Share News

Silent Social Revolution India: మరో పదేళ్లకు నిశ్శబ్ద విప్లవానికి విజయమేనా

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:15 AM

వాస్తవాలకూ భావాలకూ మధ్య సంబంధం ఎప్పుడూ సంక్లిష్టమైనదే. ఏదో కారణంతో ఎప్పుడో ఒకప్పుడు ఏర్పరచుకున్న భావాలను ఒకపట్టాన మార్చుకోలేం. వాస్తవాలు మారినప్పుడు వాటి ఆధారంగా ఏర్పడిన...

Silent Social Revolution India: మరో పదేళ్లకు నిశ్శబ్ద విప్లవానికి విజయమేనా

వాస్తవాలకూ భావాలకూ మధ్య సంబంధం ఎప్పుడూ సంక్లిష్టమైనదే. ఏదో కారణంతో ఎప్పుడో ఒకప్పుడు ఏర్పరచుకున్న భావాలను ఒకపట్టాన మార్చుకోలేం. వాస్తవాలు మారినప్పుడు వాటి ఆధారంగా ఏర్పడిన భావాలూ మారాలి. అదంత తేలికకాదనే సంగతి ఏ సమాజ చరిత్రను చూసినా అర్థమవుతుంది. భౌతిక, జీవ, రసాయన విజ్ఞానాల విషయంలో భావాలను మార్చుకోటానికి అందరమూ సంసిద్ధంగానే ఉంటాం. సామాజిక వాస్తవాల దగ్గరికి వచ్చేటప్పటికి అంతటి సంసిద్ధతను వ్యక్తంచేయలేం. అసలు కొన్ని సామాజిక వాస్తవాలను అంగీకరించటానికి కూడా మనం ఇష్టపడం. ప్రతిభ అనేది పూర్తిగా పుట్టుకతో రాదనీ దానికీ మనం అనుభవించే సామాజిక హోదాలకూ, లభ్యమయ్యే వెసులుబాట్లకూ సంబంధం ఉందంటే.. కాదని చెప్పేందుకు ఆధునిక, సనాతన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. సమాజ కట్టుబాట్ల కారణంగా కొన్ని సామాజిక వర్గాలు వివిధ రంగాల్లో వెనుకబడి ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించని పరిస్థితి నిన్నమొన్నటివరకూ ఉండేది. అట్లాగే కొన్ని సామాజిక వర్గాలు ఇటీవల గణనీయంగానే ముందంజ వేస్తున్నాయంటే కాదని వాదించే పరిస్థితీ ఉంది. మారుతున్న సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని భావాలను సరిచూసుకోవటమూ, సరిదిద్దుకోవటమూ ఎంతో సంఘర్షణతో కూడుకున్నది. కష్టమైనా, నష్టమైనా ఆ సంఘర్షణను ఎల్లకాలమూ వాయిదా వేయలేం. మారుతున్న సామాజిక వాస్తవాలు ఏదోరూపంలో బలంగా ముందుకు తోసుకువస్తూనే ఉంటాయి. అవి పెట్టే రాపిడితో పాతకాలం నాటి వాస్తవాల ఆధారంగా ఏర్పరచుకున్న భావాలను మార్చుకోక తప్పనిసరి పరిస్థితీ ఎదురవుతుంది.

ఉన్నత విద్యారంగంలో అగ్రకులాలు అగ్రభాగాన ఉన్నారంటే ఎవ్వరికీ సందేహం రాదు. మన సామాజిక వాస్తవం అలాంటిది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ 2011–12 సంవత్సరం వరకూ ఇదే పరిస్థితి ఉంది. జనాభాలో పావువంతుకు కాస్త అటుఇటుగా ఉండే అగ్రకులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో 57.1శాతం ఆనాటికి ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితి మారింది. 2022–2023 సంవత్సరానికి వచ్చేటప్పటికీ మార్పు కొట్టొచ్చినట్లుగా కనపడింది. 2011–12 నాటికి ఉన్నత విద్యారంగంలో 42.9 శాతం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంఖ్య 2022–23కు వచ్చేసరికి 60.9 శాతానికి చేరింది. దీనికి భిన్నంగా మరో విచిత్రం కూడా జరుగుతోంది. ఉన్నత విద్యారంగంలో అగ్రకుల (ఓసీలు) విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇదొక నమ్మలేని నిజం! 2011–12 పోల్చితే ఆ తర్వాత 13 ఏళ్లల్లో ఉన్నత విద్యారంగం బాగా విస్తరించింది. ఈ విస్తరణతో ఓసీ విద్యార్థుల సంఖ్య మొత్తంగా ఎంతోకొంత పెరగాలి. కానీ ఆ కాలంలో 11 లక్షల మంది ఓసీ విద్యార్థులు తగ్గారు. 2010–11లో 1.83 కోట్ల ఓసీ విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో ఉంటే 2022–23 నాటికి ఆ సంఖ్య 1.72 కోట్లకు పడిపోయింది. ఓసీలకు మాత్రమే లబ్ధి చేకూర్చటానికి తీసుకువచ్చిన 10శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కూడా ఈ తరుగుదలను ఆపలేకపోయాయి.


ఉన్నత విద్యారంగంలో మార్పులు ఆషామాషీవి కావు. సమాజంలో మారుతున్న బలాబలాలకు ఉన్నత విద్యారంగం ఎప్పుడూ బలమైన సూచికగానే ఉంటుంది. విద్యారంగానికి తోడు ఉద్యోగ రంగంలో కూడా సామాజికవర్గాల వారీ ఖచ్చితమైన గణాంకాలు సేకరించినప్పుడు ఇప్పటికే వచ్చిన మార్పులూ సమీప భవిష్యత్తులో రానున్న మార్పులూ స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికైతే ఉద్యోగాల గురించి దేశవ్యాప్త సమాచారం లేదు. ఉన్నత విద్యారంగం గురించి మాత్రం అటువంటి సమాచారమూ, దాని విశ్లేషణా అందుబాటులో ఉంది. ఉదయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)కు సంబంధించిన ‘సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌’ విభాగం.. కేంద్ర విద్యాశాఖ ఏటా ప్రచురించే నివేదికలను విశ్లేషించి మారుతున్న సామాజిక చిత్రాన్ని మనకు అందించింది. కేంద్ర విద్యాశాఖ ప్రచురించే నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ఐఐఎంకు చెందిన ముగ్గురు అధ్యాపకులు వెంకటరామన్‌ కృష్ణమూర్తి, త్యాగరాజన్‌ జయరామన్‌, దీనా బెనర్జీలు అంకెల విషయంలో చాలా జాగ్రత్త వహించారు. పేజీపేజీకి అధికారిక అంకెలనూ వాటి మూలాలనూ స్పష్టంగా పేర్కొన్నారు.

పదమూడు ఏళ్లలో దేశంలో రిజర్వేషన్ల శాతాల్లో పెద్దగా మార్పులు రాలేదు. వాటిని పెంచటానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినా అవి కోర్టుల జోక్యంతో అమలుకాలేదు. ఈశాన్య ప్రాంతాలు, తమిళనాడు లాంటి ఒకటిరెండు పెద్ద రాష్ట్రాలు మినహా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50శాతం రిజర్వేషన్లే అమలవుతున్నాయి. అంటే ఉన్నత విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థుల ఎదుగుదలకు ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 50శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యే ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత విద్యాసంస్థలకే ఈ ఎదుగుదల పరిమితం కాలేదు. ప్రభుత్వ సహాయం లభించని ప్రైవేటురంగంలోని విద్యాసంస్థల్లోనూ అది స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంఖ్య 62.2 శాతం ఉంటే ప్రైవేటురంగంలో అది 60శాతంగా నమోదైంది. పోనీ ఈ వర్గాల విద్యార్థులు సంప్రదాయక కోర్సులైన బీఏ, ఎంఏ, బీకాం లాంటి వాటికే పరిమితమయితే దాన్ని ఒకరకంగా వెనుకబాటుగానే పరిగణించొచ్చు. కానీ పరిస్థితి అలా లేదు. బీటెక్‌ (48.2శాతం), బీఈ(60.5శాతం), ఎంటెక్‌ (63శాతం), ఎంబీఏ (51,2శాతం), ఎంబీబీఎస్‌ (44.7శాతం), ఎండీ (40శాతం) లాంటి కోర్సుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థుల ఎదుగుదల స్పష్టంగా కనపడుతోంది. సాంకేతిక, వైద్య, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరికల సగటు ప్రగతిరేటు ఇతర కోర్సులతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. మున్ముందు ఈ కోర్సుల్లో కూడా ఈ వర్గాల విద్యార్థులు ఓసీ విద్యార్థులతో సమానస్థాయిని సాధించటం కష్టం కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే దాన్ని సాధించారు.


ఇక ఓసీ కేటగిరీ విద్యార్థుల సంఖ్య ఉన్నత విద్యారంగంలో తగ్గిపోవటం చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 36 ఉంటే 23 చోట్ల ఈ తగ్గుదల కన్పిస్తోంది. రెండేళ్లకు (2020–21, 2021–22) సంబంధించిన గణాంకాలను విశ్లేషిస్తే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అనూహ్యంగా ఉంది. తమిళనాడులో ఇంకాస్త ముందుకు వెళితే తగ్గుదల తీవ్రత స్పష్టంగా కనపడుతుంది. 2010–11లో అక్కడ ఉన్నత విద్యలో ఓసీ విద్యార్థులు 8,51,839 మంది ఉంటే 2021–22 నాటికి ఆ సంఖ్య 5,61,978కి పడిపోయింది. తెలంగాణలో అదే కాలంలో ఆ విభాగాల విద్యార్థుల సంఖ్య 5,55,430 నుంచి 4,65,812కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్య 7,12,663 నుంచీ 6,20,159లకు పడిపోయింది. కర్ణాటకలో 1,06,739 మంది విద్యార్థులు తగ్గిపోయారు. కేరళలో ఈ తగ్గుదల 11శాతం ఉంది. బహుశా ఈ వర్గాల జనాభా రేటు గణనీయంగా తగ్గటం కూడా దీనికి ప్రధాన కారణం కావొచ్చు.

రాష్ట్రాల మధ్య అసమానతలు మన దేశంలో కొత్తకాదు. ఇవి ఎంతోకొంత విద్యారంగ అభివృద్ధిలోనూ కనపడటం సహజం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఎదుగుదలను ఉన్నత విద్యారంగంలో గణనీయంగా తగ్గించే పరిస్థితిని కలిగించని రీతిలోనే అవి ఉన్నట్లుగా గణాంకాలను చూస్తే అర్థం అవుతుంది. 17 రాష్ట్రాల్లో ఈ వర్గాల విద్యార్థులు మూడింట రెండు వంతులకు కాస్తపైగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మరో ఎనిమిది రాష్ట్రాల్లోనైతే నాలుగింట మూడొంతులకు పైగా ఉన్నత విద్యారంగంలో నమోదయ్యారు. ఇక తమిళనాడులో 83శాతం, తెలంగాణలో 70.8, ఆంధ్రప్రదేశ్‌లో 67.9, కర్ణాటకలో 68.5శాతం చొప్పున విద్యార్థులు ఉన్నారు. కేరళలో మాత్రం ఈ వర్గం విద్యార్థుల సంఖ్య 48.5 శాతానికి మించలేదు.


ఉన్నత విద్యారంగానికి సంబంధించిన పదమూడేళ్ల గణాంకాల పరమార్థం చెప్పెది ఒక్కటే. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ప్రగతి ఇకముందు కూడా అదే స్థాయిలో ఉంటే 2027–28 నాటికి ఉన్నత విద్యారంగంలో వారి సంఖ్య మూడింట రెండు వంతులకు మించిపోయే అవకాశం ఉంటుంది. ఇక 2035–36 నాటికి నాలిగింట మూడువంతులకు మించొచ్చు. అంటే రిజర్వేషన్లలో ఎటువంటి మార్పులు లేకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యారంగంలో వారి జనాభా దామాషాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లభిస్తుంది! ఇది ఆశించిన విధంగా సాకారమైతే దీన్నొక నిశ్శబ్ద సామాజిక విప్లవంగానే పరిగణించొచ్చు. 1980ల తర్వాత ఉత్తరాదిన చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగటాన్ని నిశ్శబ్ద విప్లవంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు క్రిస్టోఫ్‌ జఫ్రలొట్‌ చేసిన వ్యాఖ్యానానికి సార్థకత ఉందనుకుంటే.. దీన్నీ ఆ విధంగానే చూడక తప్పదు! అయితే స్థూలచిత్రాలూ, స్థూలసంఖ్యలూ నిర్దిష్ట వాస్తవాలనూ, నిర్దిష్ట చిత్రాలనూ ప్రతిఫలించలేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిల్లో నిర్దిష్టంగా ఎవరు ఉన్నత విద్యారంగంలో ఎదుగుతున్నారో పరిశీలిస్తే కఠోర ఆర్థిక సత్యాలే కళ్లముందు కనపడతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కులాలు, అందులోనూ పై వర్గాలే ఇంకా పైపైకి ఎదుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐఎం విశ్లేషకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని అందరికీ ఉన్నత విద్యా అవకాశాలు సముచితంగా అందాలంటే విధానపరమైన మార్పులు చేపట్టాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితిని చెప్పటానికి జస్టిస్‌ రోహిణి కమిషన్‌ పరిశీలనలో వెల్లడైన కొన్ని విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. రోహిణి కమిషన్‌ 1,30,000 పైగా ఉద్యోగాల ఎంపికనూ, విద్యారంగ ప్రవేశాలనూ విశ్లేషించింది. 25శాతం కులాలకు చెందినవారే 97శాతం ఉద్యోగాలనూ. విద్యారంగ ప్రవేశాలనూ దక్కించుకున్నారు. 37శాతం కులాలకు సున్నా ప్రాతినిధ్యం లభించింది. 994 కులాలకు కేవలం 2.68శాతం ఉద్యోగాలూ, ప్రవేశాలూ దక్కాయి. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి కనపడుతుంది. రిజర్వేషన్లలో అధిక ప్రాతినిధ్యం పొందిన కులాలు వర్గీకరణలకూ, సంపన్నశ్రేణుల మినహాయింపులకూ ఒక పట్టాన అంగీకరించవు. అందుకే మారుతున్న వాస్తవాలనూ నిరాకరిస్తాయి.


ఏ కోణం నుంచి చూసినా ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పు ప్రగాఢమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు నాలుగింట మూడోవంతు సీట్లు దక్కటం ఖాయంగా కనపడటం.. గిడసబారిన సూత్రీకరణలకూ, పడికట్టు భావాలకు అతీతంగా జరుగుతున్న సామాజిక పరివర్తనకు ఒక గట్టి సూచిక. ఆ వాస్తవ గమనాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే 1990ల్లో మొదలై ఇప్పటికీ మారని నినాదాలనూ, భావాలనూ, రాజకీయాలనూ ప్రశ్నించే పరిస్థితే ఎదురవుతుంది! పాత భావాలతో కొత్త వాస్తవాలను విస్మరించటం వల్ల అది కాస్త ఆలస్యం కావచ్చు. కానీ దాని అనివార్యతను మాత్రం ఆపలేం!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి..

నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే

నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 16 , 2025 | 05:15 AM