Saffron Terror: కాషాయంపై పడిన మచ్చ తొలగింది
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:58 AM
పదిహేడు సంవత్సరాల అనంతరం దేశంలోని వందకోట్లకు పైగా హిందువులపై పడ్డ అతిపెద్ద మచ్చ తొలగిపోయింది. ఆ మచ్చ పేరు ‘భగవా ఆతంక్‌వాద్/ కాషాయ ఉగ్రవాదం/ హిందూ తీవ్రవాదం’. మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల...
పదిహేడు సంవత్సరాల అనంతరం దేశంలోని వందకోట్లకు పైగా హిందువులపై పడ్డ అతిపెద్ద మచ్చ తొలగిపోయింది. ఆ మచ్చ పేరు ‘భగవా ఆతంక్‌వాద్/ కాషాయ ఉగ్రవాదం/ హిందూ తీవ్రవాదం’. మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్, కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌తో సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. హిందూ జీవన విధానాన్ని అవలంబించేవారు ధర్మం కోసం తీవ్రవాదులుగా మారే అవకాశం లేదనీ, హిందూ ధర్మ బోధనల్లో ప్రతీకారానికీ, మారణహోమానికీ అవకాశమే లేదని ఈ కోర్టు తీర్పు ద్వారా యావత్ ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.
మతం పేరుతో హిందువు ఏనాడు ఉగ్రవాది కాడు, కాలేడు. కానీ యూపీఏ సర్కారును నడిపించిన సోనియాగాంధీ కుటుంబం ఒక వర్గాన్ని సంతోషపెట్టడం కోసం దేశంలోని వంద కోట్ల హిందువులను బద్నాం చేసింది. భారతదేశంలో ఇస్లామిక్ టెర్రరిస్టుల మారణహోమాలకు ఆ వర్గానికి చెందినవాళ్లనే అరెస్ట్ చేస్తూ పోతే మైనార్టీలు నొచ్చుకుంటారని భావించి, ఆ నేరాన్ని దేశంలో మెజార్టీ వర్గమైన హిందువులపై నెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే ‘భగవా ఆతంక్‌వాద్’ అనే కల్పిత కథనాన్ని రచించి ప్రచారంలో పెట్టింది. అందులో భాగంగానే 29 సెప్టెంబర్ 2008 నాడు మహారాష్ట్రలోని మాలేగావ్ మార్కెట్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్నది ‘హిందూ తీవ్రవాదం’ అని నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఆనాడు కేంద్రంలోనూ మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది.
సాధారణ హిందువులను ఇరికిస్తే పెద్దగా ప్రభావం ఉండదనుకున్నారో ఏమో, ఏకంగా కాషాయ సన్యాసిని సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను; ఆరెస్సెస్ ప్రతినిధి స్వామి అసిమానందను; ఆర్మీ ఆఫీసర్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌ను; ఇంకా పలువురు హిందువులను ఈ మాలేగావ్ బ్లాస్ట్ కేసులో నిందితుల్ని చేశారు. వీళ్లలో కొందరిని సంజౌతా ఎక్స్‌ప్రెస్ బ్లాస్ట్, హైదరాబాద్ మక్కా మసీద్ బ్లాస్ట్, అజ్మీర్ దర్గా బ్లాస్ట్ లాంటి కేసుల్లో కూడా నిందితుల్ని చేశారు. వీళ్లంతా నిరపరాధులని యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్)కు తెలుసు. కానీ పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఏటీఎస్ అధికారిగా ఉన్న పరమ్‌బీర్‌సింగ్ లాంటి వాళ్లు రెచ్చిపోయారు. ‘హిందూ ఉగ్రవాదం’ అనే అబద్ధపు ఆరోపణతో పదిహేడు సంవత్సరాలపాటు ఈ కేసు నడిచింది.
2008లో మాలేగావ్ బాంబు పేలుళ్ల తర్వాత, ‘సాఫ్రన్ టెర్రర్’ అనే పదాన్ని ఇంగ్లిష్‌లోను, ‘భగవా ఆతంక్‌వాద్’ అనే పదాన్ని హిందీలోను తొలిసారి వాడారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ నాయకులు, రాహుల్‌గాంధీతో సహా, ప్రతి వేదికపై ‘కాషాయ టెర్రరిజం’ అనే ఓ నేరేటివ్‌ను ప్రజల ముందుకు తీసుకురావడం మొదలుపెట్టారు. జూలై 2009లో రాహుల్‌గాంధీ భారతదేశంలోని అమెరికా రాయబారి టిమోతి రోమర్‌ను కలిశారు. ఆ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా కంటే కూడా పెద్దవనీ, మరింత ప్రమాదకరమనీ చెప్పారు. ఈ విషయం 2010లో వికీలీక్స్ ద్వారా బట్టబయలైంది. హిందూ ఉగ్రవాదంతోనే దేశానికి పెద్ద ప్రమాదం అని రాహుల్‌గాంధీ ముంబై ఉగ్రదాడి తర్వాత మాట్లాడిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు.
మాలేగావ్ పేలుడు జరిగిన స్వల్పకాలంలోనే పి. చిదంబరం భారతదేశ హోం మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హిందూ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనీ, వారు ఎన్నో బాంబు పేలుళ్లకు బాధ్యులనీ ఆగస్టు 2010లో చిదంబరం దేశానికి ఓ కొత్త సిద్ధాంతాన్ని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ 2008 నుంచి 2011 వరకు ప్రతి వేదికపైనా హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడారు. ఆరెస్సెస్ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని, బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలు నడుపుతోందని ఆయన 2011లో చెప్పారు. అంతే కాదు, 2008లో ముంబై ఉగ్రదాడి వెనుక కూడా హిందూ సంస్థలే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఒకవేళ పాకిస్థాన్ ఉగ్రవాది కసబ్ పోలీసులకు దొరికి ఉండకపోయి ఉంటే, ముంబై ఉగ్రదాడి తమ పనే అని లష్కరే తొయిబా చెప్పి ఉండకపోయి ఉంటే– ఇంకా ఎంతమంది హిందువులను ఈ కేసులో ఇరికించి చంపేవారో!
2008లో దేశంలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఢిల్లీతో పాటు అనేక ఇతర నగరాల్లో ఎనిమిది భారీ పేలుళ్లు జరిగాయి. అందులో నాలుగు చోట్ల సీరియల్ బ్లాస్ట్స్ జరిగాయి. ఈ ఉగ్రవాద ఘటనల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని వాడటం ప్రారంభించింది. వాస్తవానికి ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని దర్యాప్తు సంస్థలకు సమాచారం ఉంది. కానీ ఈ పేలుళ్లకు వాస్తవ బాధ్యులుగా ఉన్న పాకిస్థానీ ఉగ్రవాదులపై నేరం చూపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. ‘‘హిందూ ఉగ్రవాదం కూడా ఉంటుంది’’ అని ఒక నేరేటివ్ నిర్మించడం ద్వారా కాంగ్రెస్ రెండు ప్రయోజనాలు ఆశించింది: 1) అంతర్గత భద్రత విషయంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవచ్చు. 2) మైనారిటీ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడం ద్వారా ఓట్లు కొట్టేయొచ్చు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక రాజకీయ వ్యూహంగా మార్చి భారతదేశ హిందువులపై అపవాదులు మోపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు ఆపి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చేస్తే మంచిది, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాలు కూడా మిగలవు. కాంగ్రెస్ ముక్త్ భారత్ కార్యాన్ని ప్రజలు అతి త్వరలో నిర్వహిస్తారన్న విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తిస్తే మంచిది.
జెనవాడే సంగప్ప
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News