Share News

తెలుగు రాష్ట్రాల కయ్యం ఎగువ రాష్ట్రాలకు వినోదం

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:17 AM

కృష్ణ, గోదావరి జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కొట్లాడుకుంటుంటే, ఎగువన వున్న కర్ణాటక, మహారాష్ట్రలు వినోదం చూస్తూ వారి పనులు చక్కబెట్టుకుంటున్నాయి. అన్ని విధాలుగా...

తెలుగు రాష్ట్రాల కయ్యం ఎగువ రాష్ట్రాలకు వినోదం

కృష్ణ, గోదావరి జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కొట్లాడుకుంటుంటే, ఎగువన వున్న కర్ణాటక, మహారాష్ట్రలు వినోదం చూస్తూ వారి పనులు చక్కబెట్టుకుంటున్నాయి. అన్ని విధాలుగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల పాలకులు, ప్రతిపక్ష, ఇతర రాజకీయ నాయకులు, సామాజిక మేధావులు ఒక తాటిపైకి వచ్చి కృష్ణ, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్రలు సాగిస్తున్న ఆధిపత్యంపై పోరాడాలి. ఇక్కడ ఒకే రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి నీటి కోసం అనుసంధానం గురించి ఆలోచించకుండా జాతీయ స్థాయిలో నదుల అనుసంధానంపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఉత్తరాదిన ఉన్న గంగానదిని, దక్షిణాదిన ఉన్న కావేరితో అనుసంధానం చేసినప్పుడే భారతదేశం సస్యశ్యామలమవుతుంది.

జాతీయ స్థాయిలో నదుల సంధానంలో భాగంగా గంగ–కావేరి లింక్‌ ప్రాజెక్ట్‌ గురించి 2000–2004 మధ్య ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి తీవ్రంగా కసరత్తు చేశారు. 2002లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ... దేశంలో కొన్ని రాష్ట్రాలు దుర్భిక్షంతో అల్లాడుతుంటే, మరికొన్ని భయంకర వరదలతో భీతిల్లుతున్నాయని, ఇందుకు శాశ్వత పరిష్కారం నదుల అనుసంధానమేనన్నారు. వెంటనే రంజిత్‌ కుమార్‌ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ విషయాన్ని సుప్రీంకోర్ట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏకీభవించిన న్యాయస్థానం ఈ బృహత్తర పథకాన్ని 2012 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాజ్‌పేయి కూడా అప్పటి కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు సారథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ స్వయంగా వాజ్‌పేయిని కలిసి కోటి రూపాయలు విరాళం కూడా ఇచ్చారు. 2004లో ప్రభుత్వం మారడంతో ఈ నదుల అనుసంధాన ప్రక్రియ మూలనపడింది. సుప్రీంకోర్ట్‌ 2012లో ఈ విషయం గురించి కన్నెర్ర చేసి 2016లోగా నదుల అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించింది. 2014లో మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నదుల అనుసంధానం, గంగానది ప్రక్షాళన, నదులలో పెరుగుతున్న కాలుష్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ కొంతమేర కదలిక తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఈ విషయాలను కేంద్ర పాలకులు పట్టించుకోవడం మానేశారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాయకులు ఎంతగా వద్దని వారించినా కర్ణాటక ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచింది. అలాగే కర్ణాటకలోని ఎగువ తుంగ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. ఇదే విధంగా మహారాష్ట్ర కూడా గోదావరి మీద బాబ్లీ ప్రాజెక్టు పూర్తి చేసింది. కృష్ణ, గోదావరి నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు అనధికారికంగా చెక్‌డ్యాంలు, రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుండి వస్తున్న నీటిపై మన హక్కులను కాపాడుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సమైక్యంగా పోరాడాలి.

తిప్పినేని రామదాసప్పనాయుడు


Also Read:

ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..

బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..

అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 14 , 2025 | 02:17 AM