Jookanti Jagannatham: కవితా జీవనది జూకంటి
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:07 AM
ప్రియురాలి మునివేళ్లు, తేనె తెట్టులో మకరందం, మల్లెపువ్వులో సువాసన దగ్గరే ఆగిపోకుండా పగిలిన వరిమడిని, వేపచెట్టుకు వేలాడుతున్న రైతు శవాన్ని, దగ్ధమవుతున్న అంటరాని పూరి గుడిసెను, ఒరిగిపోతున్న ఆదివాసీ వీరుడిని, కుతకుత ఉడుకుతున్న...
ప్రియురాలి మునివేళ్లు, తేనె తెట్టులో మకరందం, మల్లెపువ్వులో సువాసన దగ్గరే ఆగిపోకుండా పగిలిన వరిమడిని, వేపచెట్టుకు వేలాడుతున్న రైతు శవాన్ని, దగ్ధమవుతున్న అంటరాని పూరి గుడిసెను, ఒరిగిపోతున్న ఆదివాసీ వీరుడిని, కుతకుత ఉడుకుతున్న తెలంగాణ అస్తిత్వాన్ని, గ్లోబల్ ఖడ్గానికి మౌనంగా తెగిపడుతున్న మానవ సంబంధాలను అక్షరాలతో పుటం పెడుతున్న కవుల వరుసలో అపురూపమైన కవి జూకంటి జగన్నాథం.
ఆయన మౌనంగా ఉంటాడు, మెరుపుల ప్రపంచానికి దూరంగా ఉంటాడు, పల్లెను మోసుకు తిరుగుతాడు, మాయిముంత వాసనేస్తాడు, అల్పాక్షరాలలో వ్యక్తమవుతాడు. ఆయన సిరిసిల్ల, ఆయన జగిత్యాల, ఆయన మానేరు. ఆయనొక నిరంతరం ప్రవహించే కవితా జీవనది. ఏడు పదుల జూకంటి అర్ధశతాబ్దంగా కవిత్వమే జీవితంగా రాస్తున్నాడు.
జూకంటి జగన్నాథం దేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో ఈ భూమి మీద పడ్డాడు. అభ్యుదయ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని శాసిస్తున్న కాలంలో కష్టజీవికి ఇరువైపుల ఉన్నవాళ్లే కవులనే భావన విస్తారంగా వ్యాపించి ఉండింది. కానీ ఆ కవులే కలాన్ని దించి అంతర్ బహిర్ యుద్ధరవానికి విరామం ప్రకటించారు. ఆ కాలం లోనే అగ్నిగోళంలా మండుతున్న ప్రపంచంలో విస్మరణకు గురైన సమూహాల నుంచి అనేక ప్రశ్నలు ఉదయించాయి. భారత సమాజం ఈ క్రమానికి మినహాయింపు కాలేకపోయింది. నల్లమందు మింగి మత్తుగా ఉన్న కవి వర్యున్ని యువకవులు ప్రశ్నించారు. సామాన్యుని ఆర్తిని ఆకాశమంత ఎత్తుకు అరిచిన కాలంలో జూకంటి బాల్య దశను దాటి యవ్వన కాలాన్ని అందుకోవడానికి ‘ఆకాశానికి నిచ్చెన’ వేసాడు. ప్రగతి భావన ఆయన యవ్వన కాలపు స్వప్నాలను తట్టిలేపింది. సిరిసిల్ల సమీపం లోని సినారె ప్రభావం కంటే జగిత్యాల జైత్రయాత్ర మట్టి మనుషులే ఆయనను అమితంగా ఆకర్షించారు.
జూకంటి మాతామహుల ఇంటినుంచి సిరిసిల్లకు రావటం వలన అరుదైన కవిగా రూపొందడానికి మొదటి పునాది పడింది. సిరిసిల్ల ఆంధ్ర మహాసభల ద్వారా వెల్లివిరిసిన అక్షర చైతన్యం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. పౌర గ్రంథాలయాలు ఏర్పడడానికి దారి దొరికింది. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అలంకారికుల భావనలు కావచ్చు కానీ అవి ఏ కవికైనా అబ్బవలసిన ప్రాథమిక నియమాలు. నిరంతర అధ్యయనమే మనిషిని సాన పడుతుందని చెప్పడానికి జూకంటియే నమూనా. సిరిసిల్ల పౌర గ్రంథాలయంలో దొరికిన ప్రతీ పుస్తకాన్ని తిరిగేసిన అనుభవమే ఆయనలోని వ్యుత్పత్తి వికాసానికి మూలం. పెద్దపల్లి, కరీంనగర్ పట్టణాలను తన జ్ఞానం, బోధన ద్వారా ప్రభావితం చేసిన నిజాం వెంకటేశంతో స్నేహం జూకంటిని మరో తలంలోకి తీసుకెళ్లింది. ఆయన పరిచయం చేసిన కమ్యూనిస్టు మేనిఫెస్టో జూకంటిలో అలజడిని రేపింది. అప్పటికే చదివివున్న పొట్లపల్లి రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య దృక్పథం అర్థం కావడానికి మార్క్స్ తోడ్పడ్డాడు.
ఎమర్జెన్సీ కాలానికి జూకంటి రెండు పదుల్లోకి ప్రవేశించాడు. నిండు జవ్వనంబుతో కవిత్వాన్ని అల్లటం ప్రారంభించాడు. ఆ వయసులో సృజనకాలాన్ని కాంక్షించాడు. కానీ సంకెళ్లకాలం అంతర్ముఖున్ని చేసింది. అలాగని జూకంటి పలాయనవాది కాదు, ఆ కాలంలో పదునెక్కిన యవ్వనకలం. ఎమర్జెన్సీ, దళిత అస్తిత్వ వేదన, మండల్ కమీషన్ ఉద్యమం, ప్రపంచీకరణ, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఇలా తన కాలపు జన సందోహాలన్నింటిని జూకంటి అక్షరబద్ధం చేసాడు. ఈ కవి చుట్టూ నిండైన సామాజిక చలనాలు రూపొందాయి. ఈ యాభై ఏళ్ల కాలానికి ఆయనొక కాపలాదారుగా ఉన్నాడు.
ప్రతి కవి కవిత్వానికొక డిక్షన్ ఉంటుంది. మెటఫర్ ఉంటుంది. అలాంటి తనదైన ముద్రతో తెలుగు కవిత్వంలోకి జూకంటి ప్రవేశించాడు. వాస్కోడిగామా డాట్ కామ్‌ను గ్లోబలైజేషన్ తొలి రోజుల్లోనే కవిత్వం చేసిన క్రాంతదర్శి ఆయన. ఏలిక అనుకుంటే ఏదైనా జరగవచ్చును, అది రాజపత్రంగా రూపొందుతుంది. రాజ్యాలు లేని రోజుల్లో రాజదర్పం, రాజపత్రం ఉండటమే వింతల్లోకెల్లా వింతగా కవి భావించాడు. ‘ఊళ్లకూళ్లు కూలగొట్టి కడుపులు కాలబెట్టి’న రాజపత్రం గురించిన చిలక రహస్యాన్ని కవి చెప్పగలడు. రాజ్యం అణచివేత సాధనం, రాజకీయార్థశాస్త్రం తెలిసిన వారందరికి అర్థమయ్యే పెట్టుబడి సత్యాన్ని ఎన్నిసార్లు ఆవిష్కరించినా ఆయన కవిత్వంలో కొత్తగానే వ్యక్తమవుతుంది. అది కవి ప్రతిభ ద్వారా వ్యక్తమైన శిల్పనైపుణ్యం. దోపిడీ విశ్వమంతా వ్యాపించి ఉంది. నిరసన కూడా ఎల్లలు దాటింది. ఈ చారిత్రక విభాత సంధ్యను జూకంటి దర్శించిన తీరు తాజాగా ఉంటుంది. సముద్రం మౌనంగా ఉందని మనం అనుకునేలోపు అదొక ఝంఝ మారుతంలా చుట్టేస్తుందనే ప్రమాద హెచ్చరికను ఈ కవి చేయగలడు. అగ్నిపర్వతం మీది నుంచి కవితాగానం సంధించగలడు. జీవితం లోతుల్లోకి వెళ్లి పాతాళ గరిగెతో సమస్త దుఃఖాన్ని తవ్వితీసి ఒడ్డుకు వేసే పనిలో ఆయన నిమగ్నమయ్యాడు.
గ్లోబల్ దృశ్యాన్ని ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేస్తాడు జూకంటి. పరుగెత్తుతున్న కాలాన్ని అంతే వేగంగా అందుకుంటాడు. అందుకే ఆయన కవితా నవయవ్వనుడు. ‘‘కిటికీలు దర్వాజలు తీసుకుపోగా/ దూలానికి వేలాడిన గుక్కపట్టిన ఉయ్యాల/ కన్నీటి జోలపాటకు తల ఊగుతుంది’’ వర్తమానంలో నిర్వాసితుల దుఃఖాన్ని ఈ పద్యం ఆవిష్కరించింది. నది ఏదైనా, ఊరు ఏదైనా గాయం ఒకటే. అలాగే తెలంగాణ గురించి ఈ కవి కలగన్నాడు. బాల్యంలో కోరుకున్నాడు, యవ్వనంలో ఆశించాడు, వృద్ధాప్యంలో నెరవేర్చుకున్నాడు. కానీ సంధించిన ప్రశ్నలు వడి పెడుతుంటే ఎవర్ని అడగాలో తెలియక మానేరు నదితో ఒంటరిగా సంభాషిస్తున్నాడు.
జూకంటి కవిత్వంలో విస్తారమైన ఇతివృత్త వైవిధ్యం ఉంది. కన్నతల్లి, తండ్రి, మనుమరాండ్లు, స్నేహితులు, సెల్ ఫోన్, పేపర్ బాయ్, మిల్క్ బాయ్, మానేరు, సిరిసిల్ల, తెలంగాణ, విప్లవం, అమరులు, గ్లోబలైజేషన్. ఇలా తన చుట్టూ ఆవరించిన ఇతివృత్త సముదాయమంతా ఆయన కవిత్వంలో ఉంది. తెలంగాణ జీవద్భాష కలిగి ఉండటం చూస్తే స్థానీయత మీద ఆయనకుండే మమకారం తెలుసుకోవచ్చు. తెలంగాణ మట్టిలో నుంచి ఆయన వ్యక్తమవుతాడు. మనిషితనం, మంచితనం అతడి కవితా సారాంశంగా భావించవచ్చు.
కవి మౌనంగా ఉంటే వ్యవస్థ కురచగా మారిపోతుందనే ఎరుక జూకంటికి ఉంది. సంవిధానం, ప్రజాస్వామ్యం వికసించాలంటే ప్రశ్న మనుండాలని కోరుతున్నాడు. ‘‘సంఘర్షించాల్సిన సమయంలో మౌనంగా తల వంచుకుంటే చావడానికి ఇలా ఎన్నెన్నో ఉటంకింపులు’’ ఉంటాయని హెచ్చరిస్తున్నాడు. ‘‘చీకటి గురించి అడుగు/ వెలుగుకు అంటిన/ నల్లని మరకల గురించి అడుగు’’ అప్పుడే కవి సజీవ దృశ్యంగా ఉంటారని జూకంటి రాస్తాడు. కవులు అనధికారిక శాసనకర్తలని ఆంగ్లంలో ఒక మాట ఉంది. కనుక వారి కలం, వారి గొంతు ప్రజాపక్షమే. ఏలికలో భాగమైన కవిలో సృజనాత్మకత ఒట్టిపోతుంది. ప్రపంచీకరణ పతాక స్థాయికి చేరుకున్న కాలంలో విధ్వంసమవుతున్న మానవ విలువలు కవిని పాలక కొసకు చేర్చుతున్నాయనే న్యాయమైన ఫిర్యాదు జూకంటికి ఉంది. సచివాలయ గుమ్మానికి కవులు స్వచ్ఛందంగా శిరస్సులను వేలాడదీసుకున్నారని బాధపడుతున్నాడు. రాజ్యం కోసం అక్షరం సొట్టపడకూడదని నెత్తి నోరు మొత్తుకొని బామాడుతున్నాడు.
కవి మట్టిలో కలిసిపోవచ్చు. కానీ జీవనది లాంటి అక్షరం మాత్రం గొంతు లేనివారికి ఆసరా కావాలి. జూకంటి అర్ధశతాబ్ద కవితా ప్రవాహం 18 సంపుటాల్లో, 1745 పేజీల్లో నిక్షిప్తమైంది. ఒక్క వ్యాసంలో ఆయన కవితా ఆత్మను ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు.
చింతకింది కాశీం
97014 44450
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News