Share News

Indian Communists: కమ్యూనిస్టుల ఐక్యత అసంభవమా

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:26 AM

వంద సంవత్సరాల ఉద్యమ చరిత్ర గల ఇండియన్‌ కమ్యూనిస్టులు గత ఆరు దశాబ్దాలలో అనేక విధాలుగా చీలిపోయారు. సమాంతరంగా అదే వంద సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థిరపడి, ఈ రోజు భారతీయ జనతాపార్టీని...

Indian Communists: కమ్యూనిస్టుల ఐక్యత అసంభవమా

వంద సంవత్సరాల ఉద్యమ చరిత్ర గల ఇండియన్‌ కమ్యూనిస్టులు గత ఆరు దశాబ్దాలలో అనేక విధాలుగా చీలిపోయారు. సమాంతరంగా అదే వంద సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థిరపడి, ఈ రోజు భారతీయ జనతాపార్టీని, పరోక్షంగా ఈ దేశాన్ని శాసిస్తున్నది.

రాజ్యాంగ రీత్యా ఎన్నికల ద్వారానే గతంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్న కమ్యూనిస్టులు, ఈ రోజు ఆ ఎన్నికల ద్వారానే తమ అస్తిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నారు. ఈ దుస్థితికి మూల కారణాలు ఏమిటి? మార్క్సిస్టు మూల సిద్ధాంతాలను, ఈ దేశ ప్రజల స్వభావానికి, అవసరాలకు అనుగుణంగా అన్వయించి ఆచరించలేకపోవడమా? ప్రజా పోరాటాలలో అపారమైన త్యాగాలు చేసిన కమ్యూనిస్టులే దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? రైతాంగ–కార్మిక పోరాటాల నాయకత్వాన్ని కోల్పోయారా?

1964 తర్వాత క్రమంగా 1970 నాటికి కమ్యూనిస్టుల్లో చీలికల్లో చీలికలు ప్రారంభమైన యథార్థాన్ని చరిత్ర నిరూపిస్తున్నది. రాజకీయ విశ్లేషకుడు సీనియర్‌ జర్నలిస్టు మోహన్‌రామ్‌ (ది మెయిల్‌–మద్రాసు) ఆ రోజుల్లోనే రాసిన ‘Split within split’ పుస్తకం చర్చనీయాంశమైంది. కమ్యూనిస్టుల భవిష్యత్తు గురించి ఆనాడే ఆయన హెచ్చరించాడు. తర్వాత ‘Maoism in India’ అనే గ్రంథం రచించాడు.

ఇక 1974 నాటికే అంతర్జాతీయంగా రష్యన్‌–చైనీస్‌ కమ్యూనిస్టు శిబిరాలుగా విడిపోగా, కోమింటెర్న్‌ (కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌) బలహీనపడింది. ఆనాటి సోవియట్‌ రష్యాను ‘సోషల్‌ సామ్రాజ్యవాదం’గా కొందరు పరిగణించారు. ఆ రోజుల్లోనే తరిమెల నాగిరెడ్డి సంపాదకత్వంలో, అనంతపురం నుంచి ‘జనశక్తి’ పక్షపత్రిక వెలువడుతుండేది. నేను రాసిన ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టుల ఐక్యత సాధ్యమా?’ వ్యాసాన్ని జూన్‌ 5, 1974న ‘జనశక్తి’లో ప్రచురించారు.


అంతకుపూర్వం వామపక్ష రచయిత ఫెలిక్స్‌ గ్రీన్‌ (‘The enemy’ గ్రంథంతో ప్రసిద్ధి) అమెరికన్‌ వారపత్రిక ‘గార్డియన్‌’ 25వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ సోషల్‌ సామ్రాజ్యవాదాన్ని విమర్శించారు. అంతర్జాతీయంగా కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని కోరిన ఫెలిక్స్‌ గ్రీన్‌ ప్రసంగాన్ని నేను నా వ్యాసంలో సవివరంగా ఉటంకించాను. విప్లవకారుల మధ్య చీలిక కోసం కాకుండా ఐక్యత కోసం నిజాయితీగా కృషి జరిపినప్పుడే శ్రామికవర్గాన్ని చోదకశక్తిగా నడిపించే విప్లవ పార్టీ నిర్మాణమవుతుందని నేను రాసిన ఆ వ్యాసంలోనే, ఆనాటి ఫెలిక్స్‌గ్రీన్‌ వాక్యాలు కొన్ని– ‘విప్లవం ఒక సంఘటన కాదు. అది ఒక క్రమ పరిణామంలో వచ్చే దశ’ అనే ముగింపునకు ముందు ఆయన ఒక చోట వేసిన ప్రశ్నలు ‘‘విప్లవకరమైన మార్పులు కోరుతున్న మనం చేదు నిజాలను గమనించవలసి ఉంది. సమాజాన్ని–వ్యవస్థను సమూలంగా మార్చాలనుకున్నప్పుడు ఐక్యత, సంస్థ (పార్టీ) అవసరం. ఐక్యత, నిర్మాణం లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? మనం పరస్పరం సహకరించుకొని ఒకే సంస్థను ఎందుకు నిర్మించుకోలేము? మనలోనే ఎందుకు ఇన్ని వైరుధ్యాలు?’’

మితవాద, అతివాద కమ్యూనిస్టులలో చీలికల పర్వం కొనసాగుతున్న కాలంలోనే, కమ్యూనిస్టు విప్లవ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు– ఒక మౌలిక పంథా ఆధారంగా కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతా కేంద్రంగా యూసీసీఆర్‌ (ఎంఎల్‌)ను స్థాపించారు. గత నాలుగైదు దశాబ్దాల కాలంలో ఆ మౌలిక పంథాపై సరైన చర్చ జరగలేదు, ఐక్యత ఫలించలేదు.

ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ–శ్రీకాకుళం తదితర పోరాటాలు జరిగిన దేశ కాల పరిస్థితులు వేరు. ఆ పోరాటాలలో కమ్యూనిస్టుల విజయాలతో పాటు, ప్రయోగాలుగా కొన్ని వైఫల్యాలు మిగిలిపోయాయి. చివరికి ఈనాడు 60 సంవత్సరాల పరిణామక్రమంలో మావోయిస్టుల మిలిటెన్సీ త్యాగాల నేపథ్యంలో వారు తమ పంథా మార్చుకుంటే తప్ప భవిష్యత్తు లేదని చరిత్ర హెచ్చరిస్తున్నది.

మరోవైపు విప్లవ కమ్యూనిస్టుల పేరిట, ఆయా గ్రూపులుగా చలామణిలో ఉన్న పార్టీలలో ముఖ్యంగా గత 25 సంవత్సరాల కాలంలో మరిన్ని చీలికలు– బ్రాండ్‌నేమ్స్‌ తగిలించుకున్నట్లు చీలిపోయి, నాయకత్వం కోసం స్థానిక బలం కోసం ఎవరికి వారుగా విడిపోవడం ఒక హాస్యాస్పదమైన పరిణామం.


ఈ దశలో కనీసం సీపీఐ–సీపీఎం పార్టీలైనా ఏకమై ఉమ్మడిగా పార్లమెంటరీ పంథాలోనైనా ప్రజా ఉద్యమాలను నిర్వహించవచ్చునని, కీ.శే. సురవరం సుధాకర్‌రెడ్డి చివరి వరకు కూడా మనసారా కోరుకున్నారు.

ఇంతకూ కమ్యూనిస్టుల అనైక్యతకు కారణాలేమిటి అనే మీమాంసలో, సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు, రచయిత కందిమళ్ల ప్రతాపరెడ్డి ఇటీవల ప్రచురించిన ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉద్యమ ప్రస్థానం’ అనే పుస్తకంలో నిర్మొహమాటంగా కొన్ని ప్రశ్నలు సంధించి నిలదీస్తున్నారు– వాటిలో కొన్ని– 1) విలీనానికి ఆటంకంగా ఉన్న సిద్ధాంత విభేదాలేమిటి? 2) నాయకత్వం పోతుంది, పార్టీ ఆస్తులు పోతాయన్న భయమా? 3) నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయనా? 4) విమర్శ–ఆత్మవిమర్శ అన్న మౌలిక సూత్రాన్ని విస్మరించి, విమర్శలకే పరిమితం కావడమా? 5)ప్రజల, శ్రేయోభిలాషుల ఆలోచనా విధానాలకు భిన్నంగా ఉండడమా?

ప్రతి ఒక్క కమ్యూనిస్టు ఆత్మవిమర్శ చేసుకొని, ఐక్యత– విలీనం దిశలో కృషి చేస్తూ, కలిసొచ్చిన వారితో ‘వామపక్ష ప్రజాతంత్ర–ఐక్య సంఘటన నిర్మాణం’ జరగాలని ఆయన కోరుతున్నారు.

ప్రస్తుతం భారతీయ ప్రజాస్వామ్యమనేది మన రాజ్యాంగ నీడలోనే మతోన్మాదాన్ని, సంకుచిత జాతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నది. మరోవైపు వికృత సంస్కృతి విజృంభించి మానవీయ విలువలు నశిస్తున్నాయి. ఈ దేశంలోని అన్ని కులాల్లో బ్రాహ్మణీయ భావజాలం, మూఢ దైవభక్తి జీర్ణించుకుపోయింది. సాంస్కృతికంగా ఒక మానవీయ ప్రత్యామ్నాయ సంస్కృతిని, కమ్యూనిస్టులు ఆచరణలో నిరూపించలేదు. కులాలు, మతాచారాల మధ్య కొట్టుకుపోయారు. శ్రామిక రంగంలో వామపక్షాల అనైక్యత, బలహీనతల వల్ల మత–మితవాద శక్తులన్నీ మరింత బలపడినాయి.

ఇప్పుడైనా మార్క్సిస్టు–లెనినిస్టు మూలసూత్రాల నిబద్ధత ఉన్న కమ్యూనిస్టులందరూ చిత్తశుద్ధితో ఏకం కాని పక్షంలో మరింతగా మూలకు నెట్టబడతారు. అర్ధ భూస్వామ్య, అర్ధ వలస స్థాయి నుంచి ఈ రోజు భారతీయ ఆర్థిక–సామాజిక వ్యవస్థ పెట్టుబడిదారి దళారుల చేతిలో ఉంది. విదేశీ పెట్టుబడులకు తోడైన స్వదేశీ క్యాపిటలిస్టులు బాహాటంగానే దోచుకుంటున్నారు. దేవాలయాలు–విగ్రహాలు నిర్మించి ప్రజలను భ్రమావరణంలోకి నెడుతున్నారు. ఈ దశలో భారతీయ కమ్యూనిస్టులు మారిపోయిన పరిస్థితులను అనుసరించి ‘Reinvent’ చేసుకోవడం (పునరావిష్కరణ) తిరిగి తెలుసుకోవడం అవసరమని రాజనీతి శాస్త్రవేత్తలు, ప్రజా మేధావులు భావిస్తున్నారు. గత చరిత్ర–సెంటిమెంట్ల భారాన్ని వదిలివేసి, వామపక్ష నాయకులు–అనుయాయులు ఉద్యమించడమే మార్గాంతరం!

నిఖిలేశ్వర్‌

ఇవి కూడా చదవండి..

మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

For More National News and Telugu News

Updated Date - Sep 13 , 2025 | 01:26 AM