Share News

కాంగ్రెస్‌లో కోవర్టులు కొత్త వాస్తవమా?

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:16 AM

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సరిగా పనిచేయడం లేదని నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలు తరుచూ ఢిల్లీ వచ్చి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలో...

కాంగ్రెస్‌లో కోవర్టులు కొత్త వాస్తవమా?

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సరిగా పనిచేయడం లేదని నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలు తరుచూ ఢిల్లీ వచ్చి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండేది కనుక పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆమెను కలుసుకునేందుకు నేతలు క్యూలు కట్టేవారు. ఒక రోజు సోనియాగాంధీ లోక్‌ సభలోనే ఒక వర్కింగ్ కమిటీ సభ్యుడితో మాట్లాడుతూ ‘ఇదేమిటి? వైఎస్‌పై ఎప్పుడూ ఏవో ఫిర్యాదులు వస్తున్నాయి’ అని అడిగారు. ‘మేడమ్, మీ పక్కన మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, చిదంబరం, నేనూ కూర్చున్నాం. మన్మోహన్ సింగ్ ఎప్పుడూ ఎన్నికల్లో నెగ్గలేదు. చిదంబరం ఎంపీగా ఉన్న తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ మన పార్టీ కాదు. ప్రణబ్ ముఖర్జీ నాలాగే మొదటి సారి ఎన్నికల్లో గెలిచారు. మీరు యూపీ నుంచి గెలిచారు కాని యూపీలో మన పార్టీ లేదు. పార్టీ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ మీద ఫిర్యాదులు వస్తే ఆయన అధికారం ఎలా చలాయించాలో మనం చెప్పగలమా..’ అని ఆయన జవాబిచ్చారు. అందుకు సోనియా నిజమే.. అని నవ్వుతూ అంగీకరించారు. మరునాడు సెంట్రల్ హాలు గుండా వెళుతుండగా ఒక మాజీ ఎంపీ ఆమె వెంటపడి వైఎస్‌పై ఏవో ఫిర్యాదులు చేయబోతే గట్టిగా మందలించారు. ‘మీకు ఇదే పనా?’ అని అడిగారు. దీనితో ఆయన ఖంగుతిని వెళ్లిపోయారు. మొదట్లో వైఎస్ మాటిమాటికీ ఢిల్లీ వచ్చి రాష్ట్ర పరిణామాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఎవరు ఏ లేఖలు రాసినా, ఫిర్యాదులు చేసినా ఆయనను పిలిపించేవారు. కాని ఆయన క్రమంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారిపై పై చేయి సాధించారు. వారి ఎత్తులకు పై ఎత్తు వేసేవారు. అధిష్ఠానం వద్ద తన నిర్ణయాల గురించి గట్టిగా వాదించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బలంగా వ్యతిరేకించేవారు. ఒక సందర్భంలో తాను రాజీనామా చేసి బెంగళూరు వెళిపోతానని చెప్పినట్లు సమాచారం. తొలి రోజుల్లో తాను అంతరాత్మగా వ్యవహరించే కేవీపీ రామచందర్‌రావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించుకోలేకపోయారు. కాని క్రమంగా అధిష్ఠానంపై పట్టు సాధించిన తర్వాత కేవీపీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. తన వర్గీయులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పించుకోగలిగిన శక్తి ఆయన సంపాదించారు.


కాంగ్రెస్ రాజకీయాలు అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారాయా? అధిష్ఠానం విన్నా, వినకపోయినా ఇప్పటికీ ఢిల్లీ వచ్చి నేతల్ని కలుసుకుని ఫిర్యాదులు చేసేవారు మాత్రం మారలేదు. సోనియాగాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జిల నివేదికలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. వారు మేనేజ్ అవుతున్నారంటే మార్చేసేవారు. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో నిరంతరం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతల హడావిడి ఎక్కువగా ఉండేది. ప్రతి పార్టీ ప్రధాన కార్యదర్శి చుట్టూ రాష్ట్రాల నేతలు తిరిగేవారు. టికెట్ కోసం ఢిల్లీలో నేతల చుట్టూ ఎలా తిరగాల్సి వచ్చేదో ఇటీవల మాజీ కాంగ్రెస్ నేత గల్లా అరుణకుమారి తన ఆత్మకథలో రాశారు. ఒక నాయకుడు తానిచ్చిన కాగితాలు క్రింద విసిరికొట్టారని చెప్పారు. రాష్ట్ర సీనియర్ నేతల అంతర్గత రాజకీయాలు తన పుస్తకంలో స్పష్టంగా వివరించారు. కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం పనిచేసే తీరు మాత్రం మారలేదు.

కాంగ్రెస్ కూడా ఇప్పటి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకున్నట్లే లాగే వివిధ రాష్ట్రాల్లో తామే అధికారంలో ఉండాలని కోరుకునేది. ‘బండి ముందుకు సాగాలంటే రెండు ఎద్దులు ఉండాలి. ఆ విధంగా కాక ఒకటి ఎద్దు, మరొకటి ఒంటె, గాడిద, కంచర గాడిదో అయితే బండి ముందుకు సాగదు..’ అని రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పారు.


ఇటీవల రాహుల్‌గాంధీ గుజరాత్‌లో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశమైన తర్వాత తమ పార్టీలో సగం మంది నాయకులకు పైగా బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని చెప్పారు. అయితే రాహుల్‌గాంధీ చెప్పిందేమీ కొత్త విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టు సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నది. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పనులకోసం అధికారంలో ఉన్న తమ ప్రత్యర్థి పార్టీతో అంటకాగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దిగ్విజయ్‌సింగ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో మధ్యప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఆయన సోదరుడితో సహా బీజేపీలో చేరారు. ‘ఇదేమిటి సార్..’ అని అడిగినప్పుడు ‘మరి వారంతా ఎలా బతకాలి? అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతలతో చేతులు కలపడం అనేది మామూలే. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే ఒక విజిల్ వేస్తే వారంతా మళ్లీ మా పార్టీలోకి వస్తారు చూడండి..’ అని నవ్వారు. ఆయన చెప్పిన విధంగా అయిదేళ్ల తర్వాత మళ్లీ దిగ్విజయ్‌సింగ్ సోదరుడితో పాటు బీజేపీలో చేరిన అనేకమంది కాంగ్రెస్ నేతలు మళ్లీ స్వంత పార్టీలోకి వచ్చారు. అయితే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఉన్నప్పుడే ఏ విజిల్ అయినా పనిచేస్తుంది. గుజరాత్‌లోనే కాదు, అనేక రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ఇతర పార్టీల నేతల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో, తన పార్టీని ఎలా విస్తరించాలో అన్న విషయంపై పట్టు సాధించారు. రాజకీయాల్లో అవసరాలు, ప్రయోజనాలు, ప్రలోభాలను అధిగమించి వ్యవహరించేవారు అరుదు. మొగల్స్‌, పోర్చుగీస్‌, డచ్‌, బ్రిటిష్ వారు దండయాత్రలు చేసి రాజ్యాలు కబళించినప్పుడు కూడా వారి అండకోసం స్థానిక రాజులు ప్రయత్నించిన ఉదంతాలు ఎన్నో. ఇప్పుడు పార్టీ నేతల్లో అత్యధికులు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులే. తమ సొంత ప్రయోజనాలకోసం ఇతర పార్టీ నేతలతో అంటకాగకూడదంటే వింటారా. వారు వింటారన్న గ్యారంటీ లేదుగాక లేదు.

రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒకర్నొకరు ఓడించుకున్న, ఒకర్నొకరు పార్టీలో పైకి ఎదగకుండా అడ్డుకున్న సందర్భాలు అసంఖ్యాకం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామమూర్తి మధ్య ఆసక్తికరమైన వైరం ఉండేది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డితో సహా అనేకమంది రాజకీయ నేతలు తమ స్వంత పార్టీ నేతల్నే ఓడించుకుని, తమ ముఖ్యమంత్రులనే గద్దె దించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు ఎన్నో. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కూడా ఈ వెన్నుపోట్ల రాజకీయాలకు గురైనవారే. 1998లో పీసీసీ అధ్యక్షుడైన తర్వాత వైఎస్ ఈ విషయం పార్టీ సమావేశంలోనే అంగీకరించారు. ‘నాతో సహా అందరం ఒకర్నొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించాం. ఇకమీదట మనమెవరూ అలా చేయకూడదు. కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే మనమందరం కలిసి పనిచేయాలి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించేందుకు అందరం కృషి చేయాలి..’ అని ఉపన్యసించారు. కాని ఆ తర్వాత పరిస్థితుల్లో పెద్దగా మార్పులు కనపడలేదు.


విచిత్రమేమంటే కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి, స్వంత పార్టీలు పెట్టినవారు మళ్లీ అదే పార్టీలోకి వచ్చి కీలకమైన పదవులు పొందిన దాఖలాలు ఉన్నాయి. చెన్నారెడ్డి, ప్రణబ్ ముఖర్జీ, మూపనార్, చిదంబరం, కరుణాకరన్, ఆంటోనీ, బన్సీలాల్, బంగారప్ప, ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్, సుఖ్‌రామ్, సురేశ్ కల్మాడీ లాంటివారు వీరిలో ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరంటే అసంతృప్తికి గురై, తమకు ప్రాధాన్యం లేదని స్వంత పార్టీలు పెట్టుకుని వెళ్లిపోయి మళ్లీ వచ్చినవారైతే సైద్ధాంతికంగా పూర్తిగా భిన్నమైన భారతీయ జనతా పార్టీలో చేరిన నేతలు కూడా కాంగ్రెస్‌కు చెందినవారు కావడం విస్మయం కలుగుతోంది. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వంటి పదవులు అనుభవించిన ఎస్ఎం కృష్ణ, అమరేందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌పిఎన్ సింగ్ లాంటి వారు, పలువురు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు బీజేపీలో చేరారంటే కాంగ్రెస్‌లో ఉండి వారు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఎంతమేరకు జీర్ణించుకున్నారా అన్న అనుమానాలకు ఆస్కారం లభిస్తుంది.

మహాత్మాగాంధీ కాలంలో జిన్నాతో విభేదించినా, సావర్కర్‌తో విభేదించినా సెక్యులరిజం అనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌ బలంగా అనుసరించేదని, క్రమక్రమంగా ఈ సిద్ధాంతం పలచబడిపోయిందని మాజీ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఆర్థిక విధానాల మధ్య వ్యత్యాసం చెరిగిపోవడం కూడా కాంగ్రెస్‌ బలహీనపడడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు బీజేపీ తాను ఇతర పార్టీలకంటే భిన్నమైన పార్టీ అని ప్రచారం చేసి వెలుగులోకి వచ్చిందని, ఇప్పుడు బీజేపీకి భిన్నమైన పార్టీగా తన విశిష్టతను కాంగ్రెస్ నిరూపించుకోవాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ తాను ప్రజల విశ్వాసాన్ని చూరగొని మళ్లీ గెలుస్తుందన్న నమ్మకాన్ని కార్యకర్తలు, నేతల్లో కల్పించనంతవరకూ పరిస్థితుల్లో మార్పు ఉండదని, తమ పార్టీనేతలే కోవర్టులు కావడం నాయకత్వ వైఫల్యానికి, బలహీనతకు నిదర్శనమని ఆయన అభిప్రాయం. ‘సిద్ధాంత కాలుష్యమే ప్రస్తుత రాజకీయాలకు పట్టిన పీడ. దాన్నుంచి బయటపడితే కాని మన సమాజం బాగుపడదు’. అని స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఒకప్పుడు అన్న మాటలు ప్రస్తుత పరిస్థితులకూ వర్తిస్తాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 01:16 AM