బలూచ్ హెచ్చరిక!
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:25 AM
బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఒక రైలును హైజాక్ చేసిన ఉదంతం పాకిస్థాన్‌కు అత్యంత అవమానకరం. కథ సుఖాంతమైందని, ముప్పైమూడుమంది ఉగ్రవాదులను కాల్చిపారేశామని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది...

బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఒక రైలును హైజాక్ చేసిన ఉదంతం పాకిస్థాన్‌కు అత్యంత అవమానకరం. కథ సుఖాంతమైందని, ముప్పైమూడుమంది ఉగ్రవాదులను కాల్చిపారేశామని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన సైనికుల, సామాన్యుల సంఖ్యకు సంబంధించి వేర్వేరు ప్రకటనల్లో తేడాలున్నప్పటికీ, సామాన్యులు బయటపడినందుకు సంతోషించాల్సిందే. మానవబాంబులుగా మారిన బలూచ్ తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఐదువందలమందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు ఉన్నందున, తక్కువ ప్రాణనష్టంతో ఎక్కుమందిని ఆదుకోవడం సులువేమీకాదు. ఈ అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌లో ప్రస్తుతానికి పాకిస్థాన్ పైయి సాధించినప్పటికీ, ఇంతకాలమూ మూడు చీలికలుగా ఒకే లక్ష్యంకోసం పోరాడుతున్న శక్తులు ఇటీవలై ఒక్కటైన తరువాత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఎంత బలంగా తయారైందో ఈ ఘటన తెలియచెబుతోంది.
ఈ మార్గంలో ఎంతోకాలంగా నిలిచిపోయిన క్వెట్టా–పెషావర్ రైలు సర్వీసును ఇటీవలే తిరిగి ఆరంభించి, ఉగ్రవాదులకు భయపడేది లేదని పాకిస్థాన్ ప్రభుత్వం గొప్పలకు పోతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. 17 సొరంగాలున్న ఈ మార్గంలో, సాధారణ ప్రయాణికులతో పాటు నిరాయుధులైన సైనికులు కూడా పెద్దసంఖ్యలో ఆ రైలులో ప్రయాణిస్తున్నందున అది ఈ తరహా ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. క్వెట్టాకు 150 కిలోమీటర్ల దూరంలోని మెష్కాఫ్ సొరంగంలో ఆ రైలు వందమంది సాయుధుల చేతికి చిక్కింది. బీఎల్‌ఏ హెచ్చరికలను, డిమాండ్లను పాకిస్థాన్ సైన్యం ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా డ్రోన్లు, హెలికాప్టర్లతో అతివేగంగా ప్రతిస్పందించిందని, ఒక దశలో కాస్తంత తగ్గినా, తిరిగి విరుచుకుపడిందని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ బీఎల్‌ఏ అనేక విధ్వంసాలు, ఆత్మాహుతిదాడులతో పాకిస్థాన్‌మీద కక్షతీర్చుకుంటున్నప్పటికీ, ఏకంగా ఒకరైలును హైజాక్ చేయడం, ఇలా సామాన్యులను బందీలుగా ఉంచుకోవడం ఎన్నడూ లేదు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా, మరణాలను బీఎల్‌ఏ ఖాతాలో వేయవచ్చునన్న మొండిధైర్యంతో వ్యవహరించిందన్న ఆరోపణలు లేకపోలేదు. అలాగే, తిరుగుబాటుదారులు తమకు తాముగా విడుదల చేసిన మహిళలు, పిల్లల సంఖ్యలోనూ, సైనిక చర్య కారణంగా విడుదలైనవారి సంఖ్యలోనూ కొంత కలగాపులగం జరగవచ్చును. కొన్ని నిజాలు ఎన్నటికీ వెలుగుచూడని ఉదంతం ఇది.
పొరుగుదేశం ఆర్థిక, ఆయుధ సాయంతో బీఎల్‌ఏ రెచ్చిపోతున్నదంటూ పాకిస్థాన్ హోంశాఖ సహాయమంత్రి ఆఫ్ఘానిస్థాన్‌మీద విమర్శలు చేశారు. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ పేరు కూడా ప్రస్తావిస్తూ, తమ దేశం చల్లగా చక్కగా ఎదుగుతూంటే చూడలేని శక్తులన్నీ కలసికుట్రచేస్తున్నాయన్నారు. వీటికి మన శత్రువు భారతదేశం మద్దతు కూడా ఉన్నదని వ్యాఖ్యానించి కక్షతీర్చుకున్నారు. పాకిస్థాన్ సైన్యానికీ, బీఎల్‌కీ మధ్య దశాబ్దాలుగా యుద్ధం సాగుతూనే ఉంది. దీనికితోడు, 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత అఫ్ఘానిస్థాన్‌తో వ్యవహారం మరీ చెడింది. పాక్ పశ్చిమ, నైరుతిప్రాంతాలు మండుతూనే ఉన్నాయి.
బలూచిస్థాన్ స్వాతంత్ర్యకాంక్షను అణచివేసేందుకు ఏడున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత అమానుషంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఒక స్వతంత్ర సంస్థానంగా దాని విలీనం కూడా స్థానిక నాయకుల అభీష్ఠానికి వ్యతిరేకంగా జిన్నా కుట్రలూ, కుతంత్రాల మధ్యన జరిగిందని అంటారు. అత్యంత విలువైన ఖనిజనిక్షేపాలున్న ఈ ప్రాంతం చేజారిపోకుండా ఉండటానికి పాకిస్థాన్ పాలకులు ఈ ప్రావిన్సులో బూటకపు ఎన్నికలు నిర్వహిస్తూ, కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తుంటే, స్థానిక తెగలమధ్య చిచ్చు పెడుతూ బలూచ్‌లు బలపడకుండా సైన్యం జాగ్రత్తపడుతూంటుంది. సహజవనరులన్నా, నిరుపేదగా మిగిలిపోయిన ఈ ప్రావిన్సులో చైనా ఆరంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ) మరింత అశాంతిని రగిలించింది. స్వాతంత్ర్యం కోసం, వనరుల దోపిడీకి వ్యతిరేకంగానూ పోరాడుతున్న బలూచ్‌లను ఊచకోత కోయడం కాక, సయోధ్యతో దారికి తెచ్చుకున్నప్పుడే పాక్ పశ్చిమప్రాంతంలో హింస కాస్తంతైనా తగ్గుముఖం పడుతుంది. బలూచ్‌లను దేశ భద్రతకు ప్రమాదకారులుగా భావిస్తున్నంతకాలం వారి ఆవేదన అర్థంకాదు, సమస్య పరిష్కారం కాదు. బిఎల్‌ఏ ఇటీవలి కాలంలో జరిపిన దాడులను బట్టి అది మరింత శక్తిమంతంగా తయారైన విషయం అర్థమవుతూనే ఉంది. రైలు హైజాక్ ఘటన పాకిస్థాన్‌కే కాదు, చైనాకు కూడా ఓ బలమైన హెచ్చరిక.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News