ఢిల్లీ: మూడోకన్ను తెరిచిన మధ్యతరగతి
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:32 AM
నా స్నేహితురాలు ఒకరు పది సంవత్సరాల క్రితం (ఫిబ్రవరి 2015) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేశారు. ఆమె మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారు. 2014 సార్వత్రక ఎన్నికలలో...

నా స్నేహితురాలు ఒకరు పది సంవత్సరాల క్రితం (ఫిబ్రవరి 2015) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేశారు. ఆమె మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారు. 2014 సార్వత్రక ఎన్నికలలో ప్రప్రథమంగా భారతీయ జనతా పార్టీకి ఆమె ఒటు వేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ పాలన నానా కుంభకోణాలకు తావివ్వడం పట్ల ఆగ్రహంతో ఆమె బీజేపీ వైపు మొగ్గారు. సార్వత్రక ఎన్నికల అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఆమె ఆప్‌కు ఓటు వేశారు. ఎందుకని? ఆమె ఇలా సమాధానమిచ్చారు: ‘మోదీ, కేజ్రీవాల్ ఇరువురినీ నేను ఇష్టపడతాను. ఇరువురూ స్వయం కృషితో ఉన్నతస్థానాలకు ఎదిగిన నాయకులు. మార్పు తీసుకువస్తామని నమ్మకంగా హామీ ఇస్తున్నారు’.
సరే, ఆ ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరికి వద్దాం. ఈ సారి బీజేపీకి ఆమె ఓటు వేశారు గత పదేళ్లుగా ‘ఢిల్లీ ఫార్ములా’ (ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్) ప్రకారం ఆమె ఓటు వేస్తూ వచ్చారు: కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్న ఆలోచన ఆమెకు లేనే లేదు. గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు గనుక కాంగ్రెస్‌కు వేసే ఓటు పూర్తిగా వ్యర్థమయ్యే ఓటే అన్నది ఆమె అభిప్రాయం. మరి ఈసారి ఆప్‌కు ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు? ‘ఆప్ పాలన నాకు తీవ్ర ఆశాభంగం కలిగించింది. నేనూ ఒకప్పుడు ఆప్ వలంటీర్‌గా పని చేశాను. ఇప్పుడు ఆప్ ఏమీ భిన్నమైన పార్టీ కాదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. కేజ్రీవాల్ మరొక రాజకీయవేత్త మాత్రమే’ అని ఆమె సమాధానమిచ్చారు.
ఢిల్లీ సంపన్న మధ్య తరగతి వర్గానికి ప్రతినిధి నా స్నేహితురాలు. ఆమె వోటింగ్ ప్రాధాన్యాలలో, 2025 ఎన్నికలల్లో ఆప్, అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారన్న దానికి కీలక కారణమున్నదని మీరు గ్రహించి ఉంటారు. ఢిల్లీ ఉజ్వల రాజకీయ తారగా కేజ్రీవాల్ మొట్టమొదట మెరిసినప్పుడు సంప్రదాయ రాజకీయవేత్తకు ఆయన పూర్తిగా భిన్నమైనవాడు అనే భావన ప్రజల మనసుల్లో నాటుకు పోయింది. ఐఐటి పట్టభద్రుడు, సమాచార హక్కు కార్యకర్త, మెగాసెసే పురస్కార గ్రహీత, ఇండియా అగనెస్ట్ కరప్షన్ సంస్థాపక సభ్యుడు అయిన కేజ్రీవాల్ అన్నిటికీ మించి ‘ఆశాభావ’ రాజకీయాలకు ప్రతినిధి అని దేశ ప్రజలు భావించారు, గౌరవించారు. నరేంద్ర మోదీ ‘అచ్ఛే దిన్’ (మంచి రోజు) తీసుకువస్తానని హామీ ఇవ్వగా ప్రజా జీవితంలో అవకాశవాద, అవినీతికర, జవాబుదారీతనం తూకుండా వ్యవహరిస్తున్న రాజకీయవేత్తలకు ప్రజా జీవితంలో స్థానం లేకుండా చేస్తానని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. బీజేపీ హిందుత్వ ‘మతతత్వ’ పార్టీగా, కాంగ్రెస్ కుటుంబ–కేంద్రిత, ప్రజలతో సన్నిహిత సంబంధాలు లేని కులీనుల ప్రాబల్యమున్న పార్టీగా ప్రజలు భావిస్తున్న కాలంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. సరికొత్త, ఎటువంటి చరిత్ర భారం లేని పార్టీగా ఆప్ ప్రజల దృష్టికి వచ్చింది. మధ్య తరగతి విద్యావంతులు ఆప్ పట్ల ఆకర్షితులయ్యారు. దేశ పరిస్థితులను సమూలంగా మార్చివేసేందుకు ఆ పార్టీ తమకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలదని ఆశించారు. స్వల్పకాలంలోనే ప్రజల సంపూర్ణ మద్దతుతో ఆప్ అధికారానికి వచ్చింది.
అయితే ఆప్ ‘భిన్నమైన రాజకీయ పార్టీ’ అన్న నమ్మకం గత పదేళ్లుగా క్రమంగా సడలిపోయింది. తొలుత ఆప్ పట్ల ఆకర్షితులయిన మధ్య తరగతి వారే ఇప్పుడు ఆ పార్టీని అధికారం నుంచి తొలగించారు. ఢిల్లీలో ఎల్లెడలా చెత్త కొండలు, రోడ్ల మీద పారుతున్న మురికి నీరు మొదలైన సమస్యలకు పరిష్కారం లభించగలదనే ఆశాభావంతోనే వారు ఆప్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. 2025 ఎన్నికల తీర్పును మధ్యతరగతి ప్రజల ఆగ్రహ ‘ప్రభంజనం’కు అంతిమ దృష్టాంతంగా చెప్పవచ్చు.
ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నను తరచి చూద్దాం: అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రజా నాయకుడుగా తనను తాను పునరావిష్కరించుకోగలరా? తన రాజకీయ పునరాగమనాన్ని సుసాధ్యం చేసే సానుకూలతలను సృష్టించుకోగలరా? నైతిక విలువలకు నిబద్ధమైన నాయకుడు అనే యశస్సు తుడిచిపెట్టుకుపోయినందున కోల్పోయిన వైభవాన్ని పునః సాధించుకునేందుకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ పోరాడవలసి ఉంటుంది, తప్పదు.
రాజకీయ సమస్యలు, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్‌కు ఉన్నట్టుగా ఆప్‌కు పటిష్ఠ సంస్థాగత నిర్మాణం లేదు అధికారాన్ని ఆశించి మాత్రమే ఆప్‌లో చేరినవారు పార్టీ ఫిరాయించేందుకు వెనుకాడరు. వచ్చే కొద్ది నెలల్లో చీలికలు, ఫిరాయింపులతో ఆప్ బలహీనపడే అవకాశం ఎంతైనా ఉన్నది. అసలు కేజ్రీవాల్ నాయకత్వానికే సవాళ్లు ఎదురవ్వవచ్చు.
సందేహం లేదు, ఆప్ అధినేతకు పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ 54 ఏళ్ల కేజ్రీవాల్ రాజకీయ జీవితం సమాప్తమయిందని ఎవరైనా భావిస్తే అది తొందరపాటే అవుతుంది. పూర్తిగా పొరపడడమే కాగలదు. ఢిల్లీ ప్రజా తీర్పు, బ్రాండ్ కేజ్రీవాల్‌ను మధ్యతరగతి ప్రజలు తిరస్కరించిన వాస్తవాన్ని పూర్తిగా ప్రతిబింబించి ఉండవచ్చు గానీ, కిందిస్థాయి అల్పాదాయ వర్గాలవారు ఆయన పాలనను, రాజకీయ శైలిని సంపూర్ణంగా సమర్థించారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆప్ ‘చీపురుకట్ట’ ఒక నిర్దిష్ట వర్గ అస్తిత్వానికి ఒక రాజకీయ చిహ్నంగా భాసిల్లింది, ఇక ముందూ తప్పక భాసిల్లుతుంది. కాకపోతే ఓటమిలో సైతం ఆప్‌కు 44 శాతం ఓట్లు ఎలా వస్తాయి? ఢిల్లీ ఓటర్లలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇంకా గణనీయంగా ఉన్నదనేది కొట్టివేయలేని వాస్తవం ఓటుహక్కును వినియోగించడంలో కాసుల లబ్ధికి తొలి, మలి, తుది ప్రాధాన్యమిస్తున్న బేరసారాల ధోరణి ఓటర్లలో అంతకంతకూ పెరిగిపోతోన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పేదలకు మౌలిక వసతులు సమకూర్చేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలు అంత తేలిగ్గా విస్మరణకు గురవుతాయా? ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇత్యాదులను సామాన్య ప్రజలు తేలిగ్గా విస్మరించరు.
ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఇక నుంచీ కేజ్రీవాల్‌తో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నది. ఆయన్ని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే దానివల్ల నష్టపోయేది తామేనన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలి. కక్ష సాధింపు చర్యలు కేజ్రీవాల్ మళ్లీ వీథుల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తాయి. 2024లో ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొదటిసారి అరెస్టయి జైలుకు వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగడం ద్వారా కేజ్రీవాల్ పెద్ద తప్పుచేశారు. అధికారాన్ని త్యజించి ప్రజా న్యాయస్థానంలో తీర్పుకు ప్రయత్నించి ఉంటే ఆయనకు చాలా సమస్యలు తప్పిపోయి ఉండేవి. సుప్రీంకోర్టు తీర్పు నొకదాన్ని తోసిపుచ్చేందుకు కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నించినప్పుడైనా కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్లి ఉండవలసింది. గత అక్టోబర్‌లో తన జూనియర్ సహచరురాలు ఆతిషికి అధికారాన్ని అప్పగించే నాటికి సమయం మించిపోయింది, ఆప్ పట్ల అభిమానం, కేజ్రీవాల్ పట్ల సానుభూతి ప్రజల్లో దాదాపుగా అంతరించిపోయాయి.
సామాన్య ప్రజలతో మళ్లీ ఆత్మీయానుబంధాన్ని నెలకొల్పుకుని, తన విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు కేజ్రీవాల్ సంవత్సరాల క్రితం తాను ఎక్కడ ప్రారంభమయ్యారో తిరిగి అక్కడకే వెళ్లి తీరాలి. అసాధారణ పోరాటకారుడు కేజ్రీవాల్. ప్రజా సమస్యలను శాసనసభలోను, వెలుపల నిలకడగా నమ్మకంగా లేవనెత్తి వాటి పరిష్కారానికి పోరాడే సామర్థ్యమున్న నేతగా అరవింద్ కేజ్రీవాల్ అద్వితీయుడు. భారత రాజకీయాలలో ఇటువంటి సమర్థ నేతలకు ఇంకా స్థానమున్నది. వ్యూహాత్మక మేధ, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేజ్రీవాల్ అవసరం బాగా ఉన్నది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఓటమి కేజ్రీవాల్‌కు అవసరమైన ఒక మేలుకొలుపు.
తాజా కలం: బీజేపీకి ఓటు వేసిన నా మిత్రురాలు ఆప్ పట్ల ఇంకా పూర్తిగా విముఖం కాలేదు. ‘బీజేపీ తన హామీలు అన్నిటినీ నెరవేరిస్తే, మంచిదే. లేనిపక్షంలో ఐదు సంవత్సరాల తరువాత నేను మళ్లీ నా నిర్ణయాన్ని మార్చుకుంటాను’ అని ఆమె అన్నారు. భారతదేశ రాజకీయాలలో ఏదీ స్థిరంగా ఉండదు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల నిర్ణయాలు చాలా చంచలంగా ఉంటాయి.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
Also Read:
ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..
బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..
అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..