కృత్రిమ మేధోవిప్లవం.. సన్నద్ధత ముఖ్యం
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:22 AM
రానున్న కాలం కృత్రిమ మేధదే. అది ప్రపంచాన్ని పాలించబోతోంది. తగ్గ సన్నద్ధత చూపని దేశం వెనకబడక తప్పదు. కృత్రిమ మేధను విశ్వమానవ శ్రేయస్సుకి ఉపయోగపడేలా జాగ్రత్త...

రానున్న కాలం కృత్రిమ మేధదే. అది ప్రపంచాన్ని పాలించబోతోంది. తగ్గ సన్నద్ధత చూపని దేశం వెనకబడక తప్పదు. కృత్రిమ మేధను విశ్వమానవ శ్రేయస్సుకి ఉపయోగపడేలా జాగ్రత్త వహించాలి. అందులో భాగంగా ఏభైకి పైగా దేశాలు కలిసి ఒక సదస్సు ఫ్రాన్స్‌లో నిర్వహించాయి. భారత్ కూడా ముఖ్య భూమిక తీసుకుంది. రెండో సమావేశం భారత్‌లో జరపబోతున్నట్లు ప్రకటించింది. ఎందుకీ సన్నద్ధత అంటే కృత్రిమ మేధ సంబంధిత విజ్ఞానం ఏ ఒక్కరి దగ్గరో పోగుపడి వారి స్వార్ధానికే ఉపయోగపడేలా కాకుండా అందరికీ అందడానికి. మేలైన పరిశోధనలు జరిగి, ఆ ఫలాలు ఉమ్మడిగా పొందడానికి.
ఇంతవరకూ కృత్రిమ మేధ పరిశోధనల్లో అమెరికా ముందుంది. చాట్‌జీపీటీ ద్వారా ప్రపంచానికి ఆ విజ్ఞాన ఫలాన్ని పరిచయం చేసినా, పరిశోధన కొనసాగేందుకు వీలైన సమాచారాన్ని, సాంకేతికతను మిగతా దేశాలకు దూరంగా ఉంచింది, లేదా బాగా ఖరీదైన వ్యవహారంగా ఉంచింది. ఎప్పుడైతే చాట్‌జీపీటీకి పోటీగా చైనా అతి చౌకగా డీప్‌సీక్ తెచ్చి, అదే స్థాయిని సాధించడమే కాకుండా, సాంకేతిక సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచిందో, అమెరికా పెత్తనం చేజారింది. ఇప్పుడు భారత్ సహా మిగతా దేశాలన్నీ కోరుతున్నది ఇదే. పరిశోధనకు అవసరమైన విజ్ఞానం అన్ని దేశాలకు లభ్యం కావాలి. పేద దేశమైనా ఆ రంగంలో ప్రగతి సాధించగలగాలి. ప్రయోజనాలు అధికంగా, ఉమ్మడిగా పొందడానికి అవకాశం ఉండాలి తప్ప, ఏ ఒక్కరి చేతిలోనో బందీ కారాదు.
ఇక కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది. నిజమే చాలా వరకూ పోతాయి. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. పవర్ లూమ్ వచ్చాక చరఖాలు మూలపడినట్లు చాలా రంగాల్లో మార్పులు వస్తాయి. వాటికి తగ్గట్టుగా మారాల్సిందే. అదే సమయంలో యంత్రం దానికి ఇచ్చిన ఫీడ్ బట్టే ఫలితాన్ని ఇస్తుంది. తప్పుడుగా ఇస్తే, తప్పుడు ఫలితాలొస్తాయి. తప్పులు లేని వ్యవస్థ, అందుకు తగ్గ ఉమ్మడి నియమాలు, నియంత్రణ ఏర్పరుచుకోవాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. దీనికి అమెరికా, బ్రిటన్ సరే అనలేదు. పెత్తనం పోతుందని బాధేమో! భారత్‌తో సహా మిగతా దేశాలు తత్సంబంధిత పరిశోధనలకు పెద్దపీట వెయ్యడమే కాకుండా, కలిసి ముందుకు సాగాలి.
డి.వి.జి శంకరరావు,
మాజీ ఎంపీ
Also Read:
ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..
బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..
అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..