India China Relations: భారత్ చైనా కరుగుతున్న మంచు
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:51 AM
ఫిబ్రవరి 2014లో చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ మళ్ళీ క్రీ.పూ. నాటి ‘సిల్క్ రూట్’ను పునరుద్ధరిస్తున్నాం, అని ప్రకటించినప్పుడు చైనాకు అదొక అత్యాశతో కూడిన కల అని ప్రపంచం అనుకుంది. ప్రపంచం అలా అనుకుని వుండొచ్చు...
ఫిబ్రవరి 2014లో చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ మళ్ళీ క్రీ.పూ. నాటి ‘సిల్క్ రూట్’ను పునరుద్ధరిస్తున్నాం, అని ప్రకటించినప్పుడు చైనాకు అదొక అత్యాశతో కూడిన కల అని ప్రపంచం అనుకుంది. ప్రపంచం అలా అనుకుని వుండొచ్చు, కానీ సరిహద్దున ఉన్న మనమూ అలాగే అనుకుని సరిపెట్టేసుకున్నాం. అప్పటికి ఒబామా రెండవసారి అధ్యక్షుడు కావడంతో ఆసియా–పసిఫిక్ కేంద్రిత అంతర్జాతీయ వ్యవహరాల్లో మనం చురుగ్గా ఉన్నాం. సరిహద్దున చైనాను నిలువరించడానికి మన దేశం ‘ఆసియాన్’ వాణిజ్య కూటమిలో ఉండడం ‘జియో–పొలిటికల్’గా తగిన సమతూకం అని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. రేపు ఆ వెసులుబాటు ఏ కారణం వల్లనైనా జారిపోతే, అప్పుడు మన వైఖరి ఎలావుండాలి అనే ముందస్తు ఆలోచనను అప్పట్లో మనం చేయలేదు.
ట్రంప్ వచ్చి 23 జనవరి 2017న ‘ట్రాన్స్–ఫసిఫిక్’ ఒప్పందంలో ఇకముందు అమెరికా ఉండదని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంతో చైనా తన దక్షిణ సరిహద్దున ఆగ్నేయ ఆసియా దేశాలపై ఆధిక్యత కోసం, ముడుచుకున్న కాళ్ళు కాస్తా బార్లా చాపింది! మారిన ట్రంప్ వ్యూహం వల్ల ఆసియాలో ఏమి జరుగుతోందని ఆరా తీసేంత స్థిమితం అమెరికాకు లేకపోయింది. అదను ఎంచి, మొదట ‘సిల్క్ రూట్’ ప్రకటించిన చైనా దాన్ని ‘వన్ బెల్ట్ – వన్ రోడ్’గా మార్చింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘సిగ్నేచర్ ప్లాన్’గా ప్రపంచ మీడియా అభివర్ణించిన ‘ఓబీఓఆర్’ అధికారిక ప్రకటన బీజింగ్‌లో 28 దేశాల అధిపతులు, వంద దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య 2017 మే 14–15 తేదీల్లో ఘనంగా జరిగింది. రష్యా నుంచి వ్లాదిమీర్ పుతిన్, బ్రిటన్ నుంచి తెరిస్సా మే, ఫిలిప్పీన్స్ నుంచి డి రోడ్రిగో, పాక్ నుంచి నవాజ్ షరీఫ్ వంటి వారు వచ్చారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిం యంగ్ కిం, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియోనా లెగడ్రే ఆ రోజు అక్కడ ఉన్నారు. యాభైకి పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. చివరికి అమెరికా, జపాన్ సైతం చైనాతో ఉన్న వాటి అభ్యంతరాలను పక్కన పెట్టి తమ ప్రతినిధులను బీజింగ్‌కు పంపాయి. అయితే భారత్ దీనికి హాజరు కాలేదు!
జరిగింది ఏమిటి? అని చూసినప్పుడు ప్రపంచీకరణ ప్రభావాన్ని సకాలంలో అంచనా వేసి, ఆసియాలో అందరి కంటే ముందుగా ఆసియా, యూరప్, ఇండో–పసిఫిక్ దేశాలతో చైనా తన వాణిజ్య బంధనాలను ముడివేసుకుంది. ఇంకా అభివృద్ధి చెందని తన మైదాన ప్రాంతానికి ‘బెల్ట్’ పేరుతో ఉపరితల రవాణా ద్వారా మధ్య ఆసియా దేశాలకు తలుపులు తెరిచింది. ‘రోడ్’ ద్వారా సముద్ర జలాల నుంచి ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి నూతన వాణిజ్య ద్వారాలను తెరిచింది. ఇదిలా ఉంటే, వారం ముందు వరకు ఈ సదస్సుకు హాజరుపై మన నిర్ణయం అసందిగ్ధంగానే మిగిలింది.
ఇంతకీ ఈ చైనా చొరవపై మోదీ ప్రభుత్వ అభ్యంతరం ఏమిటి? ‘బెల్ట్’లో భాగంగా చైనాలోని ఖెస్ఘర్ నుంచి పాక్ పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రంలో ఉన్న గ్వాదర్ పోర్టుకు ‘చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’ పేరుతో ఒక ప్రత్యేక రోడ్డును నిర్మించింది. ఇది 3 భాగాలుగా వుంది. ఇందులో మొదటిదైన 1300 కి.మీ. కారకోరం హైవే– చైనా నుంచి బయలుదేరి– పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి, అక్కణ్ణించి ఇస్లామాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. అలా అది పాకిస్థాన్ భూభాగాన్ని తూర్పు నుంచి పడమరకు ఆసాంతం దాటి గ్వాదర్ పోర్ట్ చేరుతుంది. మోదీ ప్రభుత్వం ఇందుకు అభ్యంతరం చెబుతున్నది.
మన సరిహద్దున ఉన్న పొరుగు దేశం మరొక దేశంలో నుంచి తూర్పు పడమరలను కలుపుతూ 3217కి.మీ. హైవే వేసుకుని వ్యాపారం చేసుకుంటుంటే– తన ప్రయోజనం కోసం పాక్ అందుకు అనుమతించింది. అయితే దాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉండడం, భారత సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించడంగా మోదీ ప్రభుత్వం భావించింది. నిజానికి ఇండియా అప్పుడే దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ‘రికార్డు’లో అది– ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ అనే ‘క్లాజ్’తో దాన్ని అంగీకరించి ఉంటే, ఎలా ఉండేదో? కానీ అది జరగలేదు.
ఇది జరిగిన నెలలోపే, బీజింగ్‌లో జరగవలసిన తొమ్మిదవ ‘బ్రిక్స్’ సదస్సు ముందస్తు సన్నాహాలపై జూన్ 10–12న చైనా సభ్యదేశాల ప్రతినిధులను పిలిచింది. ఇండియా అప్పటి బీజేపీ జనరల్ సెక్రటరీ రాంమాధవ్‌ను చైనాకు పంపి, ‘వన్ బెల్ట్–వన్ రోడ్’ ఆరంభానికి భారత్ గైర్హాజరీపై మన సమర్థనకు ఆయన్ని ప్రతినిధిగా ఎంచుకుంది. ఇది జరిగాక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2019 అక్టోబర్ 11–12న ఇండియాకు సౌహర్ద పర్యటనకు వస్తే, అందుకు తగిన వేదికగా మొదట వారణాసి అనుకొని, ఆ తర్వాత దాన్ని తమిళనాడు మహాబలిపురం సముద్ర తీరానికి మార్చారు. శ్రీలంక తీరంలో చైనా తిష్ఠవేసుకున్న వేళ, ఎన్డీఏ రాజకీయ అవసరాల కోసం దక్షిణాదిన ఇటువంటి స్థల మార్పు చేశారు.
వరుసగా మోదీ మూడు ‘టర్మ్’ల విజయం తర్వాత 2025 నాటికి ‘బ్రిక్స్’ దేశాల కూటమి బలపడి, ‘గ్లోబల్ సౌత్’ భావన ముందుకు వచ్చింది. పైగా వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ‘బ్రిక్స్’ దేశాల మధ్య ‘సౌత్–సౌత్ కోపరేషన్’ తప్పనిసరి అయింది. ఈ కాలంలో చైనా–పాక్‌లతో ‘ఎన్డీఏ’ ప్రభుత్వం అనుసరించిన దౌత్య విధానం మాటేమిటి? సమాధానం చెప్పవలసిన అనివార్యత ఏర్పడడంతో ఆగస్టు 31న మోదీ చైనా వెళుతున్నారు. ఏడేళ్ల తర్వాత మన వైపు నుంచి మొదలైన ఈ కదలికతో, చైనా విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చివెళ్ళారు.
జాన్‌సన్ చోరగుడి
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి