Share News

అనుకున్నది సాధించాం, అప్రమత్తంగా ఉందాం

ABN , Publish Date - May 13 , 2025 | 05:28 AM

భారత్‌–పాకిస్థాన్‌ తాజా యుద్ధస్థితి ఉభయ దేశాల భావి సంబంధాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద దాడి యావద్భారతీయులను అమితంగా కలచివేసింది. ఆ హతులు అందరూ ఆసేతు హిమాచలంలోని...

అనుకున్నది సాధించాం, అప్రమత్తంగా ఉందాం

భారత్‌–పాకిస్థాన్‌ తాజా యుద్ధస్థితి ఉభయ దేశాల భావి సంబంధాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద దాడి యావద్భారతీయులను అమితంగా కలచివేసింది. ఆ హతులు అందరూ ఆసేతు హిమాచలంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులను భగ్నం చేసి, ఆ కేంద్ర పాలిత ప్రాంత పర్యాటక రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే కుతంత్రంతో జరిగిన ఉగ్రవాద దాడిపై సమస్త భారతీయుల ఆగ్రహావేశాలు, భావోద్వేగాలలో కేంద్ర ప్రభుత్వమూ పాలుపంచుకున్నది.

2016లో ఉరి, 2019లో పుల్వామా ఉగ్రవాద ఘాతుకాలు సంభవించినప్పుడు భారత్‌ శక్తిమంతమైన, ప్రభావదాయకమైన ప్రతిచర్యలు చేపట్టింది. భవిష్యత్తులోనూ ఎలాంటి ఉగ్రదాడులకైనా అటువంటి ప్రతిస్పందనలు ఖాయమని ఆ ప్రతి దాడులతో భారత్‌ స్పష్టం చేసింది. పహల్గాం పాశవికకాండకు మరింత కఠినమైన గుణపాఠాన్ని నేర్పాలని భారత్‌ దృఢంగా సంకల్పించుకున్నది. ఆ సంకల్పసాధనలో భాగంగా తొలుత భారత్‌లోని పాకిస్థానీ జాతీయుల వీసాలను రద్దు చేసింది; దశాబ్దాలుగా అమల్లో ఉన్న, పాకిస్థాన్‌కు ప్రాణాధారమైన సింధునదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయాలతోనే పహల్గాంపై తన ప్రతీకార చర్య ఎంత కఠినంగా ఉండేది భారత్‌ తేటతెల్లం చేసింది.


మే 7 ప్రాతఃకాలంలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట ఎంపిక చేసుకున్న తొమ్మిది ప్రదేశాల (పాకిస్థాన్‌లో నాలుగు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు)లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత వాయుసేన క్షిపణి దాడులు నిర్వహించింది. పహల్గాం ఊచకోత అనంతరం పాకిస్థాన్‌ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ మన సైనిక దళాలు ఎంచుకున్న నిర్దిష్ట లక్ష్యాలను కచ్చితంగా ధ్వంసం చేయడంలో సంపూర్ణంగా సఫలమయ్యాయి. పాకిస్తాన్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని బహ్వాల్‌పూర్‌ (జైషే మహమ్మద్‌ ప్రధాన కార్యాలయమున్న నెలవు), మురిద్కే (లష్కరే తయిబా ప్రధాన స్థావరమున్న ప్రదేశం) పట్టణాలపై జరిగిన ఆ మెరుపుదాడులు ఒక వాస్తవాన్ని తిరుగులేని రీతిలో వెల్లడించాయి. పాకిస్థాన్‌ ఆధారిత, ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే వారిని శాశ్వతంగా మట్టుబెట్టి తీరాలన్న భారత్‌ దృఢసంకల్పాన్ని అవి విశాల ప్రపంచానికి, మరీ ముఖ్యంగా ఇస్లామాబాద్‌ పాలకులకు ఎటువంటి మినహాయింపులు లేకుండా చాటిచెప్పాయి.

తన భూభాగాలపై ఎటువంటి ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించి, అందుకు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల, బృందాల స్థావరాలను లక్ష్యంగా ప్రతిదాడులు జరుపుతామని ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ స్పష్టం చేసింది. భారత్‌–పాకిస్థాన్‌ సంబంధాల శబ్ద కోశంలో అదొక ప్రభావదాయక సూత్రంగా ఖాయమయింది. ఎటువంటి ఉగ్రదాడి అయినా యుద్ధచర్యే అన్న విషయాన్ని మోదీ సిద్ధాంతంగా భావించవచ్చు. పాకిస్థాన్‌ పట్ల మన దౌత్యనీతిలో ఒక కొత్త ఆలోచనకు, కచ్చితమైన ఆచరణకు మోదీ సిద్ధాంతం ప్రాతిపదికగా నిలుస్తుంది.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుత జగడానికి పహల్గాంలో ఉగ్రవాద ఘాతుకమే ప్రధాన కారణం. ఆ దాడికి ప్రతి స్పందనగా మనం చేపట్టిన దాడులు చర్య–ప్రతిచర్య క్రమంలో కీలకమైనవి. భారత్‌ తన ప్రతిచర్యలను జయప్రదంగా నిర్వహించి, పాక్‌ మద్దతుతో చెలరేగిపోతున్న ఉగ్రవాదుల గర్హనీయమైన మానవతా వ్యతిరేక నేరాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లడంలో సఫలమవ్వడం ఇస్లామాబాద్‌ పాలకులకు ఎంతైనా ఆగ్రహం తెప్పించింది. తత్ఫలితంగానే పాక్‌ సైనిక దళాలు భారత్‌పై తెగబడి దాడులు చేశాయి. కాల్పుల విరమణను సైతం ఉల్లంఘించి పరిస్థితులను మరింత విషమింపజేస్తున్నాయి. పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాద మూకలు భవిష్యత్తులో పాల్పడే ఎటువంటి దాడులనైనా యుద్ధ చర్యలుగా పరిగణించి అందుకు అదే రీతిలో దీటుగా ప్రతిస్పందించడం ఒక సూత్రంగా ఇప్పుడు స్థిరపడింది.


పాకిస్థాన్‌ మరింత భారీగా నష్టపోయేలా యుద్ధ చర్యలను కొనసాగించాలని ప్రభుత్వ విమర్శకులు పలువురు వాదిస్తున్నారు. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించడంలో భారత్‌ మౌలిక లక్ష్యం తమ భూభాగాలలో ఎటువంటి ఉగ్రదాడినైనా యుద్ధచర్యగా పరిగణించి తీరుతామని నొక్కిచెప్పడమేనన్న విషయాన్ని ఆ విమర్శకులు విస్మరిస్తున్నారు. భారత్‌ తన లక్ష్యసాధనలో సందేహాతీతంగా జయప్రదమయింది. ఇక యుద్ధ చర్యలకు స్వస్తిచెప్పి మన ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించాలి.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుత సంఘర్షణను సైనిక వ్యవహారాల నిపుణులు జాగ్రత్తగా అధ్యయనం చేయవలసిన అవసరమున్నది. ఈ ‘యుద్ధా’నుభవాల ప్రాతిపదికన మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ సైనిక బలాధిక్యత తిరుగులేని రీతిలో రుజువయింది. మన వాయుతల రక్షణ వ్యవస్థలు అన్నీ ప్రశస్తంగా పనిచేశాయి. మన వాయుసేన ఎదురులేని రీతిలో పాక్‌ వాయుతలంలోకి ప్రవేశించి ఎంపిక చేసుకున్న నిర్దిష్ట లక్ష్యాలను కచ్చితంగా తుదముట్టించడం జరిగింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వ్యవస్థలను ధ్వంసం చేయడమే భారత్‌ అసలు లక్ష్యమని, పాకిస్థాన్‌ను విస్తృతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించడం జరిగిందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. త్రివిధ సాయుధ బలగాల మధ్య పటిష్ఠ సమన్వయంతో పాక్‌పై ప్రతిదాడులు జరిగాయి. మన సాయుధ బలగాలకు ఇదొక కొత్త అనుభవం. మన దేశ రక్షకులు ఇంతకు ముందు చూడని, పాల్గొనని వినూత్న యుద్ధ తంత్రమది. ఆపరేషన్‌ సిందూర్‌ మన సాయుధ బలగాలకు ఒక శుభశకునం. భావి యుద్ధాలు, త్రివిధ దళాలు విడివిడిగా కాకుండా ఒక ఏకీకృత కమాండ్‌ ఆధ్వర్యంలో జరిగే సమరాలుగా ఉంటాయి. త్రివిధ సాయుధ బలగాలను ఏకీకృతం చేయడమనే లక్ష్యాన్ని మన ఛీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చాలా ప్రశస్తంగా పరిపూర్తి చేస్తున్నారు.


పహల్గాం ఉగ్రదాడిపై ప్రతి స్పందన, దాని లక్ష్యాలపై ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నందునే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమయింది. చర్య–ప్రతి చర్యాత్మక సంఘటనల నెదుర్కొనే విషయమై ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో వ్యవహరించింది. పరిస్థితులు తీవ్రమయ్యేందుకు పాకిస్థాన్‌ తప్పక పూనుకుంటుందనే వాస్తవాన్ని మన పాలకులు విస్మరించలేదు. ప్రశాంత చిత్తంతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే ప్రశాంత చిత్తంతో ప్రతిదాడుల పరిణామాలపై అధికారిక ప్రకటనలు చేశారు. సరళమైన మాటలతో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. ఒక మహా ఉద్రిక్త సమయంలో పరిస్థితులు అదుపుతప్పని రీతిలో భారత ప్రభుత్వ విధాన నిర్ణేతలు, ప్రతినిధులు వ్యవహరించడం ప్రపంచ దేశాలు గమనించాయి. పాకిస్థాన్‌ పాలకులకూ ఇది అవగతమై ఉంటుంది. సంగ్రహించి చెప్పాలంటే పహల్గాం ఉగ్రదాడి ఫలితంగా పాకిస్థాన్‌తో ప్రజ్వరిల్లిన సంఘర్షణల్లో భారత్‌ ప్రశస్తంగా వ్యవహరించింది. భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడాన్ని పాకిస్థాన్‌ మానదుగాక మానదు కనుక ప్రస్తుత యుద్ధచర్యల అనుభవాల నుంచి మనం భావి యుద్ధ వ్యూహాలను రూపొందించుకోవాలి. పాకిస్థాన్‌పై సైనికేతర ఒత్తిళ్లను కొనసాగించాలి.


దేశ సరిహద్దులను దాటి ప్రవహించే నదుల జలాల విషయంలో దేశీయ ప్రయోజనాలకు ప్రథమ, అగ్ర ప్రాధాన్యమిస్తూ నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులను నిరోధించేందుకు ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఎటిఎఫ్‌) ‘గ్రే జాబితా’లో పాకిస్థాన్‌ను మళ్లీ చేర్చాలి. ఉద్రిక్తతలు లేనప్పటికీ పాకిస్థాన్‌ సక్రమంగా వ్యవహరించేలా చేసేందుకు అటువంటి సైనికేతర ఒత్తిళ్లు తప్పనిసరి. ఈ విషయంలో భారత్‌ సంకోచాలకు తావులేని రీతిలో చర్యలు చేపట్టాలి. ఆఖరుగా ఓ ముఖ్యమైన మాట ఏమిటంటే, పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రసర్పం మళ్లీ ఏ క్షణంలోనైనా బుసలు కొట్టవచ్చు. అది రేపు, లేదా ఎల్లుండే సంభవించవచ్చు, కొద్ది సంవత్సరాలలోనూ ఎదురుకావచ్చు. ఎప్పుడైనా సరే ఆ సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు ఈ క్షణం నుంచే మనం సర్వసన్నద్ధంగా ఉండి తీరాలి.

గౌతమ్‌ బంబావాలె

పాకిస్థాన్‌లో భారత మాజీ హై కమిషనర్‌

(ది ట్రిబ్యూన్‌)

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:28 AM