Nara Lokesh: గేమ్ ఛేంజర్
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:40 AM
‘ప్రత్యర్థి తనకన్నా బలవంతుడైనప్పటికీ ఆశ్చర్యానికి గురి చేసి తేరుకునే లోపే విజయాన్ని సాధించడం, వారి బలహీనతలను సొమ్ము చేసుకొని శాశ్వతంగా ఓడించడం’ – ఇది గెరిల్లా వ్యూహం. యుద్ధాల్లో వాడతారు. కార్పొరేట్ వార్‌లోనూ...
‘ప్రత్యర్థి తనకన్నా బలవంతుడైనప్పటికీ ఆశ్చర్యానికి గురి చేసి తేరుకునే లోపే విజయాన్ని సాధించడం, వారి బలహీనతలను సొమ్ము చేసుకొని శాశ్వతంగా ఓడించడం’ – ఇది గెరిల్లా వ్యూహం. యుద్ధాల్లో వాడతారు. కార్పొరేట్ వార్‌లోనూ ఉంటుంది. కానీ పెట్టుబడుల ఆకర్షణ కోసం బలమైన రాష్ర్టాల మీద ఈ వ్యూహాన్ని మొదటిసారిగా చూస్తున్నాం. దాన్ని ఉపయోగించి నారా లోకేశ్ విజయాన్ని కూడా సాధించారు. దేశ చరిత్రలోనే అత్యధిక ఎఫ్‌డిఐగా గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకువచ్చారు. గూగుల్ రాకతో దేశమంతా ఒక్కసారిగా ఏపీ వైపు చూసింది. పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యర్థులు, పెద్ద రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ర్ట ఆశ్చర్యానికి లోనయ్యాయి. లోకేశ్ అంతటితో ఆగకుండా ‘ఆంధ్రా ఫుడ్ మాత్రమే కాదు... పెట్టుబడులు కూడా మంట పుట్టిస్తున్నాయి’ అని ట్వీట్ చేసి పుండు మీద కారం చల్లారు. దీంతో జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోటీ రాష్ట్రాలపై ఆంధ్రా పైచేయి సాధించిందని దేశమంతా భావించింది.
పారిశ్రామిక పాలసీలు, రాయితీలు అన్ని రాష్ర్టాలు ప్రకటిస్తాయి. కానీ వాటి ద్వారా పరిశ్రమలను ఆకర్షించి గ్రౌండ్ చేయించడంలోనే అసలైన విజయం ఉంది. విజనరీ లీడర్ చంద్రబాబు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ర్టంలో, విభజిత ఆంధ్రలో అనేక రకాల పెట్టుబడులు సాధించారు. ఆయన వారసుడిగా నారా లోకేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చేస్తున్నారు. 14 నెలల్లో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లికి తీసుకొచ్చారు. 13 నెలల్లో గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకువచ్చారు. కేవలం 46 రోజుల్లో ప్రీమియం ఎనర్జీస్ సంస్థకు భూములతో సహా అన్ని అనుమతులు ఇచ్చారు. మీరు వేగంగా బిజినెస్ చేయాలనుకుంటే మా రాష్ర్టానికి రమ్మంటూ లోకేశ్ ఆహ్వానిస్తున్నారు.
నాలుగేళ్లు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీర్ కాలేకపోతే ఎలా అని లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా కరిక్యులమ్‌లో పూర్తి స్థాయి ప్రక్షాళనకు ఆదేశాలిచ్చారు. ప్రపంచ మేటి వర్శిటీల భాగాస్వామ్యంతో అక్వా, క్వాంటమ్, సోలార్, స్పోర్ట్స్ ఇలా అనేక రంగాల వారీగా బ్యాచిలర్ డిగ్రీ నుండి పీహెచ్‌డీ వరకు కోర్సులు అందించేలా వర్సిటీలను తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇరవై లక్షల మందికి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా దాదాపు 8 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే లక్షా 80 వేల ఉద్యోగాలు కల్పించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరుగుతాయి. దీని ద్వారా 7 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
పాలకుడిగానే గాక పార్టీ నాయకుడిగా కూడా లోకేశ్ ప్రత్యర్థి జగన్‌రెడ్డిని ఇరుకున పెడుతున్నారు. మీకు తెలిసిన కంపెనీలతో పెట్టుబడులు పెట్టించండి మీకే క్రెడిట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. పక్క రాష్ర్టాల నేతలు జాతీయ స్థాయిలో ఆ రాష్ర్ట ప్రయోజనాల కోసం ఒక్కటై పోరాడుతుంటే వైసీపీ మాత్రం ఢిల్లీలో రాష్ట్రం పరువు తీస్తుందంటూ దుయ్యబడుతున్నారు. ఏ ఇతర పార్టీ నేతలు కూడా చేయనంతగా లోకేశ్ టీడీపీ కేడర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
అనగాని సత్యప్రసాద్
రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి