Delhi Air Oollution: కాలుష్య కౌగిలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:02 AM
తీవ్ర వాయుకాలుష్యం, పడిపోయిన ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచుతో దేశరాజధాని ఢిల్లీ పలు కష్టాల్లో మునిగిపోయింది. సోమవారం పెద్దసంఖ్యలో విమానాలు రద్దయ్యాయి...
తీవ్ర వాయుకాలుష్యం, పడిపోయిన ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచుతో దేశరాజధాని ఢిల్లీ పలు కష్టాల్లో మునిగిపోయింది. సోమవారం పెద్దసంఖ్యలో విమానాలు రద్దయ్యాయి, వాయిదాపడ్డాయి, ప్రధాని విదేశీ పర్యటన సైతం ప్రభావితమైంది. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనబడక అనేక ప్రమాదాలూ జరిగాయి. గాలి నాణ్యతా సూచీ అతి ప్రమాదకర స్థాయిలో ఐదువందల వరకూ నమోదైంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) స్టేజ్ ఫోర్ మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణపనులు, స్టోన్ క్రషింగ్, మైనింగ్ ఇత్యాదివి నిలిచిపోయాయి. కార్లు, భారీ వాహనాల రాకపోకలమీద ఆంక్షలు, స్కూళ్ళ మూసివేతతోపాటుగా యాభైశాతం ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయమన్నారు. చివరకు రెస్టారెంట్లలో తందూరీ రోటీ తయారీని సైతం నిషేధించారట. పలుదేశాలు ఢిల్లీలో ఉంటున్న తమవారిని బయట తిరగవద్దని జాగ్రత్తలు చెప్పాయి. ఢిల్లీలో అత్యయిక స్థితి నెలకొని ఉంది.
విషపుగాలితో విలవిలలాడిపోతున్న ఢిల్లీ జనాలకు శ్వాసకోశశక్తిని ఏ విధంగా పెంచుకోవాలో రామ్‌దేవ్ బాబా సలహాలు చెబుతున్నారు. ముక్కుపుటాలు అదిరిపోతూ, కళ్ళు మండిపోతూ, ఊపిరందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సామాన్యజనానికి వేరే దిక్కులేనప్పుడు వీరే దిక్కు. కొవిడ్ కాలంలో పేదలు ఆక్సిజన్ దొరకక రోడ్లమీదే ప్రాణాలు వదిలేస్తుంటే, ధనికులను ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు రక్షించిన గతం ఇప్పుడు చాలామందికి గుర్తుకు వస్తున్నది. చుట్టూ కమ్మేసిన విషపు గాలి తమను తాకకుండా ఎయిర్ ఫ్యూరిఫయిర్లు, డీహ్యుమిడిఫయర్లు్, ఖరీదైన క్లీన్‌ఎయిర్ వ్యవస్థలతో ధనికులు తమ ఇళ్ళను శత్రుదుర్భేద్యమైన కోటల్లాగా ఎలా మార్చుకున్నారో మీడియా వివరిస్తోంది. మాస్కులు కూడా నిలువరించలేని స్థాయికి కాలుష్యం చేరుకున్నప్పుడు విషపుగాలిని దిగమింగడం వినా పేదలు చేయగలిగేదేమీ లేదు. ఢిల్లీ వాసులు ముప్పై సిగరెట్లు తాగినంత కాలుష్యాన్ని భరిస్తున్నారన్న లెక్కలు పేదలకు వర్తిస్తాయి తప్ప, ధనికులకు కాదు. స్వచ్ఛమైన గాలిపీల్చడం ప్రాథమిక హక్కు కావచ్చు గానీ, మిగతా హక్కులమాదిరిగా అది కూడా ఉన్నవాళ్ళకే దక్కుతుంది.
వాతావరణం అతివేగంగా దిగజారిపోవడం మనకు ఒక హెచ్చరిక. పిల్లలు, వృద్ధులనే కాదు, ఆరోగ్యవంతులను కూడా ఆస్పత్రుల్లో పడవేసేంత దుర్భరంగా పరిస్థితులు మారిపోయాయి. రేపటిరోజుల్లో కాస్తంత మెరుగుపడినప్పటికీ, ఢిల్లీ కాలుష్యం తాత్కాలిక, స్వల్పకాలిక చర్యలతో పరిష్కారం కాబోదన్నది నిజం. ప్రపంచ ఆరోగ్యసంస్థ విధించిన పరిమితికి ముప్పైరెట్ల కాలుష్యాన్ని రాజధాని వాసులు చవిచూస్తున్నప్పటికీ, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ లేకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. పదిరోజుల క్రితం పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు నిరసనప్రదర్శన నిర్వహిస్తూ, ఢిల్లీ కాలుష్యం వల్ల పసికందులు మరణిస్తున్నారని, పిల్లలూ వృద్ధులూ రోగానపడుతున్నారని, పరిష్కారాలమీద సభలో చర్చజరగాలని డిమాండ్ చేశాయి. ఇది రాజకీయాంశం కాదని, ప్రభుత్వం చర్చకు సిద్ధపడితే చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది. దీనికి ఓ నాలుగురోజుల ముందు సుప్రీంకోర్టు ఢిల్లీ కాలుష్యంమీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, పొరుగురాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలు తగలబెట్టడమే కాలుష్యానికి కారణమని కేంద్రం అంటున్నందుకు ఆగ్రహించింది. కరోనాకాలంలో ఢిల్లీ ఆకాశవీధులు స్వచ్ఛంగా, నీలంగా ఉన్నాయని, పంటవ్యర్థాల దహనం ఇప్పటికంటే అప్పుడు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ, గాలి నాణ్యతకు ఏ లోటూ రాలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేంద్రానికి గుర్తుచేశారు. నెపం రైతులమీదకు నెట్టివేయకుండా సమస్య పరిష్కారాలను అన్వేషించమంటూ హితవు చెప్పారు. గత మూడేళ్ళలో పంటవ్యర్థాల దగ్ధం 90శాతం తగ్గిపోయిందని ఇటీవల సభాముఖంగా అంగీకరించిన కేంద్రం, అసలు కాలుష్య కారకాల మీద దృష్టిపెట్టడానికి సిద్ధపడటం లేదు. ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో కోట్లాదిమంది ఉసురుతీస్తున్న కాలుష్యం మీద రాజకీయాలకు అతీతంగా సభలో చర్చించి, సమష్టి నిర్ణయాలు చేద్దామంటూ రాహుల్ సభాముఖంగా అభ్యర్థించినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఊరుకుంది. వందేమాతరం మీద చర్చపేరిట సభలో అనేకగంటల పాటు నెహ్రూమీద అక్కసు తీర్చుకున్న పాలకులకు ప్రజలను పట్టిపీడిస్తున్న ఒక ప్రధాన సమస్య పట్టకపోవడం విచిత్రం, విషాదం.
ఇవి కూడా చదవండి..
నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి