Share News

రెండేళ్లయినా కుదుటపడని మణిపూర్

ABN , Publish Date - May 13 , 2025 | 05:11 AM

మణిపూర్ విధ్వంసానికి రెండేళ్లు పూర్తయింది. ఈ విధ్వంసం ఎన్నో విషాదకర సంఘటనలకు, మానవతా సంక్షోభానికి సాక్ష్యంగా నిలిచింది. రెండు తెగల మధ్య అధికార పార్టీ వర్గీయుల ఆధిపత్యం కోసం సృష్టించిన విధ్వంసక క్రీడలో అమాయక ప్రజలు ఊచకోతకు గురైన...

రెండేళ్లయినా కుదుటపడని మణిపూర్

మణిపూర్ విధ్వంసానికి రెండేళ్లు పూర్తయింది. ఈ విధ్వంసం ఎన్నో విషాదకర సంఘటనలకు, మానవతా సంక్షోభానికి సాక్ష్యంగా నిలిచింది. రెండు తెగల మధ్య అధికార పార్టీ వర్గీయుల ఆధిపత్యం కోసం సృష్టించిన విధ్వంసక క్రీడలో అమాయక ప్రజలు ఊచకోతకు గురైన మే ౩వ తేదీ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ రాష్ట్రం, ఇప్పుడు భయం, అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతోంది. తెగల మధ్య నెలకొన్న వైషమ్యాలతో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోగా, మరెన్నో జీవితాలు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసి, రాష్ట్రాన్ని దీర్ఘకాలిక మానవతా సంక్షోభంలోకి నెట్టివేసింది. మెయితీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలు తారాస్థాయికి చేరి... ఇళ్లు, చర్చిలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి, స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మహిళలతోపాటు పిల్లలు సైతం హింసకు గురయ్యారు. 70వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులవగా, 260 మందికి పైగా మరణించారు. వందలాది ఇళ్లు, గ్రామాలకు గ్రామాలు బూడిదయ్యాయి. నిరాశ్రయులైన ప్రజలు ఇప్పటికీ కొండలు, లోయలలోని సహాయక శిబిరాల్లో మగ్గుతున్నారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అల్లర్లను నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, ఒక తెగకు ప్రతినిధిగా వ్యవహరించారు. ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతిపక్ష పార్టీలు, మానవహక్కుల సంస్థలు, సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తినా శాంతిని నెలకొల్పడానికి కేంద్రప్రభుత్వం ఇప్పటికీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు.


ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి స్థాపన, బాధితులకు న్యాయం చేకూర్చడం అత్యంత ఆవశ్యకం. నిష్పక్షపాతంగా విచారణ జరిపి, హింసకు కారకులైన వారిని శిక్షించాలి. నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ ఏడాది మార్చి 22న రాష్ట్రంలో పర్యటించారు. జస్టిస్ బి.ఆర్ గవాయ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తుల ప్రతినిధి బృందం మణిపూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించింది.

మణిపూర్‌లో కుకీ ఇతర ఆదివాసీ వర్గాలపై జరుగుతున్న హింసకాండను అదుపు చేయకపోగా ముఖ్యమంత్రి తన వర్గీయులను పూర్తిస్థాయిలో రెచ్చగొట్టి అగ్నికి ఆజ్యం పోసినట్లు అశాంతిని రగిలించారు. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే అత్యధిక బీజేపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న మోదీ ప్రభుత్వం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతి పాలన విధించాక కూడా శాంతి నెలకొనకపోగా, మరింతగా దిగజారింది. డబుల్ ఇంజన్ సర్కార్‌లు ఉన్నచోట్ల శాంతిభద్రతలు ఎంతగా దిగజారుతాయో మణిపూర్ స్పష్టమైన ఉదాహరణ.


పునరావాస కేంద్రాలలో మగ్గిపోతున్న ఆదివాసీ కుటుంబాలను స్వస్థలాలకు క్షేమంగా పంపించాలి. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. ఆదివాసీలపై జరిగిన హత్యా ఘటనలపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలి.

ముప్పాళ్ళ భార్గవశ్రీ, సీపీఐ ఎంఎల్ నాయకులు

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:12 AM