Share News

Revanth Reddy Telangana Politics: రేవంత్‌ దెబ్బకు రెండు పిట్టలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:38 AM

‘ఆయనొక అపర చాణక్యుడు – రాజకీయ గండర గండడు! పాచిక విసిరాడంటే రాజకీయ ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే’... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన మద్దతుదారులు తగిలించిన భుజకీర్తులు....

Revanth Reddy Telangana Politics: రేవంత్‌ దెబ్బకు రెండు పిట్టలు

‘ఆయనొక అపర చాణక్యుడు – రాజకీయ గండర గండడు! పాచిక విసిరాడంటే రాజకీయ ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే’... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన మద్దతుదారులు తగిలించిన భుజకీర్తులు ఇవి. కాలం కలిసి వచ్చినంత వరకు ఆయన అలాగే వెలుగొందారు. 2023 ఎన్నికల తర్వాత ఆయన జాతకం తిరగబడింది. ఒకప్పుడు తన ఎత్తుగడలకు చిత్తయిన రాజకీయ ప్రత్యర్థులే ఇప్పుడు ఆయనపై పైచేయి సాధిస్తున్నారు. ఒకవైపు ఇంటిపోరు, మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూకుడుతో కేసీఆర్‌ పరిస్థితి తలకిందులవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్‌... ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలు జరిగాయని చాలాకాలంగా ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవకాశం కోసం ఎదురుచూశారు. పీసీ ఘోష్‌ నివేదిక తదనంతర పరిణామాలతో కేసీఆర్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపటం ద్వారా ఇటు భారత రాష్ట్ర సమితిని, అటు భారతీయ జనతా పార్టీని రేవంత్‌రెడ్డి ఒకేసారి ఇరకాటంలోకి నెట్టారు. తన చేతికి మట్టి అంటకుండా సీబీఐ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్‌ను దెబ్బతీసే ఎత్తుగడను ఆయన ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి... కేసీఆర్‌పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపునకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉండేది. దీంతో నిజాన్ని నిగ్గు తేల్చే బాధ్యతను సీబీఐకి బదలాయించారు. ఈ చర్యవల్ల ఒక రకంగా బీజేపీ కూడా ఇరకాటంలో చిక్కుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అండ్‌ కోకు క్లీన్‌ చిట్‌ ఇస్తే... బీఆర్‌ఎస్‌–బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్‌రెడ్డికి దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్‌ అండ్‌ కోను సీబీఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే ఆ రెండు పార్టీలూ తోడు దొంగలని నిందించవచ్చు. రాజకీయాల్లో తనకు లోతు తెలియదని అనుకోవద్దని వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యానిస్తూ రావడం ఈ సందర్భంగా గమనార్హం. ఫార్ములా వన్‌ కారు రేసు వ్యవహారం, ఫోన్‌ టాపింగ్‌ ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుపై ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం లడ్డూలా రేవంత్‌రెడ్డి చేతికి అందింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకున్న ముఖ్యమంత్రి తనలోని రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. చాతుర్యం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, కాళేశ్వరం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే దర్యాప్తు జరిపిస్తారని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావించారు. వారి అంచనాలకు భిన్నంగా కేసును సీబీఐకి అప్పగించడంతో వారు కంగుతిన్నారు. అందుకే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తరచుగా విమర్శించే సీబీఐని ఎంచుకోవడం ద్వారా రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని కూడా ధిక్కరిస్తున్నారని విమర్శలు చేశారు.


పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా తన లక్ష్యం దెబ్బతినకూడదని భావించి... ఎన్‌డీఎస్‌ఏ వంటి సంస్థల నివేదికల ఆధారంగా సీబీఐ చేత విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో కూడా బీఆర్‌ఎస్‌ నేతల అంచనాలకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. హైకోర్టు కూడా సీబీఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్‌ తన సొంత మీడియాలో కథనాలు వండి వార్చారు. రాష్ర్టాన్ని సాధించిన మనిషిపై సీబీఐ విచారణ జరిపించడం అన్యాయమని విమర్శలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మహా కుట్ర జరిగిందని, రేవంత్‌రెడ్డి–ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు–ప్రధాని నరేంద్ర మోదీ కలసి కుట్ర పన్నారని నిందించడం మొదలుపెట్టారు. ఇంకా నయం, చైనాలో ఇటీవల సమావేశమైన జిన్‌ పింగ్‌–పుతిన్‌–మోదీ కలసి కుట్ర చేశారని ఆరోపించడం లేదంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

ప్రతిసారీ బాబు బూచీ...

తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ రాజకీయంగా ఇబ్బంది ఎదురైన ప్రతిసారీ చంద్రబాబును బూచిగా చూపించడం భారత రాష్ట్ర సమితికి అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిగితే అందుకు చంద్రబాబు కారణమని నిందించడం మొదలు పెట్టారు. తెలంగాణ సెంటిమెంటు పూర్తిగా ఆవిరైతే కేసీఆర్‌కు అజెండా ఉండదు. కనుక రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబును ముడిసరుకుగా వాడుకోవడాన్ని ఆక్షేపించాల్సింది లేదు. అయితే, సీబీఐ విచారణ పర్యవసానాలు తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉనికిలో ఉండకూడదని రేవంత్‌రెడ్డి బరాబర్‌ కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌–బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని, మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్‌రెడ్డి అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా భారత రాష్ట్ర సమితి ఉనికిలో ఉండకూడదనే భావిస్తోంది. బీజేపీ అగ్రనేతలు ప్రాంతీయ పార్టీల మనుగడకు వ్యతిరేకమన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో తన కుమార్తె కవిత తీహార్‌ జైల్లో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని కేసీఆర్‌ ప్రతిపాదనలు పంపారు. ఈ విషయాన్ని కొంత కాలం క్రితం కవిత కూడా ధ్రువీకరించారు. విలీనం కాకపోయినా పొత్తు పెట్టుకుందామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపాదించగా, పొత్తుతో ఆ పార్టీకి ప్రాణం పోయడం ఇష్టం లేని బీజేపీ అగ్రనేతలు అందుకు కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జుట్టును కేంద్ర ప్రభుత్వం చేతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించారు. వచ్చే ఎన్నికల నాటికి సీబీఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. అయితే, కేసీఆర్‌ అండ్‌ కో పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఉంటుంది. కేసీఆర్‌ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్‌ఎస్‌ అస్తిత్వం కోల్పోతుందని, రాజకీయంగా ఇది తమకు ప్రయోజనకరం అని భావిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆ దిశగానే ఉండవచ్చు. అంత దూరం వెళ్లడం ఇష్టం లేకపోతే బీఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు. లేదా పొత్తుపెట్టుకొని తాము పెద్దన్న పాత్ర పోషించవచ్చు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒంటి కాలిపై లేచినట్టుగా కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వలేరు.


ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. లిక్కర్‌ కుంభకోణంలో అరెస్టయి జైలుకు వెళ్లక ముందు కేజ్రీవాల్‌ జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్‌ పార్టీకి తానే ప్రత్యామ్నాయం అనేదాకా ఆయన ఆలోచనలు సాగాయి. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆప్‌ ఉనికి లేకుండా పోయింది. ఇండియా కూటమి నేతలు కూడా కేజ్రీవాల్‌ను పట్టించుకోవడం లేదు. ఇకపైనా... భారతీయ జనతా పార్టీ విజయానికి హరియాణాలో సహకరించినట్టుగా మున్ముందు జరిగే ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్‌ అదే పాత్ర పోషించవచ్చు. కళ్లెదురుగా కేజ్రీవాల్‌ అనుభవాన్ని చూస్తూ కూడా కేసీఆర్‌ అండ్‌ కో తల ఎగరేస్తారని భావించలేం. చంద్రబాబు–రేవంత్‌రెడ్డికి ముడిపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకోవడం వేరు. కేంద్ర పెద్దలు మోదీ–షాలతో పెట్టుకుని మనుగడ సాగించడం వేరు. కేసీఆర్‌ మీదనే సీబీఐ విచారణ జరిపిస్తారా అని హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేసినా, గింజుకున్నా ప్రయోజనం ఉండదు. లిక్కర్‌ కేసులో అరెస్టయ్యే వరకు కేజ్రీవాల్‌ జాతీయ స్థాయిలో కేసీఆర్‌కంటే బలమైన నాయకుడు. పలు రాష్ర్టాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించారు. ఆయన బాటలోనే కేసీఆర్‌ కూడా పలు రాష్ర్టాలలో బీఆర్‌ఎస్‌ను విస్తరించాలనుకున్నారు. చివరకు సొంత రాష్ట్రంలోనే చతికిలపడ్డారు. కేజ్రీవాల్‌కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. పుట్టిల్లు ఢిల్లీలోనే ఆప్‌ తుడిచిపెట్టుకుపోయింది. కేజ్రీవాల్‌ ఉద్యోగం పోయింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ... అంతర్గత సంభాషణల్లో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ జరిపిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. దీంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. కేజ్రీవాల్‌ను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. చంద్రబాబు విషయంలో జరిగినట్టుగా కేజ్రీవాల్‌కు సానుభూతి లభించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ... ప్రజల్లో ఆయన విశ్వసనీయత సన్నగిల్లలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేష్టల కారణంగా మోదీ ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అండ్‌ కో కేంద్ర పెద్దలను ధిక్కరించజాలరు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతానికి వారి టర్మ్స్‌కు లోబడి నడుచుకోవాల్సిన పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారు.


నెగ్గడం... తగ్గడం!

రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అది తెలుసుకున్నందువల్లే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మధ్యలో కొన్నాళ్లు అధికారం కోల్పోయినా మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబును వివిధ సందర్భాలలో ఈసడించుకొన్న కేసీఆర్‌ ప్రస్తుత గడ్డు పరిస్థితుల్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. చంద్రబాబును హైదరాబాద్‌ నుంచి తరిమేసిన ఘనుడు కేసీఆర్‌ అని బీఆర్‌ఎస్‌ నేతలు గొప్పగా చెప్పుకొంటారు. ప్రతికూల పరిస్థితుల్లో వెనకడుగు వేయడం, తగ్గి ఉండటం తెలుసు గనుకనే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగలిగారు. మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాగలరా? అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. నిజానికి ఆరు నెలల క్రితం భారత రాష్ట్ర సమితి పుంజుకుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే, ఎన్నికల వైతరణిని కేసీఆర్‌ సునాయాసంగా దాటాలంటే మధ్యలో ఎన్నో గండాలను అధిగమించాల్సి ఉంటుంది. కాళేశ్వరం కేసులో విచారణ జరపబోతున్న సీబీఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయనను నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావొచ్చు. కేంద్ర పెద్దలు అంత ఉదారంగా వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. కీలు ఎరిగి వాత పెట్టినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం అంశాన్ని తెర మీదకు తెచ్చారు. నిజానికి ఈ అంశం అటకెక్కినట్టే అని ఇప్పటి వరకు అందరూ భావించారు. ఏకంగా సీబీఐ విచారణను కోరతారని చాలా మంది ఊహించలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ ప్రారంభమవడంలో జాప్యం జరిగే కొద్దీ స్థానికంగా బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా రేవంత్‌రెడ్డి–చంద్రబాబు–మోదీ కలసి కుట్రపన్నారన్నది నిజమే అనుకుందాం. ఇలాంటి రాజకీయాలు కేసీఆర్‌కు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్‌ రెడ్డితో కలసి కుట్ర చేశారు కదా! ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు మూడేళ్లకు పైగా వ్యవధి ఉన్నందున సీబీఐ విచారణ ఎలా ఉండబోతుందన్నదే కీలకం. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ పెద్దలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య అవగాహన నిజంగానే ఉంటే... ప్రస్తుత సంకటం నుంచి కేసీఆర్‌ తప్పించుకోలేరని చెప్పవచ్చు. కాంగ్రెస్‌, బీజేపీ ఆటలో కేసీఆర్‌ పావుగా మారతారని ఎవరైనా ఊహించగలరా? ప్రస్తుతానికి రాజకీయ ఎత్తుగడల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే పైచేయి అయింది. ఇకపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లలో ఎవరిది పైచేయి కాబోతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. నిన్నటిదాకా బీఆర్‌ఎస్‌ను విమర్శించినా తెలంగాణ అస్తిత్వంపై దాడిచేసినట్టు ప్రచారం చేసినవాళ్లు, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందినవాళ్లు ఎందుకనో ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడమంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమేనని గుండ్రని బల్లల చుట్టూ కూర్చొని చర్చలు చేయడం లేదు కూడా!


2-ed.jpg

ఇంటిపోరుతో ఉక్కిరి బిక్కిరి!

ఈ విషయం అలా ఉంచితే, ఇంటిపోరు కూడా కేసీఆర్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు కేసీఆర్‌ పరిస్థితి అలాగే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, కాకపోతే అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్‌ కుమార్తె కవిత స్వయంగా ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవమైతే అది హరీశ్‌రావుకు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా? ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటి పార్టీగా ప్రచారం చేసిన కవితకు ఇప్పుడు ఆ ఇంటి పార్టీలో చోటు లేకుండా పోయింది. ఇంటి పార్టీ ఆడపడుచుకు ఇప్పుడు పుట్టింట కూడా ప్రవేశం లేదని అంటున్నారు. ఇంతకూ కవిత తెగింపునకు కారణం ఏమిటో? ఏమి చూసుకొని ఆమె పార్టీతో సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడ్డారన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. కొద్ది మాసాల క్రితం ధిక్కార స్వరం వినిపించిన కవిత అప్పుడు తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్‌ చేసుకున్నట్టుగా మాట్లాడారు. కేసీఆర్‌ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ తనకు అండగా నిలవలేదని ఆరోపించారు. ఇప్పుడు సడన్‌గా ఆమె యూ టర్న్‌ తీసుకున్నారు. నాన్నను, పార్టీని రామన్నే కాపాడుకోవాలని కోరారు. కేవలం హరీశ్‌రావు, సంతోష్‌రావులను మాత్రమే ఆమె టార్గెట్‌ చేసుకున్నారు. మొదట్లో ఆమె హరీశ్‌రావు జోలికి వెళ్లలేదు. ఇప్పుడు కవిత అనే బాణం దిశ మార్చుకుంది. మొదట్లో కేటీఆర్‌కు గుచ్చుకుంటే ఇప్పుడు దిశ మార్చుకొని హరీశ్‌రావుకు గుచ్చుకుంది ఏమిటా అని రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్‌ ఇంటిలో మొదలైన పోరుకు కారణం దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే అనే ప్రచారం జరగడంతో కవిత తన దిశను మార్చుకున్నారా? లేక, ఆమె కేసీఆర్‌ వదిలిన బాణమేనా? అన్న సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. నిజానికి కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కవిత మదనపడేవారు. కన్న కూతురైనప్పటికీ తనకంటే వరుసకు సోదరుడైన సంతోష్‌రావుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాబల్యం పెరగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో, కేటీఆర్‌ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రచారం జరిగింది. అదే జరిగితే పార్టీలో తన పరిస్థితి మరింత దిగజారుతుందని తెలిసి కూడా అప్పట్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. ఇంతలో ఎన్నికలు రావడం, నిజామాబాద్‌ నుంచి పోటీ చేయవద్దని కేసీఆర్‌ ఆదేశించడంతో ఆమెకు పుండు మీద కారం రాసినట్టయింది. పార్టీ అధికారం కోల్పోయినా కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎమ్మెల్యేలు అయ్యారు. సంతోష్‌రావు ప్రాధాన్యత తగ్గలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను రాజకీయంగా కనుమరుగు కావడం తథ్యమన్న ఆందోళన కవితలో ఏర్పడింది. ఎన్నికలకు ముందు నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆమె ఇప్పుడు బయటపడ్డారు. చివరకు పార్టీకి కూడా దూరమయ్యారు.


రాజకీయ వారసులెవరంటే...

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మన సమాజంలో వారసులు అంటే కుమారులే అన్న భావన ఉంది. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. మగ పిల్లలు లేని సందర్భంలోనే ఆడ పిల్లలకు రాజకీయ వారసత్వం లభిస్తోంది. కాంగ్రెస్‌ నాయకత్వం కూడా రాహుల్‌గాంధీకే దక్కడం గమనార్హం. ప్రియాంకగాంధీకి అర్హత లేదా? అంటే ఏం చెబుతాం? తెలుగు రాష్ర్టాలు మాత్రం ఇందుకు మినహాయింపు కావు కదా! ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డిని రాజశేఖరరెడ్డి వారసుడిగా ప్రజలు గుర్తిస్తున్నారు. అన్నతో విభేదించి రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల ప్రస్తుతానికి సక్సెస్‌ కాలేదు. తెలంగాణలో ఇందుకు భిన్నంగా జరుగుతుందని భావించలేం. ఇంకా చెప్పాలంటే కేసీఆర్‌ కుమారుడు, కుమార్తెతో పోల్చితే మేనల్లుడు హరీశ్‌రావుకు అటు ప్రజల్లో, ఇటు పార్టీ నాయకుల్లో ఆదరణ ఎక్కువ. కేసీఆర్‌ ఉన్నంత వరకు పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. లేనప్పుడు మరో విధంగా ఉంటుంది. కేసీఆర్‌ వారసత్వం అయితే కేటీఆర్‌కు లేదంటే హరీశ్‌కు దక్కుతుంది. కానీ, కవితకు దక్కే అవకాశం లేదని చెప్పవచ్చు. బహుశా ఈ తత్వం ఆమెకు ఆలస్యంగా బోధపడినట్టు ఉంది.


అయితే... అన్న లేదంటే తనకు వారసత్వం దక్కాలిగానీ హరీశ్‌ పోటీలో ఉండకూడదన్నది ఆమె ఆలోచన కావొచ్చు. అందుకే తాజాగా ఆమె హరీశ్‌ను టార్గెట్‌ చేసుకున్నట్టుగా ఒక అభిప్రాయం. కేసీఆర్‌ వారసత్వం ఎవరికి? అని ప్రస్తుత పరిస్థితుల్లో కొట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. బీఆర్‌ఎస్‌ మనుగడపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు కూడా బోనులో చిక్కుకుంటారు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. మనిషి తాను నిస్సహాయుడిని అని భావించినప్పుడే దేవుడి వైపు చూస్తాడు. ఇప్పుడు కేసీఆర్‌ పరిస్థితి కూడా అదే కావొచ్చు. అందుకే ఆయన ఫాం హౌజ్‌లో యాగాలు చేస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసినా అధికారం కోల్పోయారు. యాగాలు చేస్తే అధికారం సిద్ధిస్తుందన్నది నిజమైతే ప్రతి ఒక్కరూ చేయకపోతారా? 2018లో రాజశ్యామల యాగం అధికారం తెచ్చిందనుకుంటే, 2023లో ఎందుకు తెచ్చిపెట్టలేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయినా.. కర్మఫలం ఒకటి ఉంటుంది. అది మనల్ని వదలదు. కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. యజ్ఞాలను, యాగాలను నమ్ముకొనే కంటే తల రాతను నమ్ముకోవడం మంచిది. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాసిపెట్టి ఉంటే అవుతారు. లేని పక్షంలో ఎన్ని యాగాలు చేసినా నిష్ఫలమే!

ఆర్కే

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 04:38 AM