Share News

ఈ పోటీలు ఫక్తు వ్యాపారం

ABN , Publish Date - May 13 , 2025 | 05:23 AM

మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. మన దేశంలో ఇదివరకు 1996లో, 2024లో ఈ పోటీలు నిర్వహించారు. ఇది ముచ్చటగా మూడోసారి. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు జరిగిన అందాల పోటీలను పరిశీలిస్తే వీటి వెనుక పెట్టుబడిదారీ మార్కెట్ ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయో అర్థమవుతుంది....

ఈ పోటీలు ఫక్తు వ్యాపారం

మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. మన దేశంలో ఇదివరకు 1996లో, 2024లో ఈ పోటీలు నిర్వహించారు. ఇది ముచ్చటగా మూడోసారి.

ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు జరిగిన అందాల పోటీలను పరిశీలిస్తే వీటి వెనుక పెట్టుబడిదారీ మార్కెట్ ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయో అర్థమవుతుంది. అందాల సంస్కృతిని స్త్రీలపై రుద్దటం ద్వారా ఆయా దేశాల్లో సౌందర్య సాధనాలకు సంబంధించిన మార్కెట్‌ను పెంచటమే ఈ పోటీల లక్ష్యం. ఇదేవిధంగా పలు కార్పొరేట్‌ సంస్థలు దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా, మెక్సికో దేశాలలో లాభాల పంట పండించుకున్నాయి. వెనిజులా, జమైకా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలైతే అందాల సుందరులను ఉత్పత్తి చేసే పరిశ్రమలుగా మారిపోయాయి. అందాల పోటీల్లో పలు కిరీటాలు దక్కించుకున్న మన దేశం కూడా ఈ వ్యాపారానికి ముఖ్యమైన గమ్యంగా మారింది.

ఈ పెట్టుబడిదారులు ఏ దేశాల్లో ఐతే వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తారో ఆ దేశాల స్త్రీలే అందాలరాణులుగా ఎంపికై కిరీటాలు దక్కించుకుంటారు. ఈ కారణం వల్లనే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే వర్ధమాన దేశాలే ఎక్కువగా అందాల కిరీటాలను గెలుచుకుంటాయి. ఎందుకంటే, పాశ్చాత్య ప్రపంచంలో సౌందర్య సాధనాల వినియోగం ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ దేశాలలో సౌందర్య, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, బ్రాండ్ల మార్కెట్‌ ఇక పెద్దగా పెరిగేందుకు ఆస్కారం లేదు. ఉదాహరణకి– ప్రపంచానికే ఫ్యాషన్ రాజధానిగా పేరున్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ఫ్యాషన్ ప్రపంచాన్నే శాసించే యూరప్, అమెరికా దేశాల మహిళలు చాలా తక్కువసార్లు కిరీటాలు గెలుచుకున్నారు. దీని అర్థం న్యాయ నిర్ణేతలకు ఆ దేశాల వారు అందంగా కనిపించటం లేదని కాదు కదా! వెనిజులా దేశం ప్రపంచ సుందరి పోటీలలో ఏడుసార్లు విజేతగా నిలిచింది. కానీ 2013 తర్వాత వెనిజులాలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయింది. సౌందర్య సాధనాల పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. అందుకే– ఆ దేశం 2013లోనే చివరిసారి అందాల కిరీటాన్ని గెలుచుకున్నది!


మన దేశం విషయానికే వస్తే– 1992 వరకు భారతదేశంలో అందాల సుందరీమణులే లేరు! 1990లో సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత దేశంలో బహుళ జాతి కంపెనీలకు ప్రవేశం మొదలైంది. ఆ కంపెనీలు ఎక్కడ ఆదేశిస్తే అందాల కిరీటాలు అక్కడికే తరలివెళ్తాయి. అక్కడికే అందాల పోటీల వేదికలు కూడా వెళ్తాయి. ఇందులో భాగంగానే 90వ దశకంలో ఇండియాలో అందాల పోటీలకు తెరలేచింది. అప్పటి నుంచి భారతీయ వనితలు వరుసగా కిరీటాలు దక్కించుకున్నారు. మార్కెట్ శక్తుల ప్రయోజనాలకు కొమ్ము కాసే పాలకవర్గాలు దీనిని భారత స్త్రీలందరూ గర్వించదగ్గ విషయంగా ప్రచారం చేశాయి.

ఇప్పుడు మన దేశం అంతర్జాతీయ కాస్మొటిక్‌ బ్రాండ్లకు సారవంతమైన మార్కెట్. వారి కాస్మోటిక్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికి ఇక్కడి యువ జనాభా గణాంకాలు సరిగ్గా సరిపోతాయి. ప్రపంచ సౌందర్య సాధనాల మార్కెట్ పరిమాణం 2019లో 380.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2027 నాటికి 463.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని ఒక అంచనా. భారతదేశ సౌందర్య సాధనాల పరిశ్రమ మార్కెట్ విలువ డిసెంబర్ 2020లో 15 బిలియన్ డాలర్లకు మించి ఉంది. 2022 నుంచి ఇక్కడి సౌందర్య రంగం ఏటా 2.8శాతం వృద్ధి చెందుతున్నదని బహుళ జాతి కంపెనీల అంచనా. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, యువ జనాభా కలిగిన ఈ దేశం భవిష్యత్తులో సౌందర్య సాధనాల పరిశ్రమలో అగ్రగామిగా నిలబడుతుందని భావిస్తున్నారు.

దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించడానికీ, గొప్ప చేనేత వారసత్వాన్నీ, అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్నీ, అరుదైన వంటకాల్నీ చాటడానికి ఈ అందాల పోటీలను ఎంచుకున్నాం అని పాలకులు ప్రచారం చేస్తున్నారు. కానీ మరే ఇతర అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు, సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించినా ఇవే ప్రయోజనాలు నెరవేరుతాయన్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం సామ్రాజ్యవాద ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాల్సిన అవసరం లేదు.


మానవాళి చరిత్రలో మేడం మేరీ క్యూరీ, హెలెన్ కెల్లర్, ఫ్లోరెన్స్ నైటింగేల్, సావిత్రిబాయి ఫూలే నుంచి నిన్న మొన్నటి మలాలా, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ దాకా సమాజం వారిని గొప్ప వ్యక్తులుగా గుర్తించింది కేవలం వారు సమాజానికి అందించిన సేవల ఆధారంగా మాత్రమే తప్ప, శారీరక సౌందర్యం ఆధారంగా కాదు! ఏ సమాజమైనా స్త్రీలను వారి శక్తియుక్తులు, వ్యక్తిత్వం, మేధస్సు, మానసిక పరిణతి, సామాజిక సేవ లాంటి గుణగణాల ఆధారంగా గౌరవించుకోవాలే తప్ప శరీర కొలతలు, అంగాంగ ప్రదర్శనల ద్వారా కాదు. అందాల పోటీల వలన మహిళలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నది అబద్ధం. భౌతిక అందానికి ప్రాధాన్యత ఇవ్వడం కొద్దిమంది మహిళలలో ఆధిక్యతా భావాన్ని, మరికొద్దిమందిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతుంది.

m ఆర్.గంగాధర్

అసోసియేట్ ప్రొఫెసర్, స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:23 AM