Telangana History September 17 Significance: ఆ చూపుతోనే సెప్టెంబర్ 17 సార్థకత
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:36 AM
‘కొందరు ఆగమంటే ఒప్పుకోని చరిత్రా! / పద ముందుకు!’ అంటూ తెలంగాణ ఇతిహాస సత్యాన్ని కవి కుందుర్తి ఆవిష్కరించారు. చరిత్ర చేసిన నష్టానికి పరిహారంగా తెలంగాణకు కాలం ప్రసాదించిన వరమే హైదరాబాద్. డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం...
‘కొందరు ఆగమంటే ఒప్పుకోని చరిత్రా! / పద ముందుకు!’ అంటూ తెలంగాణ ఇతిహాస సత్యాన్ని కవి కుందుర్తి ఆవిష్కరించారు. చరిత్ర చేసిన నష్టానికి పరిహారంగా తెలంగాణకు కాలం ప్రసాదించిన వరమే హైదరాబాద్. డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున నాటి తెలంగాణ జనకోటి శతాబ్దాల రాచరిక పెత్తనాల నుంచి బయటపడి ప్రజాస్వామ్య పాలన దిశగా నిర్ణయాత్మక ముందడుగువేసింది. మధ్యయుగాలలో ఒక సామాన్య నగర స్థాయి నుంచి ఆధునిక ప్రపంచ నగరంగా పరిణమించి, ప్రస్తుతం నవ్యాతి నవ్య సాంకేతికతల సృష్టికి నెలవయిన సిలికాన్ వ్యాలీని మించి నవకల్పనల కేంద్రంగా ఎదగగలననే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్న తెలుగు నగరం హైదరాబాద్.
మేధోభాగ్యనగరిగా విలసిల్లుతున్న హైదరాబాద్ వైభవం 1990ల్లో ప్రవేశించిన ఐటీ సాంకేతికతలతో ఆరంభమయిందని సామాన్యులతో పాటు విద్యావంతులు సైతం భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. భారతదేశ ఐదో పెద్ద నగర ప్రగతి ప్రస్థానం ఒక శతాబ్ది కిందటే ప్రారంభమయింది. ఇరవయో శతాబ్ది ఆరంభంలో బ్రిటిష్ అధికారులతో పాటు ఉత్తర, పశ్చిమ భారతావని నుంచి వచ్చిన వారితో హైదరాబాద్ రాజ్యంలో ఆధునికీకరణ ప్రక్రియలు మొదలయ్యాయి. 1908లో మూసీ నది వరద విపత్తుతో కుదేలయిన నగరాన్ని పునర్నిర్మించేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన ప్రణాళికను నిజాం ప్రభుత్వం అమలుపరిచింది. అదే కాలంలో ఐరోపాలోని గొప్ప నగరాలకు సమరీతిలో హైదరాబాద్‌ను రూపొందించాలన్న ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముందు చూపు ఫలితంగా సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలైన సంస్థలు ప్రభవించాయి. మొదటి ప్రపంచయుద్ధం పారిశ్రామిక పరిశోధనలకు ఉద్దీపన అయింది. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిన ఖగోళ పరిశోధనలు, నోబెల్ పురస్కారాన్ని సాధించిన వైద్యశాస్త్ర పరిశోధనలు ఆనాడు హైదరాబాద్‌లో జరిగాయి. 1948 అనంతరం వైజ్ఞానిక, సాంకేతిక పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం అమలుపరిచిన విధానాలు, హైదరాబాద్‌లో లభ్యమైన ప్రత్యేక సానుకూల పరిస్థితులు, ప్రభావశీల వ్యక్తుల పలుకుబడితో హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ 1990 అనంతరం ప్రపంచీకరణ విధానాలతో వేగవంతమైన ఆర్థిక పురోగతికి విశేషంగా దోహదం చేశాయన్న వాస్తవం విస్మరించలేనిది. కోవిడ్ విపత్తుకాలంలో వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావడం ఆ సానుకూల పరిణామాల ఫలితమే అనడంలో సందేహం లేదు.
ఈ ప్రగతిశీల చరిత్రలో మరీ ముఖ్యంగా గమనార్హమైన వాస్తవం ఒకటి ఉన్నది. అమానుష భూస్వామ్య దోపిడీ, అణచివేతలకు పల్లె తెలంగాణలోని చైతన్యశీల సామాన్యులు ఎంత మొక్కవోని దీక్ష, త్యాగశీలతతో పోరాడారో ‘పట్నం’ తెలంగాణలోని విద్యావంతులు, శాస్త్రవేత్తలు జనహిత అధికార ప్రముఖులు అంతే దృఢ సంకల్పంతో, స్వార్థరహితంగా హైదరాబాద్‌ను నవీన వైజ్ఞానిక పరిశోధనల, సాంకేతికతల నెలవుగా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేశారు. ఈ విద్యాధికులు, వైజ్ఞానికులలో అత్యధికులు హైదరాబాద్ వెలుపలి ప్రాంతాలకు చెందినవారే. ఉస్మానియా విశ్వవిద్యాలయ భావనకు అంకురార్పణ చేసి, దాని ఆధారంగా ఒకనాడు విద్వత్ కేంద్రంగా వెలుగొందిన బాగ్దాద్‌లా హైదరాబాద్‌ను ప్రపంచ మేధో కేంద్రంగా అభివృద్ధిపరచాలని కలలుగన్న ఉదాత్తులే అందుకొక నిదర్శనం. నిజాం నవాబు పాలన దౌష్ట్యాలపై కుల మతాలకు అతీతంగా తిరగబడిన వీర తెలంగాణ త్యాగధనులవలే ఈ విద్వత్ తెలంగాణలోని వారూ తమ వ్యక్తిగత బాంధవ్యాలలో గానీ, సామాజిక సంబంధాలలో గానీ, వృత్తిగత వ్యవహారాలలోగానీ కుల మతాల సంకుచిత పరిమితులను అధిగమించినవారే. వీర తెలంగాణ యోధులతో పాటు ఈ విద్వత్ పరులు, వైజ్ఞానికులను ఈ సందర్భంగా సంస్మరించుకుని గౌరవించాలి. ఇదే సమయంలో, నేటి స్వార్థ ప్రయోజనాలకు వీర తెలంగాణ చరిత్రపై మతం మరకలు వేసేందుకు జరుగుతోన్న ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా రూపొందేందుకు కారకులైన వారందరూ ముఖ్యంగా తొలినాళ్లలో మేధో శ్రమను జీవనశైలిగా చేసుకోవాలనే సంకల్పం, తమ కృషి సమాజ శ్రేయస్సుకు తోడ్పడేదికావాలన్న లక్ష్యమూ ఉన్నవారే. బహుళ మేధో రీతులలో లక్ష్య సంకల్పాలలో ఏకత్వాన్ని సమష్టిగా ఆచరించిన ఆదర్శప్రాయులు. మరింత సమున్నతంగా ఈ బహుళ ఏకత్వాన్ని హైదరాబాద్ నగర గంగా–జముని తెహజీబ్‌తో మేళవించినప్పుడే సెప్టెంబర్ 17కు స్ఫూర్తిదాయక సార్థకత సమకూరుతుంది. మేధోభాగ్యనగరి సకల మనుషులను సమదృష్టితో ప్రేమించే, గౌరవించే సమాజంగా కూడా వర్థిల్లుతుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం