Share News

Road Safety: మృత్యు రహదారులు

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:56 AM

మంచి రహదారులు తయారయ్యాక వాహనాల వేగం పెరిగి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి సమయం తక్కువ అయ్యింది. అయితే అదే వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా సుమారు...

Road Safety: మృత్యు రహదారులు

మంచి రహదారులు తయారయ్యాక వాహనాల వేగం పెరిగి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి సమయం తక్కువ అయ్యింది. అయితే అదే వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా సుమారు 13లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కోట్లాది మంది గాయాలతో, వైకల్యాలతో బాధపడుతున్నారు.

మంచి రోడ్లు ఉన్నాయని చాలామంది నిర్లక్ష్యంగా నడుపుతున్నారు: హద్దుమీరి వేగం పెంచడం, ఫోన్ మాట్లాడుతూనో, మత్తులోనో, అలసటలోనో వాహనం నడపడం... ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్‌లు మొదలైన వాటి విషయంలో సరైన అవగాహన లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారింది.

దేశం ఏదైనా ప్రమాదాలకు కారణాలు మాత్రం అవే: వేగం, నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్, వాహన సంరక్షణ సరిగా చేయకపోవటం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం... మొదలైనవి. ఇది గుర్తించిన అనేక దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచంలో రోడ్డు భద్రతలో స్వీడన్ అగ్రగామి దేశం. 1997లో వారు ‘విజన్ జీరో’ అనే ప్రత్యేక విధానాన్ని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ‘‘రోడ్డు ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా కోల్పోవడం అంగీకారయోగ్యం కాదు’’. ఈ విధానం ప్రకారం అక్కడి రహదారి వ్యవస్థను సురక్షితంగా రూపొందించారు. రోడ్డు నిర్మాణంలో రెండు దిశల మధ్య బారియర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదకర కూడళ్ల వద్ద వృత్తాకార మార్గాలను ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం ప్రత్యేక జోన్లు, ఫుట్‌పాత్‌లు సృష్టించారు. వాహన భద్రతా సాంకేతికతలో భాగంగా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్‌లు, సీట్ బెల్ట్ అలామ్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేశారు. వేగ నియంత్రణ కోసం ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వేగ పరిమితి తగ్గించారు. కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేశారు. రోడ్డు భద్రతపై విద్యా కార్యక్రమాలు నిర్వహించి, డ్రైవింగ్‌లో క్రమశిక్షణ పెంచారు. జపాన్‌లోనూ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. వేగ నియంత్రణ కెమెరాలు, ఆటో బ్రేక్ వ్యవస్థలు, లేన్ డిసిప్లిన్ సిస్టమ్స్ అన్ని వాహనాల్లోను ఉంటాయి. మత్తులో డ్రైవింగ్ చేస్తే తీవ్ర శిక్షలు విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కఠినమైన శిక్షణ, పరీక్షలు తప్పనిసరి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు రోడ్డు భద్రతా పాఠాలు బోధిస్తారు. అందుకే అక్కడ ప్రమాదాలు చాలా తక్కువ. యూకేలో ‘థింక్ రోడ్ సేఫ్టీ’ అనే ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచారు. వేగ పరిమితులను కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, లైటింగ్, పాదచారి మార్గాలను మెరుగుపరుస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో రోడ్లను పునర్‌ రూపకల్పన చేశారు. ఈ దేశాలు ప్రమాదాలపై డేటా సేకరించి విశ్లేషిస్తాయి. చర్యలు తీసుకుంటాయి.


భారతదేశంలో రహదారులూ ఎక్కువే, ప్రమాదాలు కూడా ఎక్కువే. దీనికి పరిష్కారంగా మోటార్ వెహికల్ అమెండ్‌మెంట్ ఆక్ట్ ద్వారా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. పాఠశాలల్లో, కళాశాలల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వేగంగా వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యం. యూరప్ దేశాల్లో ‘గోల్డెన్ అవర్’ సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తారు. ప్రమాదం జరిగిన గంటలో చికిత్స అందిస్తారు. భారతదేశంలో ‘108 అంబులెన్స్ సర్వీస్’ ఈ దిశగా ఒక మంచి ఉదాహరణ. అమెరికా, యూకే వంటి దేశాల్లో బాధితులకు బీమా పరిహారం వెంటనే అందుతుంది. భారతదేశంలో కూడా ‘రోడ్ యాక్సిడెంట్ రిలీఫ్ ఫండ్’ వంటి పథకాలు ప్రారంభమయ్యాయి. జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఉన్నాయి. మానసిక కౌన్సెలింగ్, వైద్య సేవల ద్వారా బాధితులు తిరిగి సాధారణ జీవితంలోకి వస్తున్నారు. యూకేలోని ‘బ్రేక్’, ఆస్ట్రేలియాలోని ‘అరైవ్, అలైవ్’ వంటి సంస్థలు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహనను పెంచి, బాధితులకు సహాయం చేస్తున్నాయి.

రోడ్లు కేవలం వేగం కోసం గాక, భద్రత కోసం ఉండాలి. ప్రభుత్వం రహదారి నిర్మాణంతో పాటు– భద్రతా విధానాలు, కఠిన చట్టాలు, డ్రైవర్ ట్రైనింగ్, అత్యవసర సేవలను బలోపేతం చేయాలి. ప్రజలూ తమ బాధ్యతను గుర్తించి ట్రాఫిక్ నియమాలను గౌరవించాలి. మన ప్రాణం మాత్రమే కాదు, ఇతరుల ప్రాణం కూడా మన చేతిలోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి.

భవిష్యత్తులో సాంకేతికత పెద్ద పాత్ర పోషించనున్నది. ఆటోమేటిక్ బ్రేక్‌లు, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు ప్రమాదాలను తగ్గిస్తాయి. కానీ వీటితో పాటు సహనం, క్రమశిక్షణ, కరుణ వంటి మానవ విలువలు కూడా అవసరం. రోడ్డు భద్రత అంటే కేవలం చట్టం లేదా సాంకేతికత కాదు, అది ప్రతి మనిషి బాధ్యత. అభివృద్ధి అంటే ప్రాణాలు కోల్పోవడం కాదు, వాటిని కాపాడుతూ ముందుకు సాగడం. ప్రతి కొత్త రహదారి భద్రత, అవగాహన, బాధ్యత అనే విలువలతో నిర్మాణం కావాలి. ప్రపంచంలోని మంచి పద్ధతులను నేర్చుకొని మన దేశంలో అమలు చేస్తే, వేగం – అభివృద్ధి – భద్రత మధ్య సమతుల్యం సాధ్యమవుతుంది.

పి. వేణుగోపాల్‌రెడ్డి

ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 05:56 AM