Political Allegations: ప్రజాస్వామ్య పునాదులపైనే కుట్రలా
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:56 AM
‘ఓట్ల సవరణ జరిగినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం. సరిగ్గా పరిశీలించకపోవడం మన తప్పే’ అని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీ అంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు...
‘ఓట్ల సవరణ జరిగినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం. సరిగ్గా పరిశీలించకపోవడం మన తప్పే’ అని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీ అంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీకే చెందిన మంత్రి కేఎన్ రాజన్న సమాధానం ఇచ్చారు. రాహుల్గాంధీ వెర్రితనాన్నే బయటపెడతావా అని ఆగ్రహించిన హైకమాండ్ రాజన్న పదవిని పీకేసింది. కానీ ఆయన వ్యక్తం చేసిన సందేహమే అందరిదీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓట్ల చోరీ జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించక ముందు బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఓట్ల చోరీ చేసి గెలవగలిగితే– ఎందుకు బీజేపీ పరాజయం పాలయ్యింది? రాహుల్‌గాంధీ ఈ లాజిక్ మిస్ అయినా ప్రజలు మిస్ కారు.
ప్రతిపక్ష నేతలు ఎవరైనా అధికార పార్టీ మీద పోరాడతారు. కానీ మన దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత మాత్రం భిన్నం. ఆయన ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ఉంటారు. కర్ణాటకలోని మహదేవపురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికల సంఘం రాహుల్‌గాంధీ ప్రకటించినవి వాస్తవాలేనని చెప్పి ఫిర్యాదు చేయమని కోరింది. ధ్రువీకరించి అఫిడవిట్‌లా ఇవ్వాలని కోరింది. కానీ ఆ పనికి రాహుల్ సిద్ధంగా లేరు.
మహదేవపురాలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 6.5 లక్షల మంది ఓటర్లలో లక్ష ఫేక్ అని రాహుల్ అన్నారు. మహదేవపురా అసెంబ్లీ నియోజకవర్గం బెంగళూరులో భాగం. అది పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం. బెంగళూరు అంటే ఉపాధి కేంద్రం. దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ స్థిరపడతారు. ఓటర్లుగా నమోదు చేసుకుంటారు. తమ సొంత ప్రాంతాల్లోనూ నమోదు చేసుకుంటారు. ఓటర్ జాబితాలో ఉండే ఇలాంటి తప్పిదాల వల్ల మెట్రో సిటీల్లో యాభై శాతం కూడా పోలింగ్ జరగదని చెబుతూంటారు. ఎందుకంటే ఓటు నమోదు చేసుకుని పోయినవాళ్లు ఆ సంగతి మర్చిపోతారు. ఇంకో చోట ఓటు నమోదు చేసుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ బిహార్‌లో ఇలాంటి అక్రమాల్ని తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తున్నారు.
మహదేవపురాలో ఉన్న సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీన్ని సరి చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. బిహార్‌లో ఈసీ చేస్తున్నది కూడా అదే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేసి ఓటర్ల జాబితాను సంస్కరిస్తున్నారు. కానీ బిహార్‌లో ఓటర్లను తీసేస్తున్నారని గగ్గోలు పెడుతున్న రాహుల్ ఇప్పుడు ఓటర్ల జాబితాలో మూడు, నాలుగు ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలను పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు దేశమంతా ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ చేయాల్సి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం పూర్తి స్థాయిలో ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు రాహుల్‌గాంధీ అడ్డుకున్నారు. సుప్రీంకోర్టులో కేసులు వేసి తమ పార్టీకి చెందిన లాయర్లతో వాదింపచేశారు. చివరికి అనుసంధానం చేయకుండా చేశారు.
ఆరోపణలు చేయడం, తరువాత రాజ్యాంగ వ్యవస్థకు క్షమాపణలు చెప్పడం ప్రతిపక్ష నేతకు పరిపాటిగా మారింది. నిన్నటి వరకూ రాహుల్‌గాంధీ ఈవీఎంలను నిందించేవారు. ఇప్పుడు హఠాత్తుగా ఈవీఎంల గురించి మరిచిపోయారు. ఓటర్ల జాబితాలను తెరపైకి తెచ్చారు. ఓటములకు కారణాలు వెతుక్కోవడంలో ఉండే సూక్ష్మబుద్ధిని ఓటమికి కారణమైన పద్ధతులను మార్చుకోవడంలో ఎందుకు చూపించరో అర్థం కాదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, అవే తన వాదనకు రుజువు అని రాహుల్ అంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని లెక్కలు చెప్పాయి. కానీ ఏం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది కదా. మరి ఈ ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు అనడం లేదు? ఈవీఎంలపై, ఓటర్ల జాబితాలపై నమ్మకం లేకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలనూ రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే అంతకుముందు పదేళ్లపాటు తెలంగాణలో జరిగిన ఏ ఒక్క ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. సాధారణ ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. అంతదాకా ఎందుకు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందట జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మరి ఏడాదిలో ఎలా అధికారంలోకి వచ్చింది?
భారత ప్రజాస్వామ్యానికి విశ్వాసమే పునాది. ఆ పునాదిని కాపాడేది ఎన్నికల సంఘం. ఆ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడానికి రాహుల్‌గాంధీ ఓటర్ల జాబితాలో ఉండే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారసుడిగా ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఒక్క విజయాన్నీ అందించలేని తన అసహాయతను, వైఫల్యాన్ని ఎన్నికల సంఘంపై రుద్దాలనుకుంటున్నారు.
‘‘నిజమైన భారతీయుడివైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’’ అని మన దేశాన్ని కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ డౌట్ ఇప్పుడు దేశ ప్రజలందరికీ వస్తోంది. రాహుల్ నిజమైన భారతీయుడైతే మన దేశ ప్రజాస్వామ్య పునాదులపై ఎందుకు కుట్ర చేస్తారు? అర్థంపర్థం లేని ఆరోపణలతో ఎందుకు ఈసీపై దాడి చేస్తున్నారు? దేశమే టార్గెట్‌గా రాహుల్ చేస్తున్న కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.
యస్. విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News