Share News

Tirumala Tirupati Devasthanam: ఏడాదిలోనే తిరుమలకు పూర్వవైభవం

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:43 AM

అశేష భక్తజనానికి తిరుమల ఎంతో పవిత్రం. ఆ పవిత్రతను ఉద్దేశపూర్వకంగానే పాడు చేశారు గత పాలకులు. వారి అయిదేళ్ల పాలనో కోనేటి రాయడి దివ్యసన్నిధిని పక్కా వ్యాపార కేంద్రంగా, స్వార్థ రాజకీయాలకు కూడలిగా మార్చారు. కోట్లాది భక్తుల...

Tirumala Tirupati Devasthanam: ఏడాదిలోనే తిరుమలకు పూర్వవైభవం

అశేష భక్తజనానికి తిరుమల ఎంతో పవిత్రం. ఆ పవిత్రతను ఉద్దేశపూర్వకంగానే పాడు చేశారు గత పాలకులు. వారి అయిదేళ్ల పాలనో కోనేటి రాయడి దివ్యసన్నిధిని పక్కా వ్యాపార కేంద్రంగా, స్వార్థ రాజకీయాలకు కూడలిగా మార్చారు. కోట్లాది భక్తుల కొంగు బంగారమైన శ్రీనివాసుడి దివ్య సన్నిధిలో ఎన్నో ఘోరాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంగా తయారు అయిందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వ్యాపార, ఆర్థిక, రాజకీయ, కేసుల అవసరాలను తీర్చుకునేందుకు తిరుమల తిరుపతిని వాడుకుని ఎన్నో మహాపాతకాలకు పాల్పడ్డారు గత పాలకులు. డెయిరీల నుంచి నెయ్యి సేకరణను ఆపివేసి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూ పవిత్రతను మసకబార్చారు. స్వామి పట్ల తరగని భక్తి ప్రపత్తులతో భక్తులు సమర్పించిన కానుకల సొమ్మును భోంచేశారు.

తిరుమల తిరుపతికి మళ్ళీ పూర్వవైభవం కల్పించేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పడిన టీటీడీ పాలక మండలి ఏడాదిలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నది. టీటీడీలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను గుర్తించి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం. ఏఐ టెక్నాలజీ ద్వారా 2-3 గంటల్లోపు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు ఏర్పాటయ్యాయి. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడినా, ప్రసారం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. నిత్యాన్నదాన ప్రసాదం నాణ్యత పెంచి, మెనూలో కొత్తగా వడ పెట్టాలని నిశ్చయించాం. తిరుపతి స్థానికులకు నెలలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నాం. వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలకు కేటాయించిన టికెట్లలో భారీ అవినీతి జరిగి అందుకు ఆధారాలు ఉన్నందున వారికి ఇచ్చే టికెట్స్ రద్దు చేశాం. తిరుమలలో వివిధ వ్యక్తులు, వ్యవస్థల పేర్లు తొలగించి స్వామి వారి పేరు వచ్చేలా వివిధ కాటేజీలు, గెస్ట్ హౌస్‌లకు బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్విమ్స్ హాస్పిటల్‌ అభివృద్ధికి రూ.71కోట్లు కేటాయించాం. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు తిరిగి గరుడ వారధిగా పేరు మార్చాం.


సీఎం ఆదేశం మేరకు టూరిజం శాఖకు సంబంధించిన దేవలోక్, ముంతాజ్ హోటల్స్, ఎమ్‌ఆర్‌కెఆర్‌ ప్రాపర్టీస్‌ & టూరిజం హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించడం జరిగింది. తిరుమల కొండపైన భక్తులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి తేవడానికి బ్రాండెడ్ హోటల్స్, క్యాంటీన్ మినిమం లీజ్‌కి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పోటు కార్మికులకు జీఎస్టీ కట్ లేకుండా వారి వేతనం పెంచాలని; స్విమ్స్‌లో హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని; 650 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్, డ్రైవర్‌ పోస్టుల రెగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయించాం. రెవెన్యూ శాఖ, విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాపులను, హ్యాకర్లను తొలగించాం. టీటీడీ గుడిలో పనిచేసే ఉద్యోగులకు నేమ్ బ్యాగ్లైస్ ఏర్పాటు, బ్రేక్ దర్శనం టైమింగ్స్‌లో మార్పు తెచ్చాం.

శ్రీవారి ట్రస్ట్ ద్వారా 5000 టెంపుల్స్ నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులను 10 లక్షల నుండి 20 లక్షలకి పెంచాం. టీటీడీకి 100 ఎలక్ట్రిక్‌ బస్సులను అందించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిగారిని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయంలో నిత్యాన్న ప్రసాదం, లడ్డు క్వాలిటీ పెంచాం. ఏఎస్‌ఐ సహాయంతో అలిపిరి పాదాల మండపాన్ని పునర్నిర్మించనున్నాం. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశాం.

తిరుమల కొండపైన వృక్ష సంపద పెంపు, రూ.25కోట్లతో కాణిపాకం అభివృద్ధి పనులు, తలకోనలో రూ.19కోట్లతో టెంపుల్ అభివృద్ధి జరిగాయి. గతం కన్నా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఏం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా PAC 5 ప్రారంభించి అదనంగా ఐదు వేల మంది భక్తులకి వసతి సౌకర్యం కల్పించాం. అలిపిరి – శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించాం. శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకి గురికాకుండా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేశాం. పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్ళపాకలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాం. సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 320 ఆలయాలలో మైక్ సెట్స్ ఉచితంగా పంపిణీ చేశాం. తిరుమలలోను ఒంటిమిట్టలోను ఔషధ వనం, పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం పొందాం. ఈ విధంగా తిరుమల తిరుపతిని సంపూర్ణంగా సంస్కరించడానికి, పవిత్రతను కాపాడటానికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే టీటీడీ పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నది.

నన్నూరి నర్సిరెడ్డి

టీటీడీ బోర్డు సభ్యులు

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 05:43 AM