Uniform Civil Code : సంస్కరణా? సంఘర్షణా?
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:23 AM
భావజాల ప్రేరణతో వ్యవహరించే భారతీయ జనతా పార్టీ మన సంవిధానం నిర్దేశించిన పై మాటల (అధికరణ 44) పట్ల చిత్తశుద్ధి చూపుతుందా? ఉమ్మడి పౌరస్మృతి అనే మాటలకు మాత్రం బాగా ప్రాధాన్యమిస్తుంది. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. అయితే ఆ అధికరణలోని ‘పౌరులు’, ‘దేశ వ్యాప్తంగా’ అనే మాటలను మనం ఉపేక్షించకూడదు.
పౌరులు అందరికీ దేశవ్యాప్తంగా అన్వయించే ఉమ్మడి పౌర స్మృతి అమలుపరిచే ప్రయత్నం చేయవలెను.
– భారత రాజ్యాంగం
భావజాల ప్రేరణతో వ్యవహరించే భారతీయ జనతా పార్టీ మన సంవిధానం నిర్దేశించిన పై మాటల (అధికరణ 44) పట్ల చిత్తశుద్ధి చూపుతుందా? ఉమ్మడి పౌరస్మృతి అనే మాటలకు మాత్రం బాగా ప్రాధాన్యమిస్తుంది. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. అయితే ఆ అధికరణలోని ‘పౌరులు’, ‘దేశ వ్యాప్తంగా’ అనే మాటలను మనం ఉపేక్షించకూడదు.
మన సువిశాల భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే నివసించే లేదా స్థిరపడే హక్కు ప్రతి పౌరునికీ ఉన్నదని, సకల ప్రదేశాలలోను సమస్త పౌరులకూ ఉమ్మడి పౌరస్మృతినే వర్తింపచేయాలన్నది మన రాజ్యాంగ సంకల్పం. అధికరణ 44 ఉద్దేశం అదే. ఎక్కడైనా సరే నివసించి లేదా స్థిరపడి ఒక పౌరస్మృతి లబ్ధిని పొందే హక్కు సమస్త పౌరులకు లభించేందుకు భారత రాజ్య వ్యవస్థ బాధ్యత. పార్లమెంటు చాల వరకు ఈ బాధ్యతను నిర్వహించింది. భారత పౌరులు అందరూ ఒకే కాంట్రాక్టుల చట్టం (లా ఆఫ్ కాంట్రాక్ట్స్ – చట్ట ప్రకారం ఒక ఒప్పందం ఆమోదయోగ్యం కావాలంటే ఆ ఒప్పందం పాటించవలసిన నియమ నిబంధనలను కాంట్రాక్టుల చట్టం నిర్దేశించింది. ఈ నియమ నిబంధనలను పాటించని ఒప్పందాలు చెల్లుబాటు కావు), ఒకే కాల దోష పరిమితి శాసనం (లా ఆఫ్ లిమిటేషన్), ఏ సివిల్ న్యాయస్థానంలోనైనా ఒకే విధమైన విచారణ ప్రక్రియ, పౌరుని సాంఘిక (నేర వ్యవహారాలతో సంబంధం లేని) విషయాలన్నిటికీ ఒకే విధమైన పౌర స్మృతిని అమలుపరచడం ప్రభుత్వ కర్తవ్యం.
వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన సాంఘిక వ్యవహారాలకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చే బాధ్యత, అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం వివాహం, విడాకులు, వారసత్వం, వారసత్వ సంక్రమణ వ్యవహారాలపై చట్టాన్ని తీసుకువచ్చే ఈ బృహత్తర బాధ్యతను స్వయంగా నిర్వహించడం ఒక దుస్సాహసమే. ఉత్తరాఖండ్ ఈ చట్టాన్ని భారతదేశ పౌరులు అందరికీ వర్తింపచేయగలుగుతుందా? ఇందుకు ఆ రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టిన పౌరుల విషయాన్ని తీసుకున్నా వారు ఉత్తరాఖండ్‌లో నివసించుతున్నంతవరకు మాత్రమే ఆ చట్టాన్ని వర్తింపచేయడం సాధ్యమవుతుంది. ఆ చట్టాన్ని ఇష్టపడని ఏ వ్యక్తి అయినా సరే ఉత్తరాఖండ్ నుంచి వెళ్లిపోయి వేరే ప్రాంతంలో స్థిరపపడం ద్వారా ఆ చట్టం నుంచి స్వేచ్ఛ పొందుతాడు. ఉత్తరాఖండ్‌లో నివసించేఒక పురుషుడు, ఒక మహిళ ఆ రాష్ట్రం వెలుపల సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకోగలుగుతారు. వారు ఉత్తరాఖండ్ నుంచి వెళ్లిపోకుండా, వివాహం చేసుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు.
మరో విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఉత్తరాఖండ్‌లో జన్మించిన వ్యక్తికి దేశవ్యాప్తంగా తన చట్టం అందుబాటులో ఉంచడం గానీ, వర్తింపచేయడం గానీ చేయలేదు. ఉత్తరాఖండ్లో పుట్టి, వేరే రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తి అక్కడ వారిని వివాహం చేసుకుని, వేరే వారి పిల్లలను దత్తత తీసుకున్నా, తన వీలునామాను అక్కడ రిజిస్టర్ చేయించినా వాటికి వర్తింపచేయదగిన శాసనం (అప్లికబుల్ లా) ఏది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉత్తరాఖండ్ చట్టం అమల్లో ఉన్న పార్లమెంటరీ చట్టంతో సంఘర్షిస్తే పార్లమెంటరీ చట్టమే చెల్లుబాటు అవుతుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చినా దాని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదనేది స్పష్టం. ఎవరూ కొట్టివేయలేని వాస్తవమిది. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజల ప్రతిస్పందనలను తెలుసుకునేందుకే ఆ చట్టాన్ని తీసుకువచ్చేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ ప్రోత్సహించిందన్నది స్పష్టాతి స్పష్టం. ఊహించిన విధంగానే ఉత్తరాఖండ్ చట్టం ఒక తీవ్ర చర్చను పురిగొల్పింది. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ –యూసీసీ) పై భావనను పరీక్షించేందుకు సమర్థమైన అధికారాలు ఉన్న రాజ్యాంగ సంస్థ లా కమిషన్. 19వ లా కమిషన్ ఆగస్టు 31, 2018న తన నివేదికలో ఇలా అభిప్రాయపడింది : ‘యూసీసీని సమకూర్చే చట్టాలను కాక వివక్షను పాటించే, ప్రోత్సహించే చట్టాలను ప్రధానంగా పరిశీలిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రస్తుత దశలో తప్పనిసరీ కాదు, వాంఛనీయమూ కాదు’.
మొత్తం మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వ లక్ష్యం సమాజ జీవితంలో మారుతున్న విలువలు ఆచారాలు, కట్టుబాట్లకు అనుగుణంగా ప్రగతిశీల, ఉదారవాద చట్టాన్ని తీసుకురావడం కాదని విశదమవుతుంది. కేంద్ర హోం మంత్రి మాటల్లో చెప్పాలంటే ‘తిరోగామి మతచట్టాల (పర్సనల్ లాస్)ను తొలగించడమే’నని చెప్పి తీరాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే అధిక సంఖ్యాక వాదాన్ని (మెజారిటేరియనిజం) దృఢంగా ప్రకటించడమే.
ఉత్తరాఖండ్ చట్టంలో మూడు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం (సెక్షన్లు 4 నుంచి 48 దాకా) ‘వివాహం’, ‘విడాకులు’కు సంబంధించినది; రెండో భాగం (సెక్షన్లు 49 నుంచి 377 దాకా) ‘వారసత్వం’కు సంబంధించినది; మూడో భాగం (సెక్షన్లు 378 నుంచి 389 దాకా) ‘సహజీవన సంబంధాలు’కు సంబంధించినది; నాల్గవ భాగం ఇతర అంశాలకు సంబంధించిన వివిధ నిబంధనలు. మొదటి భాగంలోని కొన్ని నిబంధనలు స్వాగతింపదగినవి. మారు మనువు, బహు భార్యాత్వాన్ని నిషేధించారు. వివాహ అర్హత వయసు యువతులకు 18, యువకులకు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివసిస్తున్న లేదా వేరే రాష్ట్రంలో జీవిస్తున్న ‘రెసిడెంట్ ’ (వాస్తవ్యుడు)కు ఈ చట్టం వర్తిస్తుంది. ‘వాస్తవ్యుడు’కు చాలా విస్తృత నిర్వచనమిచ్చారు : (1) ఉత్తరాఖండ్‌లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి; (2) ‘కేంద్ర ప్రభుత్వం’ అమలుపరుస్తున్న ఏదైనా పథకం లబ్ధిదారు’. ఈ చట్టం ఉత్తరాఖండ్ ‘ప్రాదేశిక అధికార పరిధి’ (టెర్రిటోరియల్ జ్యూరిస్‌డిక్షన్) ఉల్లంఘించింది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు చర్చనీయాంశాలు. ఉదాహరణకు విడాకులకు సంబంధించిన నిబంధనలు. కొన్ని నిబంధనలు యథా పూర్వస్థితిని సమర్థించేవి. ఒక వ్యక్తి పురుషుడు లేదా మహిళ కావచ్చు. ‘వివాహం’ అనేది పురుషుడు, మహిళ మధ్య జరగాలి. ఇటువంటి వివాహమే ధర్మ విహితమైనది. కొన్ని నిబంధనలు తిరోగమనపూర్వకమైనవి. కాలానికి అనుగుణంగా లేనివి. కాల దోషం పట్టిన ‘దాంపత్య హక్కుల పునఃస్థాపన’ (రెస్టిట్యూషన్ ఆప్ కాంజుగల్ రైట్స్) యథాతథంగా ఉంచారు.
మూడవ భాగం ‘సహజీవన సంబంధాలు’ గురించి విపులంగా ప్రస్తావించింది. ఇది తిరోగామి పూర్వకమైనదే కాక, రాజ్యాంగ విరుద్ధమైనది కూడా ఇది ఉత్తరాఖండ్ ‘వెలుపల’ నివసిస్తున్న ఉత్తరాఖండ్ ‘వాస్తవ్యులు’కు కూడా వర్తిస్తుందని ఆ చట్టం పేర్కొంది. విరోదాభాసకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. మూడో భాగం అంతా వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, గోప్యత, ఏకాంత హక్కుపై ఎటువంటి మినహాయింపులు లేని దాడి అని చెప్పి తీరాలి. పూర్తిగా రాజ్యంగ విరుద్ధం కనుక ఈ భాగాన్ని పూర్తిగా కొట్టివేయాలి. మూడో భాగంలోని నిబంధనలు (15 నుంచి 19 దాకా) మరింత ఘోరమైనవి. నమ్మండి, నమ్మకపోండి సహజీవనంలో ఉన్న భాగస్వాములకు విధులు, హక్కులను అవి నిర్దేశించాయి!
రెండో భాగం ‘వారసత్వం’కు సంబంధించినది. ఈ భాగాన్ని మరింత లోతుగా, నిశితంగా విశ్లేషించవలసిన అవసరమున్నది. ‘వీలునామా లేని వారసత్వం’ విషయంలో ‘హిందూ వారసత్వ చట్టం–1956’లోని నిబంధనలను స్వల్ప మార్పులతో ఈ చట్టంలో చేర్చారు. అయితే ఇతర మతాల వారికి చెందిన వారసత్వ చట్టాలలోని సకల నిబంధనలను పూర్తిగా మినహాయించారు. ఈ చట్టం సంపద’ (ఎస్టేట్)ను నిర్వచించింది. సమష్టి దాయాదిత్వాన్ని గుర్తించినట్టు కనిపిస్తుంది. దీన్నిబట్టి ఉత్తరాఖండ్ చట్టం పూర్తిగా హిందూ మతస్థుల ఆచారాలకు అనుగుణంగా ఉందని అర్థమవుతుంది.
‘వీలునామా ప్రకారం వారసత్వ సంక్రమణ’కు సంబంధించి భారతీయ వారసత్వ చట్టం–1925లోని నిబంధనలకు కోర్టుల భాష్యాలను అంగీకరించి, కొత్త చట్టంలో చేర్చారు. ఉత్తరాఖండ్ వెలుపల నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాస్తవ్యులకు సైతం ఈ యూసీసీని వర్తింపచేయడమనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. చట్టంలోని మాటలు, అంతస్సూచనలను నిశితంగా చూస్తే ఉత్తరాఖండ్ చట్టం అధిక సంఖ్యాకుల అంటే హిందువుల మత చట్టాలనే మన్నించి, హిందూయేతర మతాలవారు అనుసరిస్తున్న మత చట్టాలలోని అంశాలను తోసిపుచ్చిందని విశదమవుతుంది. ఉత్తరాఖండ్ చట్టం పౌరస్మృతుల్లో సంస్కరణలకు బీజాలు నాటిందా? లేక భిన్న మతాల మధ్య సంఘర్షణకు నాంది పలికిందా? కాలమే చెప్పుతుంది.
భారత రాజ్యాంగ అధికరణ 44లోని ఉమ్మడి పౌర స్మృతి అనే మాటలకు మాత్రం భారతీయ జనతా పార్టీ బాగా ప్రాధాన్యమిస్తుంది.ఆ అధికరణలోని ‘పౌరులు’, ‘దేశ వ్యాప్తంగా’ అనే మాటలను మనం ఉపేక్షించకూడదు. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలోని మాటలు, అంతస్సూచనలను నిశితంగా చూస్తే అది అధిక సంఖ్యాకుల అంటే హిందువుల మత చట్టాలనే మన్నించి, హిందూయేతర మతాల వారు అనుసరిస్తున్న మత చట్టాలలోని అంశాలను తోసిపుచ్చిందని అర్థమవుతుంది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News