RK Kothapaluku : ఉచితాల ఊబిలో ‘రుణ భారతం’!
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:46 AM
RK Kothapaluku : ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని వామపక్ష అతివాది తరిమెల నాగిరెడ్డి నాలుగున్నర దశాబ్దాల క్రితమే రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన ఆయన అప్పట్లో ‘ఇండియా మార్ట్‌గేజ్డ్’ పేరిట ఇంగ్లీషులో ఈ పుస్తకం రాశారు...
‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని వామపక్ష అతివాది తరిమెల నాగిరెడ్డి నాలుగున్నర దశాబ్దాల క్రితమే రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన ఆయన అప్పట్లో ‘ఇండియా మార్ట్‌గేజ్డ్’ పేరిట ఇంగ్లీషులో ఈ పుస్తకం రాశారు. తరిమెల నాగిరెడ్డి మరెవరో కాదు! మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా బావమరిది. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన ఈ వ్యవస్థ పట్ల విరక్తితో తన రాజీనామాను ప్రకటిస్తూ శాసన సభలో చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ఐదు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం మన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం చేస్తున్న హామీలు, ఉచితాల పేరిట ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే నిజంగానే భారతదేశం తాకట్టులోకి వెళ్లడానికి ఎంతో కాలం పట్టదన్న భావన ఏర్పడుతోంది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడి మరీ ఉచితాలను ప్రకటిస్తున్నాయి. అప్పుచేసి పప్పు కూడు పెడతామని ఆర్భాటంగా చెబుతున్నాయి. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజల నెత్తిన అప్పుల భారం మోపే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? రాష్ర్టాలలో అధికారంలోకి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలు కూడా ఉచితాల విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఉచితాలను అరికట్టే బాధ్యత తీసుకోవడానికి ఒక్క వ్యవస్థ కూడా ముందుకు రావడం లేదు. ఈ అంశం ఎన్నికల కమిషన్ చూసుకోవాలని సుప్రీంకోర్టు తప్పించుకుంటోంది. ఎన్నికల కమిషన్ కూడా తానేమీ చేయలేనని, రాజకీయ పార్టీలే స్వీయ నియంత్రణ పాటించాలని చేతులెత్తేస్తోంది. పులి మీద స్వారీ చేస్తున్న రాజకీయ పార్టీలు ఈ ఉచితాలకు ఎక్కడో ఒకచోట చెక్ పడాలని బలంగా కోరుకుంటున్నప్పటికీ ఆ పని మాత్రం తాము చేయలేమని చెబుతున్నాయి.
సాధించిందేమిటి?
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ దేశంలో పేదరికం పెరిగిందనుకోవాలా? అభివృద్ధి జరగలేదని భావించాలా? అంటే తమ ఏలుబడిలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్‌లా పరుగులు తీసిందని ఇవే రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పుకొంటున్నాయి. నిజంగా అభివృద్ధి జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కదా? అలాంటప్పుడు ఉచితాల అవసరం ఏమిటి? అంటే సమాధానం దొరకదు. ఢిల్లీలో ఆప్ రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంది. అయినా ఈ ఎన్నికల్లో మరిన్ని ఉచితాలు ప్రకటించారంటే తమ ఏలుబడిలో పేదరికం పెరిగిందని అంగీకరిస్తారా? ఉపాధి కోసం సమీప రాష్ర్టాల ప్రజలు దేశ రాజధాని ఢిల్లీకి వలస వస్తున్నారు. ఢిల్లీలో ఉపాధి లభించని పక్షంలో ఈ వలసలు ఉండవు కదా! అయినా నిరుద్యోగ భృతి ఇస్తామనడం ఏమిటి? పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును దానకర్ణుల వలె పంచిపెట్టే అర్హత, హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుందా? అంటే సమాధానం దొరకదు. ఢిల్లీ వార్షిక బడ్జెట్ 75 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 40 వేల కోట్ల రూపాయలకు పైగా అవసరం. ఇదెలా సాధ్యం? అదేమంటే అప్పు చేస్తామంటున్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విపరీత పోకడలను ఊహించే కాబోలు రాష్ర్టాలు అప్పులు చేయడానికి కూడా పరిమితులు పెట్టారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ పరిమితులకు రాష్ర్టాలు తూట్లు పొడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ర్టాలలో అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ పరిమితులను పట్టించుకోకుండా అప్పులు చేసుకోనిస్తోంది. రాష్ర్టాలు మాత్రమే కాదు– కేంద్ర ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు ప్రస్తుతం కోటీ 81 లక్షల 74 వేల 284 కోట్లకు చేరింది. అంటే దాదాపు రెండు కోట్ల కోట్ల రూపాయలకు అప్పు పెరగబోతోంది. రాష్ర్టాలు చేసిన అప్పులు కూడా కలుపుకొంటే ఈ మొత్తం రెట్టింపు అవుతుంది. రాష్ర్టాలు అప్పుపాలై బలహీనపడితే కేంద్రం కూడా బలహీనమవుతుంది. ఇటు రాష్ర్టాలు, అటు కేంద్రం అప్పులు చేసుకుంటూ పోతే ఆ అప్పు ఎవరు తీర్చాలి? ఏదో ఒకరోజు దేశం దివాలా తీయదన్న గ్యారంటీ ఉందా? మన పొరుగున ఉన్న శ్రీలంకలో ఏం జరిగిందో చూశాం. ఒకప్పుడు సంపన్న దేశంగా ఒక వెలుగు వెలిగిన వెనెజువెలాలో ఉచితాల భారం పెరిగి ఇప్పుడు అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పట్టెడన్నం కోసం పడుపు వృత్తి చేయడానికి కూడా వెనుకాడని దుర్భర పరిస్థితులున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు అమలు చేసుకుంటూ పోతే ఈ అప్పులు రెట్టింపు అవడానికి ఎంతో సమయం పట్టదు.
గెలిపించేది పథకమేనా?
ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పథకాన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఎంత గొప్ప పథకమైనా దాని ప్రభావం ఒక ఎన్నికకు మాత్రమే పరిమితమవుతోంది. ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు మరో కొత్త పథకం ప్రకటించాల్సిన పరిస్థితి. 1983లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రకటించి అధికారంలోకి వచ్చారు. 1989 ఎన్నికల్లో అధికారంలో కొనసాగడానికి ఈ పథకం అక్కరకు రాలేదు. ఆయన అధికారం కోల్పోయారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ పది వేల కోట్లు మాత్రమే. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అప్పట్లో విప్లవాత్మక సంక్షేమ పథకంగా పేరొందింది. ఇప్పుడు విడిపోయిన రెండు తెలుగు రాష్ర్టాల బడ్జెట్‌లను కలిపితే ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం వాంఛనీయమా? ఇప్పటి దాకా దక్షిణాది రాష్ర్టాలకే పరిమితమైన ఉచితాల వెర్రి ఇప్పుడు ఉత్తరాది రాష్ర్టాలకు కూడా విస్తరించింది. దాని పర్యవసానమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఫ్రీ హామీలు! దక్షిణాది రాష్ర్టాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ర్టాల ఆదాయం తక్కువ. ఇప్పుడు అక్కడ కూడా అప్పులు చేసి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే దేశం దివాలా తీయడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు కళ్లు మూసుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఉచితాల విషయంలో పోటీ పడుతోంది. మహారాష్ట్రలో ప్రతి మహిళకూ నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక్క మహిళకు నెలకు రెండున్నర వేలు ఇస్తామని ప్రకటించారు. పేదరికానికి నిర్వచనం మార్చి ఓట్లు కొల్లగొట్టేందుకు ఉచితాలను ప్రకటిస్తున్నారు. అంతిమంగా ఇది భారతదేశాన్ని పేద దేశంగా మార్చివేయదా? రాజకీయ పార్టీలు ఆయా ఎన్నికల్లో ప్రకటిస్తున్న ఉచితాలు ప్రజలకు హక్కుగా మారిపోతున్నాయి. దీంతో కొత్త పథకాల అన్వేషణ కొనసాగుతోంది. సంక్షేమం పేరిట అడ్డగోలుగా ప్రకటిస్తున్న పథకాల వల్ల రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతోంది.
అమలులో అష్ట కష్టాలు...
ఎన్నికల్లో ప్రకటించిన పథకాలను అమలు చేయగలుగుతున్నారా అంటే అదీ లేదు. దక్షిణాది రాష్ర్టాలు, ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల విషయమే తీసుకుందాం! కర్ణాటకలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట పథకాలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక గుడ్లు తేలేస్తున్నారు. అన్నీ ఉచితం అంటే ఎలా? అని మంత్రులు చిర్రుబుర్రులాడుతున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటి అమలుకు నిధుల లేమి కారణంగా ప్రభుత్వం దిక్కులు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పులపాలైంది. ఇప్పుడు అమలులో ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్ పరిమితికి మించి 50 వేల కోట్ల రూపాయల వరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అప్పు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. బిల్లులు చెల్లించలేని స్థితి ఉన్నందున రాష్ట్రం చేపడుతున్న నీటి పారుదల, ఇతర రంగాలలోని పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ రాష్ర్టాలు సంపన్న రాష్ర్టాలుగా ఉండేవి. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ పదేళ్లలోనే అప్పులకోసం వెదుక్కోవలసిన పరిస్థితి తెలంగాణ రాష్ర్టానికి ఎందుకు వచ్చిందంటే, అలవిగాని సంక్షేమ పథకాల వల్లే! చేసిన అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు? అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియని కారణంగా హామీలు ఇచ్చామని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వంటి వారు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. పదేళ్ల క్రితం వరకు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. హామీలు ఇచ్చేటప్పుడు ముందూ వెనుకా చూసుకోవలసిన అవసరం ఉందో లేదో తెలియదా? తెలియదనడం సమర్థనీయం కాదు. ఎన్నికల ప్రణాళిక ప్రకటించే ముందు అందుకోసం ఒక కమిటీని నియమిస్తారు కదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయకుండానే ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ హామీలకు రూపకల్పన చేస్తుందా? మరోవైపు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లకు చేరుకున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోయాయి. అయినా కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది.
ఏపీలో మరింత దయనీయం...
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉంది. తెలంగాణలో ఆదాయం తెచ్చిపెట్టడానికి హైదరాబాద్ అయినా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు అది కూడా లేదు. బటన్లు నొక్కడం మాత్రమే ముఖ్యమంత్రి చేయవలసిన పని అని భావించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందిన కాడికి అప్పులు చేసి సంక్షేమం పేరిట డబ్బు పంచిపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా కుదువపెట్టారు. రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లకు చేరాయి. అప్పుడు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇదంతా తెలుసు. అయినా ఎన్నికల సందర్భంగా ‘సూపర్ సిక్స్’ పేరిట కొత్త పథకాలను కూటమి ప్రకటించింది. నిజానికి ఆ పథకాలు ప్రకటించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చేది. సంక్షేమం పేరిట ప్రజలకు ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు పంచి పెట్టానని ప్రకటించుకున్న జగన్‌రెడ్డికి 11 సీట్లు చాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలనా అనుభవం లేదా, అంటే కావాల్సినంత ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు తెలియదా, అంటే తెలుసు. అయినా సూపర్ సిక్స్ అని కొత్త పథకాలు ఎందుకు ప్రకటించారంటే, ఎన్నికల గండం గట్టెక్కడానికి. తాజా ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఆయనకు ముఖ్యం. అందుకే ముందూ వెనుకా చూడకుండా హామీలు ఇచ్చారు. ఇప్పుడు సదరు హామీలను ఎలా అమలు చేయాలా? అని దిక్కులు చూస్తున్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇప్పుడు చెబుతున్నారు. ఈ విషయం చంద్రబాబుకంటే ప్రజలకే ఎక్కువ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో జగన్‌రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించారు. సంక్షేమం పేరిట రెండు లక్షల కోట్లు పంచినా ప్రజలు ఆయనను ఓడించబోతున్నారని చంద్రబాబుకు తెలియదా? అలాంటప్పుడు కొత్త హామీల అవసరం ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అధికారంలోకి వస్తేగానీ ఆయనకు ఆ విషయం తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా హామీలు ఇవ్వడం కచ్చితంగా తప్పే. సూపర్ సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేశారని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది. హామీలను అటకెక్కించడానికే ఆర్థిక విధ్వంసం అన్న పాట పాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇందులో ఆక్షేపించవలసిందేమీ లేదు. హామీల అమలుకోసం పాలక పక్షంపై ఒత్తిడి తేవడం ప్రతిపక్షం హక్కు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయి. అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. ఈ రెండు రాష్ర్టాలలో సంక్షేమం పేరిట ఒక్కో కుటుంబానికి సాలీనా రూ.40వేల నుంచి 50 వేలు పంచిపెడుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పథకాల డబ్బుతో ప్రజలు పండుగ చేసుకున్నారని, ఇప్పుడు పథకాలు అమలుకాక ప్రజల పరిస్థితి దీనంగా ఉందని జగన్ రోత మీడియా శోకాలు పెడుతోంది. డిసెంబరు 25న క్రిస్మస్ పండగను ప్రజలు గొప్పగా జరుపుకొన్నారని కథనం వండి వార్చిన సదరు రోత మీడియా ఆ తర్వాత ఇరవై రోజులకే వచ్చిన సంక్రాంతి పండుగ మాత్రం ప్రజల వద్ద డబ్బులు లేక వెలవెల పోయిందని వాంతి చేసుకున్నారు. ఆ రోత మీడియా పోకడలను ఎండగట్టడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
చేసేవారికి పని... తినడానికి తిండి!
రాష్ట్రం విడిపోక ముందు, తర్వాత కూడా ప్రజలు బతుకుతూనే ఉన్నారు. పండుగలు, పబ్బాలు జరుపుకొంటూనే ఉన్నారు. మన దేశంలో ఇప్పుడు ఆకలి చావులు లేవు. చేయడానికి పని దొరకడం లేదన్న పరిస్థితి లేదు. చదువుకున్న వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదేమోగానీ బతకడానికైతే చిన్నా చితకా ఉద్యోగాలకు కొదవ లేదు. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలనుకోవడంలోనే తంటా అంతా. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పనులు చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. వ్యవసాయ పనులకు కూడా గ్రామాలలో కూలీలు లభించడం లేదు. బిహార్, ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే దిక్కవుతున్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ర్టాలలో చిన్న చిన్న హోటళ్లలో కూడా ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వాళ్లే ఎక్కువగా పనిచేస్తున్నారు. తెలుగువాళ్లు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారికి ఆ అవసరం లేదు. ప్రభుత్వం సంక్షేమం పేరిట డబ్బు పంచుతున్నందున పని చేయడానికి మనసొప్పడం లేదు. ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నందున ఎవరు మాత్రం పని చేస్తారు? మన దేశానికి ప్రధాన బలం శ్రామిక శక్తే అని మరచిపోయే పరిస్థితి దాపురించింది. ప్రజలను సోమరిపోతులుగా మార్చిపడేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఉత్పత్తి కూడా కుంటుపడుతుంది. కార్మిక శక్తిలో అంకిత భావం కొరవడుతోంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉత్తరాది రాష్ర్టాలకు కూడా విస్తరిస్తున్నందున మన తెలుగు రాష్ర్టాలలో పనులు చేయడానికి ఆయా రాష్ర్టాల వాళ్లు కూడా లభించకపోవచ్చు. యాంత్రీకరణ ఎంతగా వినియోగంలోకి వచ్చినా కూలీల అవసరానికి ప్రత్యామ్నాయం లభించదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో సోమరిపోతుల సంఖ్య పెరిగితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఉత్పత్తి కుంటుపడితే ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోతుంది. అప్పుడు సంక్షేమ పథకాల అమలుకు కూడా అప్పులు దొరకవు. సంపద పెంచడానికి కృషి చేయకుండా పంచుకుంటూ పోతే చివరికి పుట్టుగోచీ మాత్రమే మిగులుతుంది. మన దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్ని రాజకీయ పార్టీలూ గొప్పలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఎగుమతులు పెరిగి మన రూపాయి బలపడాలి కదా? నానాటికీ మన రూపాయి క్షీణించడానికి కారణం ఏమిటి? ప్రజలను ఉచితాలపై మాత్రమే ఆధారపడేలా చేయడం వల్ల కొనుగోలు శక్తి సన్నగిల్లుతోంది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. సమాజంలో అంతరాలు పెరిగి అశాంతి చోటుచేసుకుంటోంది. ఒక ఎల్లయ్య లేదా మరో పుల్లయ్య ముఖ్యమంత్రి అవడం కోసం అడ్డగోలుగా ఉచిత పథకాలు ప్రకటించడాన్ని అనుమతించాల్సిందేనా? ఉచితాలకు అలవాటుపడిన వారు ఎవరు ఎక్కువ ఇస్తారని ఎదురుచూడటం సహజం. ఇప్పుడు తెలుగు రాష్ర్టాలలో అదే జరుగుతోంది. తెలుగునాట ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఉత్తరాది రాష్ర్టాలలో అమలు కాకపోయినా అక్కడి ప్రభుత్వాలు మళ్లీ మళ్లీ అధికారంలోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌వంటి వారు ఇందుకు ఉదాహరణ. అప్పుల మీద అప్పులు చేసి బటన్లు నొక్కిన జగన్‌రెడ్డి దారుణంగా ఓడిపోవడం రాజకీయ పార్టీలకు గుణపాఠం కాదా? ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉచితాల పేరిట ఈ పరుగు పందెం ఎంతదూరం? ఎంతకాలం? అప్పులు చేసి పప్పు కూడు పెట్టడం బాధ్యత గల రాజకీయ పార్టీలు చేయాల్సిన పనేనా? ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుంటే ప్రజలకు పంచిపెట్టడంలో అర్థం ఉంది. మన తెలుగు రాష్ర్టాలలోనే కాదు. దేశ వ్యాప్తంగా గ్రామాలలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. ప్రధాన నగరాలలోనే రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు లేవు. నాణ్యమైన ఆహారాన్ని అందివ్వలేకపోతున్నాం. మెరిసేదంతా బంగారమని భ్రమిస్తున్నాం. రాజకీయ పార్టీల ఈ పోకడలకు అడ్డుకట్ట పడని పక్షంలో భవిష్యత్తును ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది.
అదే జరిగితే అదుకునేదెవరు?
ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉన్న గ్రీసు దేశం కొంతకాలం క్రితం దివాలా తీసినట్టు ప్రకటించుకోగా, తోటి యూరోపియన్ దేశాలు ఆదుకొని నిలబెట్టాయి. మన దేశానికి అటువంటి పరిస్థితి వస్తే ఎవరు ఆదుకుంటారు? మన దేశం నుంచి బ్రిటన్ దోచుకున్న సొమ్ముతో లండన్ నగరాన్ని పౌండ్లతో అనేక పర్యాయాలు కప్పవచ్చునని ఈ మధ్యే తేల్చారు. అలాంటి దేశం పేద దేశంగా, అప్పుల భారతంగా మిగిలిపోవాల్సిందేనా? ఈ విషయంలో రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దేశ హితవు కోరే ఆలోచనా పరులే అడ్డగోలు ఉచితాల కట్టడికి నడుం బిగించాలి. నిజానికి పిల్లి మెడలో గంట కట్టే వారి కోసం రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల్లో ఉచితాల ప్రకటనలకు అడ్డుకట్ట పడని పక్షంలో అధికారంలోకి ఎవరు వచ్చినా వాటి భారం మోయలేని పరిస్థితి వస్తుందని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. అయితే పోటీలో తాము వెనుకబడకూడదన్న ఉద్దేశంతో ర్యాట్ రేస్‌లో భాగమవుతున్నాయి. ప్రభుత్వాల ఆదాయంలో ఉచితాలకు సీలింగ్ విధించాల్సిన తరుణం ఆసన్నమైంది. అది మా పని కాదని ఇటు న్యాయ వ్యవస్థ, అటు ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలు తప్పించుకోవడం దేశం పట్ల తమ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన పార్టీలు అధికారం నుంచి తప్పుకొని తిరిగి ఎన్నికలకు వెళ్లేలా నిబంధన విధించాల్సిన అవసరం లేదా? హామీలు అమలు చేయకపోయినా ఐదేళ్లు అధికారంలో కొనసాగవచ్చునన్న ధీమా ఉన్నందునే నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారు. ఈ దుస్థితి పోవాలంటే ప్రభుత్వ ఆదాయంలో ఇంత శాతాన్ని మించి సంక్షేమానికి ఖర్చు పెట్టకూడదు– ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడని పక్షంలో అధికారం నుంచి దిగిపోవాలన్న షరతులు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో భారతదేశం నిజంగానే తాకట్టులోకి వెళ్లిపోతుంది. కొవిడ్ తర్వాత ఐరోపాలోని కొన్ని దేశాలతోపాటు మరికొన్ని పశ్చిమ దేశాలు ప్రజలకు డబ్బు పంచి పెట్టాయి. ఈ కారణంగా అప్పటివరకు పటిష్ఠంగా ఉన్న ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కుదేలయ్యాయి. ధనిక దేశాలు కూడా అప్పుల పాలయ్యాయి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతే పైకి లేవడం అంత ఈజీ కాదు. శ్రీలంక చిన్న ద్వీపం కనుక కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ప్రజలే ముకుతాడు వేయాలి!
ఆర్కే