం ద్వారా భారతదేశ చట్టాల నిర్మాణంలో తమకు ఇంకెంత మాత్రం ఎలాంటి పాత్ర ఉండబోదని బ్రిటిష్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలను పూర్తిగా భారతీయులకే అప్పగించింది.
రాజ్యాంగ సభ తొలి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. ముసాయిదా రాజ్యాంగాన్ని ఫిబ్రవరి 21, 1948న సభకు సమర్పించారు. మార్పులు చేర్పులతో కూడిన కొత్త ముసాయిదాను నవంబర్ 4, 1948న రాజ్యాంగ సభకు సమర్పించారు. కొత్త ముసాయిదాలోని ప్రతి అధికరణను, ప్రతి అధికరణలోని ప్రతి నిబంధనను సభ్యులు కూలంకషంగా చర్చించారు. ఆ చర్చల ఫలితంగా రూపొందిన తుది ముసాయిదాను నవంబర్ 26, 1949న ఆమోదించారు. ముసాయిదాపై చర్చల్లో రాజ్యాంగ సభ సభ్యుల ప్రసంగాలు, వాదోపవాదాలు మొత్తం 3.6 మిలియన్ పదాలుగా రికార్డయ్యాయి. 3,675 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను విపులంగా చర్చించారు. ఈ మహోన్నత కృషి ఫలితంగా రూపొందిన భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ ముసాయిదా రచనా భారాన్ని చాలావరకు డాక్టర్ అంబేడ్కరే స్వయంగా వహించారు. ‘ముసాయిదా కమిటీ సభ్యులు ఎంత అంకితభావంతో కృషి చేశారో నేను గ్రహించాను. ముఖ్యంగా ఆ కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేడ్కర్, తన ఆరోగ్యపరిస్థితి బాగా లేనప్పటికీ రాజ్యాంగ నిర్మాణానికి పూర్తిగా అంకితమయ్యారు’ అని రాజ్యాంగసభ చైర్మన్ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 1946లో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగసభలో ప్రతిపాదిస్తూ అది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదని, అది ఒక ‘ప్రకటన’, ఒక ‘దృఢసంకల్పం’, ఒక ‘ప్రతిజ్ఞ’, అంతిమంగా అది ఒక ‘అంకితం’ అని జవహర్‌లాల్ నెహ్రూ భావోద్వేగంతో ఉద్ఘాటించారు. రాజ్యాంగ సభలోని 299 మంది సభ్యులు 35 నెలల పాటు ఆ మహా సంకల్పంతో కృషి చేసి మన మహోన్నత సంవిధానాన్ని రూపొందించారు.
75 సంవత్సరాల భారత రాజ్యాంగ ప్రస్థానంలో జాతి జీవనాన్ని మౌలికంగా ప్రభావితం చేసిన హిందూ కోడ్ బిల్లు, మౌలిక విధులు, పంచాయతీరాజ్ వ్యవస్థ వికేంద్రీకరణ, కేంద్రీకృత ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాలకు స్వస్తి, అధికరణ 370 రద్దు మొదలైన రాజ్యాంగ సంస్కరణలు ఆ మహోన్నత గ్రంథం స్ఫూర్తితో అమలులోకి వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని ‘వలస వాద రాజ్యాంగం’గా కొంత మంది విమర్శిస్తున్నారు. అయితే, 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ రూపొందించిన నెహ్రూ నివేదికలోని అనేక అంశాలు స్వతంత్ర భారత రాజ్యాంగంలో ఉన్నాయి. గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమర్థమైన, ప్రభావశీలమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. యావద్భారతీయులూ ముఖ్యంగా మన సమాజంలోని సామాజిక దుర్బల వర్గాలు, మత మైనారిటీలు తమ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించే శక్తిగా రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఆసేతు హిమాచలం ఒకే జాతి–ఒకే ప్రజ అన్న స్ఫూర్తిని పెంపొందించడంలో మన రాజ్యాంగం విజయవంతమయింది. అంతిమంగా రాజ్యాంగం ఒక సంకల్ప పత్రం మాత్రమే. ఆ మౌలిక శాసనాన్ని అమలుపరుస్తున్నవారి రాజ్యాంగ నైతికత – ఆ సంవిధాన స్ఫూర్తి– చాలా ప్రధానమైనది. ‘రాజ్యాంగ నైతికత అనేది సహజ భావన కాదు. దాన్ని అలవాటు చేసుకోవాలి’ డాక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న శుభసందర్భంలో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకునేందుకు జాతి తనకు తాను అంకితమవ్వాలి.
రామ్ మాధవ్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News