Share News

GST Rate Reductions Are Welcome: తగ్గింపులు సరే, క్షమాపణలు ఏవీ

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:33 AM

కేంద్ర ప్రభుత్వానికి తుదకు వివేకోదయమయింది. ఈ సెప్టెంబర్‌ 3న ప్రభుత్వం విస్తృత శ్రేణి వస్తువులు, సేవలపై పన్ను (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ –జీఎస్టీ) రేట్లను హేతుబద్ధీకరించి, తగ్గించింది. శుభం. జీఎస్టీ ఇప్పుడు ‘గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌’ భావన...

GST Rate Reductions Are Welcome: తగ్గింపులు సరే, క్షమాపణలు ఏవీ

కేంద్ర ప్రభుత్వానికి తుదకు వివేకోదయమయింది. ఈ సెప్టెంబర్‌ 3న ప్రభుత్వం విస్తృత శ్రేణి వస్తువులు, సేవలపై పన్ను (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ –జీఎస్టీ) రేట్లను హేతుబద్ధీకరించి, తగ్గించింది. శుభం. జీఎస్టీ ఇప్పుడు ‘గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌’ భావన (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అనేకానేక పరోక్ష పన్నులను ఒకే ఒక పన్నుగా సమైక్యపరచడం)కు సన్నిహితంగా ఉన్నది, సందేహం లేదు. పలువురు రాజకీయవేత్తలు, ఎంతో మంది వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు, (నాతో సహా) వ్యక్తులు ఎందరో వస్తు సేవల పన్ను అనేది గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌ వలే ఉండాలని ఎనిమిదేళ్లుగా వాదిస్తూ వస్తున్నారు.

ఆగస్టు 2016లో రాజ్యాంగ (122వ సవరణ) బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు రాజ్యసభలో నేను ఆ చర్చలో పాల్గొన్నాను. ఆనాటి నా ప్రసంగంలోని కొన్ని భాగాలను ఉటంకించడం అప్రస్తుతం కాదు. నేను ఇలా అన్నాను: ‘‘వస్తు సేవల పన్నును అమలుపరచాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని తొలుత అధికారికంగా ప్రకటించింది డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనన్న వాస్తవాన్ని ఆర్థికమంత్రి అంగీకరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 28, ఫిబ్రవరి 2005న ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో జీఎస్టీని తొలిసారి ప్రకటించారు. వస్తుసేవల పన్నులో నాలుగు ప్రధాన అంశాలు ఉన్నాయి.....’’

‘‘122వ రాజ్యాంగ సవరణ బిల్లులోని చాలా ముఖ్యమైన విషయాన్ని తరచి చూడదలుచుకున్నాను. మనం పరోక్ష పన్ను గురించి వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని దయచేసి మరచిపోవద్దు. పరోక్ష పన్ను అనేది నిర్వచనం రీత్యా ఒక తిరోగామి పన్ను (పన్ను మొదట్లో చెల్లించేది ఒకడు. అంతిమంగా దాని భారాన్ని భరించేది మరొకడు అయినప్పుడు ఆ పన్నును పరోక్ష పన్ను అంటారు). ఏ పరోక్ష పన్ను అయినా ధనికులు, పేదలు ఒకే రీతిలో చెల్లించేదిగా ఉంటుంది.... ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు నివేదిక ఇలా పేర్కొంది: ‘అధికాదాయమున్న దేశాలలో సగటు జీఎస్టీ రేటు 16.8 శాతం. భారత్‌ లాంటి మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తున్న భారత్‌ లాంటి దేశాలలో సగటు జీఎస్టీ రేటు 14.1 శాతం’. ప్రపంచ వ్యాప్తంగా 190కు పైగా దేశాలలో జీఎస్టీ అనేది ఏదో ఒక రూపంలో ఉన్నది. అది సగటున 14.1 శాతం–16.8 శాతం మధ్య ఉన్నది....’’


‘‘పన్నురేట్లను మనం తక్కువగా ఉంచవలసిన అవసరమున్నది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత ఆదాయాలను పరిరక్షించి తీరాలి... ‘రెవెన్యూ తటస్థ రేటు’ (రెవెన్యూ న్యూట్రల్‌ రేట్‌ – జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణ తరువాత ప్రభుత్వం సేకరించే మొత్తం పన్ను ఆదాయం మునుపటిలాగే ఉండేందుకు దోహదం చేసే ప్రామాణిక పన్ను రేటు)ను కనుగొనడం ద్వారా ప్రభుత్వాల ప్రస్తుత ఆదాయాలను కాపాడాలి... ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో సహా ఆర్థిక నిపుణులతో సంప్రతింపులు, సమాలోచనలతో రెవెన్యూ తటస్థ రేటు 15 నుంచి 15.5 శాతంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. దరిమిలా ప్రామాణిక పన్నురేటు 18శాతంగా ఉండాలని సూచించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు నివేదిక నుంచి గ్రహించే కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రామాణిక పన్ను రేటు 18 శాతం ఉండాలని కోరిందని నేను మళ్లీ చెప్పుతున్నాను...’’

‘‘ప్రజల శ్రేయస్సు కోసం వారి తరఫున ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ప్రజల పేరిట నేను అడుగుతున్నాను: మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సిఫారసు చేసిన రేటునే అమలుపరచండి. ప్రామాణిక పన్ను రేటు 18 శాతం మించకుండా చూడండి... ప్రామాణిక పన్ను రేటు 18 శాతంగా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పరిరక్షించబడతాయని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు తన నివేదికలో సుసంగతంగా వాదించారు. అది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. పన్ను చెల్లింపు ఎగవేతలను నివారిస్తుంది. దేశ ప్రజలందరికీ అంగీకారయోగ్యంగా ఉంటుంది. వస్తువులు, సేవలపై మీరు 24 నుంచి 26 శాతం పన్ను వసూలు చేయదలుచుకుంటే అసలు జీఎస్టీ బిల్లు తీసుకురావడమెందుకు?....’’

‘‘అంతిమంగా ఒక పన్ను బిల్లులో పన్నురేటు ఎంత అనేది స్పష్టంగా పేర్కొనాలి. 70 శాతానికి పైగా వస్తువులు, సేవలకు వర్తించే జీఎస్టీ రేటు ఎట్టి పరిస్థితులలోను 18 శాతానికి మించకూడదని మా పార్టీ తరఫున, నా తరఫున గట్టిగా, స్పష్టంగా కోరుతున్నాను. అలాగే తక్కువ జీఎస్టీ రేటు, డీ మెరిట్‌ రేటు (వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమైన, ప్రతికూల సామాజిక పరిణామాలకు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులు, చక్కెర పానీయాలు మొదలైన వాటి వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు సదరు సరుకులపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్ను రేటు)ను ఆ 18 శాతం ప్రామాణిక రేటు ప్రాతిపదికన నిర్ణయించాలి’’.


నేను ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలనే 2016లో రాజ్యసభ చర్చలో వ్యక్తం చేశాను. వస్తుసేవల పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని, తగ్గించాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినందుకు నేను అమితంగా సంతోషిస్తున్నాను. అయితే వస్తుసేవల పన్నును అమలుపరచదలుచుకున్నప్పుడు ప్రామాణిక పన్నురేటు 18 శాతంగా మాత్రమే ఉంటే భారీ ఆదాయ నష్టం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంభవిస్తుందని మోదీ ప్రభుత్వం వాదించింది. అది నిష్కారణ భయం మాత్రమే. ఆదాయ నష్టం సాకుతో పన్నురేట్లను అధికంగా నిర్ణయించారు. జీఎస్టీ తాజా సంస్కరణలో రెండు శ్లాబ్‌ల రేట్లు 5 శాతం, 18 శాతంగా ఉన్నాయి! పన్ను రాబడిని పెంచుకునేందుకు ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోతే, ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు సరైన మార్గం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించడమే.

గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం వినియోగదారుల నుంచి చివరి పైసాను సైతం రాబట్టుకునేందుకు జీఎస్టీ రేట్లను బహుళ రీతుల్లో నిర్ణయించి అమలుపరిచింది. ఆదాయాన్ని మరింతగా పెంపొందించుకోవడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యంగా ఉన్నది. వస్తుసేవల పన్ను అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరం (జూలై 2017–మార్చి 2018) ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు వసూలుచేసుకున్నది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడి 22 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. వినియోగదారులు కష్టపడి ఆర్జించుకున్న ప్రతి పైసాను వస్తుసేవల పన్ను ద్వారా ప్రభుత్వం లాగివేసుకున్నది. మరి జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అని అపహసించడంలో ఆశ్చర్యమేమున్నది? అది సబబైన ఎగతాళి సుమా! వినియోగం తగ్గిపోవడానికి, గృహ రుణాల (ఇళ్లు, వాహనాల కొనుగోలు మొదలైనవాటికి కుటుంబాలు చేసే రుణాలు) భారం పెరిగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి జీఎస్టీ రేట్లు అధికంగా ఉండడమే. పన్నులు తగ్గించినప్పుడు వినియోగం పెరుగుతుంది – ఇది అర్థశాస్త్ర ప్రాథమిక పాఠం. టూత్‌పేస్ట్‌, తలనూనె, పెన్నులు, పెన్సిళ్లు, నోట్‌ పుస్తకాలు, ట్రాక్టర్లు, స్ప్రింకర్లు మొదలైన వాటిపై 5 శాతం జీఎస్టీ సమంజస నిర్ణయం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ వినియోగ వస్తువులపై జీఎస్టీ అధికంగా ఎందుకు ఉన్నది? ఎనిమిది సంవత్సరాల పాటు ఈ దేశ ప్రజలు అత్యధిక పన్నులు ఎందుకు చెల్లించవలసివచ్చింది?


వస్తుసేవల పన్ను రేట్ల తగ్గింపు ఆరంభం మాత్రమే. పన్నుల వ్యవస్థ ప్రజాహితంగా ఉండేందుకు ఇంకా ఎన్నో సంస్కరణలు చేపట్టవలసి ఉన్నది. ప్రభుత్వం తప్పక చేయవలసినవి: రాష్ట్రాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులను (తప్పనిసరైతే మరిన్ని మినహాయింపులతో) ఏకైక జీఎస్టీ రేటుకు సంసిద్ధపరచాలి; పన్నుల చట్టాలలోని అర్థంకాని పరిభాషను పరిహరించాలి. సరళమైన, సుబోధకమైన మాటలలో ఆ చట్టాలను పునర్లిఖించాలి, నియమనిబంధనలు సామాన్య వినియోగదారులకు సైతం అర్థమయ్యేలా సూటిగా స్పష్టంగా ఉండి తీరాలి; ట్యాక్స్‌ రిటర్న్స్‌ను పదే పదే ఫైల్‌ చేయవలసిన శ్రమను గణనీయంగా తగ్గించాలి; చట్టానికి అనుగుణంగా వ్యవహరించే ప్రక్రియను సరళీకరించాలి. చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులకు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సేవలు అవసరం కాకూడదు; జీఎస్టీ చట్టాలను డీ–క్రిమినలైజ్‌ చేయాలి. అవి వ్యాపార, వర్తకాలకు సంబంధించిన పౌరచట్టాలు అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి విధించే శిక్షను సహేతుకమైన జరిమానాలతో సరిపెట్టాలి. ఉత్పత్తిదారులు, వ్యాపారులు ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవారని, సమాజ శత్రువులు కారనే యథార్థాన్ని పన్ను వసూలు అధికారుల మనసుల్లో నెలకొల్పాలి.

సరే, వస్తుసేవల పన్ను హేతుబద్ధీకరణ శ్రేష్ఠమైన నిర్ణయమే, సందేహం లేదు. అది, ప్రజలకు తాము చేసిన సమున్నత మేలుగా భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడం సబబు కాదు. అంతే కాదు గత ఎనిమిది సంవత్సరాలుగా అధిక జీఎస్టీ రేట్లతో వినియోగదారులను సతమతం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. జీఎస్టీ వ్యవస్థలో మిగతా సంస్కరణలను అమలుపరిచేందుకు ప్రభుత్వం మరో ఎనిమిది సంవత్సరాల వ్యవధిని తీసుకోదని ఆశిస్తున్నాను.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఇవి కూడా చదవండి..

మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

For More National News and Telugu News

Updated Date - Sep 13 , 2025 | 01:34 AM