Bhubharati : ధరణి కష్టాలకు ‘భూభారతి’తో చెల్లు!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:18 AM
కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కూడా కేటాయించనున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. భూభారతి రూల్స్‌ను
కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కూడా కేటాయించనున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. భూభారతి రూల్స్‌ను సైతం ప్రభుత్వం రెవెన్యూ నిపుణుల అభిప్రాయాల మేరకు రూపొందిస్తే ఈ చట్టం పరిపూర్ణం కానుంది. చరిత్రలో గొప్ప భూ చట్టంగా మిగిలిపోనుంది.
అద్భుతం, బ్రహ్మండం అని ప్రచారం చేసిన ‘ధరణి’ రాకతో రైతులకు ఏం మాత్రం ప్రయోజనం కలగకపోగా సరికొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చిన కొత్తలోనే ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేసింది. కొత్త ఆర్వోఆర్ చట్టం తెస్తే తప్ప ధరణి దారిద్య్రానికి చెక్ పడదని భావించింది. దీంతోనే ఆర్వోఆర్ చట్టం–-2024 ‘భూభారతి’కి బీజం పడింది.
గత ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ సమయంలో రెవెన్యూ ఉద్యోగులకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో మొక్కుబడిగా భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. అదే సమయంలో రకరకాల సాకులతో లక్షలాది ఎకరాల భూములను పార్ట్-–బి కింద పెట్టారు. వీరికి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలున్నా కొత్త పుస్తకాలు జారీ చేయలేదు. చివరకు ఈ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు కూడా చేయలేదు. ధరణి రాకతో లక్షలాది మంది రైతులు ఉన్న హక్కులను కోల్పోయారు. వివిధ రకాల సాకులతో ఏకంగా 18.45 లక్షల భూమిని రికార్డుల్లోకి ఎక్కించలేదు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన భూ సమస్యలను హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ వరకు తెచ్చారు. రెవెన్యూ కోర్టులను ఎత్తేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని చేయకపోగా, జిల్లా స్థాయిలోనే మమ అనిపించి ఏ ఒక్కరికీ న్యాయం చేయకుండానే సివిల్ కోర్టులను ఆశ్రయించాలని సెలవిచ్చారు. భూ సమస్యలుంటే ధరణి పోర్టల్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం చేస్తామంటూ ఉచిత ప్రకటనలు నాటి ప్రభుత్వ పెద్దలే చేశారు. దరఖాస్తు రుసుంగా వేలకు వేల రూపాయలు వసూలు చేశారు. ఈ విధంగా చేసినా ఏ ఒక దరఖాస్తునూ ధరణి పరిష్కరించలేదు. మాడ్యూల్స్ పేరుతో సుమారు నాలుగేళ్లు ఊరిస్తూ రైతులను కష్టాలకు గురి చేస్తూ వచ్చారు.
రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త ఆర్వోఆర్ చట్టంతోనే సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. రెవెన్యూ అధికారులకు అధికారాలు ఇస్తూ, రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ, భూ సమస్యల పరిష్కరించేందుకు ఆర్వోఆర్ చట్టం–-2024 భూభారతి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ముందుగా ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఇదే ముసాయిదాపై తొలిసారిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సైతం తీసుకున్నారు. వీటన్నింటి క్రోడీకరణ తర్వాతనే భూ భారతి బిల్లు–-2024ను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. గవర్నర్ ఆమోదం సైతం ఇటీవలనే లభించింది.
ధరణి పోర్టల్ బాధ్యతలను గత ప్రభుత్వం విదేశీ సంస్థ టెర్రాసిస్‌కు ఇచ్చింది. విదేశీ సంస్థ చేతిలో మన రాష్ట్రంకు సంబంధించిన విలువైన భూములను పెట్టడం సరైన పద్ధతి కాదనేది మొదటి నుంచీ ఉన్న విమర్శ. టెర్రాసిస్ కాంట్రాక్టు గడువు గత ఏడాది డిసెంబరు 31తో ముగిసింది. వెనువెంటనే రేవంత్ సర్కార్ పోర్టల్ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. ఈ విధంగా ధరణితో పాటు టెర్రాసిస్‌కు కూడా ప్రభుత్వం మంగళం పాడింది.
కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రాష్ట్రంలో భూ సమస్యలకు చెక్ పడనుంది. ఇదే కాకుండా రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కూడా కేటాయించనున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కూడా పూర్తవుతుంది. కానీ, వారసత్వంగా జరిగే భూముల బదిలీ (ఫౌతీ)లో కొత్త నిబంధన తీసుకొచ్చారు. తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగినా, మ్యుటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీవోకు అప్పగించారు. నిర్ణీత కాలంపాటు (30 రోజులు) మ్యుటేషన్ చేయకుండా నిలిపివేస్తారు. ఆ లోగా ఆ భూమిపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు. కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38- ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ అధికారాలను ఆర్డీవోకు ఇవ్వడం జరిగింది.
ధరణి పోర్టల్‌లో మొత్తం 33 మాడ్యూళ్లు ఉండగా భూభారతిలో వాటిని 6కు తగ్గించనున్నారు. ప్రస్తుతం భూమి పట్టాలో కేవలం రైతు పేరు మాత్రమే ఉండగా ఇకపై అనుభవదారు (కాస్తు) కాలమ్ సహా మొత్తం 11 కాలములు ఉంటాయి. పార్ట్–-బీ కేసులు పరిష్కారమైనవారి వివరాలను భూ రికార్డుల్లో ఎక్కించి, పాస్ బుక్ ఇచ్చేలా మార్పులు చేశారు. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. జిల్లా స్థాయిలోనే భూసమస్యలు పరిష్కారం అయ్యే వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లా స్థాయిలోనే ట్రిబ్యునళ్లను సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటితో కోర్టులపై ఒత్తిడి కూడా తగ్గనుంది. ధరణి ముసుగులో గత పాలకులు రెవెన్యూలో గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవలు అందించేందుకు గ్రామానికో రెవెన్యూ అధికారి రాబోతున్నారు.
గత ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టం–-2020 ద్వారా ధరణి పోర్టల్‌ను తెచ్చింది. కానీ చట్టానికి సంబంధించిన రూల్స్‌ను మాత్రం తేలేదు. ఆర్వోఆర్ చట్టం -20౨4కు భూభారతికి రూల్స్‌ను కేవలం మూడు నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రకటించిన దాని ప్రకారం రూల్స్ అనేవి ఆచరణాత్మకంగా ఉండేలా ఉండాలి. చట్టానికి రూల్సే ప్రాణం. వీటిని సైతం ప్రభుత్వం రెవెన్యూ నిపుణుల అభిప్రాయాల మేరకు రూపొందిస్తే భూ భారతి చట్టం పరిపూర్ణం కానుంది. చరిత్రలో గొప్ప భూ చట్టంగా మిగిలిపోనుంది.
డా. ఎన్.యాదగిరిరావు
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News