Election Commission: ఎన్నికల సంఘం స్పందిస్తే బాగుండేది
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:49 AM
బిహారులో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ’లో ‘ఓటు చోరీ’ జరుగుతోందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ మూడు వందల మంది ప్రతిపక్ష ఎంపీలు...
బిహారులో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ’లో ‘ఓటు చోరీ’ జరుగుతోందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ మూడు వందల మంది ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలో నిరసన ర్యాలీ చెయ్యడం ప్రాముఖ్యత కలిగిన వార్త. వారు తమను కలిసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తే సబబుగా ఉండేది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గత కొంత కాలంగా బీహారు అంశమే కాకుండా, గత సార్వత్రక ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు కొన్ని ఆధారాలతో బలంగా చెప్తున్నారు. కర్ణాటకలో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా మతలబు జరిగినట్లు, అలాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా ఉన్నట్లు, తద్వారా అధికార పక్షానికి మేలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ సందేహ నివృత్తి చేయాల్సింది. సరైన రుజువులతో ఆయన వాదనని పూర్వపక్షం చేసి ఉంటే దేశ ప్రజలకు మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది. పైగా అలా చెయ్యడం దాని బాధ్యత కూడా. దురదృష్టవశాత్తూ ఎన్నికల సంఘం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనబడడం లేదు. ఒక రాజ్యాంగ సంస్థ తన బాధ్యత పట్ల ఏ రూపంలో విమర్శ ఎదురైనా, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రజల దృష్టిలో తన నిబద్ధతను చాటిచెప్పేలా ప్రవర్తించాలి.
అడిగింది రాహుల్‌గాంధీనా లేక సామాన్య పౌరుడా అన్నదానితో సంబంధం లేకుండా ‘ఇదీ, నా సూటి జవాబు’ అన్న రీతిలో స్పందించాలి. ప్రస్తుతం అడుగుతున్నది ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నవారు – లోక్సభలో ప్రతిపక్ష నేత – అయినప్పుడు, మరింత స్పష్టతతో దేశ ప్రజలకి జవాబు ఇవ్వాలి. కానీ జరుగుతున్నది అలా లేదు. రాహుల్ గత ఎన్నికల్లో సందేహాస్పద ఓటర్ల జాబితా డిజిటల్ రూపంలో అడుగుతున్నారు– దాన్ని ఇవ్వడం లేదు. దొంగ ఓట్లు, ఒకే చిరునామాతో ఉన్న డజన్ల ఓట్లు, డూప్లికేట్‌వి... ఇలాంటి అవకతవకలు లక్షల్లో నమోదైనట్లు తనకు ఉన్న ఆధారాలు చూపిస్తున్నారు – వాటికి జవాబు లేదు. పైగా కర్ణాటకలో ఇలా జరిగిందని రాహుల్ చెప్పినప్పుడు అలాంటి అవకాశం లేదని చెప్పకుండా ‘అదేదో అఫిడవిట్ ద్వారా అడగమని’ జవాబు ఇచ్చారు. దీన్నే అసలు వదిలి కొసరు పట్టుకోవడం అంటారు. రాహుల్ ఆరోపణల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. అది అప్రస్తుతం. తన బాధ్యత పట్ల ఒక అనుమానం లేవనెత్తినప్పుడు ఎన్నికల కమిషన్ సవ్యంగా స్పందించాలి. ప్రతీ పౌరుడికీ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకొనే పరిస్థితిని కల్పించాలి. అక్రమాలతో ప్రజాతీర్పు తారుమారు కాకుండా చూసే బాధ్యత కూడా దానిదే. అలా చూడడమే గాక, ఆ నమ్మకాన్ని పౌరునిలో కలిగించాలి. అది ప్రజల పట్ల, దేశం పట్ల రాజ్యాంగబద్ధమైన బాధ్యత.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News