Share News

RathaSaptami : రథసప్తమి నాడు స్నానంలో జిల్లేడు ఆకులే ఎందుకు..

ABN , Publish Date - Feb 04 , 2025 | 02:51 PM

రథసప్తమి..మాఘ మాసంలో శుక్లపక్షం ప్రారంభమైన ఏడో రోజు వస్తుంది. కనిపించే దైవం సూర్యుడి పుట్టినరోజు. ఈ రోజున జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అది ఎందుకో తెలుసుకుందాం..

RathaSaptami : రథసప్తమి నాడు స్నానంలో జిల్లేడు ఆకులే ఎందుకు..
Why People uses Jilledu Leaves For bath on Rathasapthami day

రథసప్తమి..మాఘ మాసంలో శుక్లపక్షం ప్రారంభమైన ఏడో రోజు వస్తుంది. కనిపించే దైవం సూర్యుడి పుట్టినరోజు. ఈ రోజునే భాస్కరుడు తన రథం పయనించే మార్గాన్ని దక్షిణం నుంచి ఉత్తర దిక్కుకు మార్చుకుంటాడని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈనాటి నుంచే చలికాలం పూర్తయి ఆహ్లాదాన్ని పంచే వసంత రుతువులో అడుగుపెడతాం. ఇదే సమయంలోనే ఖరీఫ్ పంటల సాగు కూడా ప్రారంభమవుతుంది. రథసప్తమికి ఎందుకంత విశిష్టత ఉంది? ఈ రోజున జిల్లేడు ఆకులతో స్నానం ఆచరించాలనే ఆనవాయితీ ఎలా వచ్చింది. తదితర విషయాలు గురించి తెలుసుకుందాం..


సూర్యుడు పుట్టిన రోజు మాఘ మాసం శుక్ల పక్షం ప్రారంభమైన ఏడవ రోజు తర్వాత వస్తుంది. ఈ రోజునే దినకరుడు తన రథాన్ని దిశ మార్చుకుంటాడని ప్రతీతి. సప్తమి రోజున రథం పయనించే మార్గాన్ని మార్చుకుంటాడు కాబట్టే రథ సప్తమి అని పిలుస్తారు. దీనిని మాఘ సప్తమి అని కూడా వ్యవహరిస్తారు. సనాతన ధర్మంలో రథ సప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉదయించే సూర్య కిరణాలకు ప్రత్యేక శక్తి ఉంటుందని శాస్త్రాలు వర్ణిస్తున్నారు. వేకువజామున ఆదిత్యుడికి నదీతీరాన అర్ఘ్యం సమర్పించి సూర్యనమస్కారం చేస్తే పాపాల నుంచి విముక్తి పొంది శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. భూమిపై ఉండే జీవరాశికి ప్రాణాధారంగా నిలిచేందుకు నిత్యం వెలుగులు పంచే సూర్య భగవానుని రథసప్తమి రోజున పూజిస్తే ఆ ఏడాదంతా విజయం చేకూరుతుందని నమ్ముతారు.


రథసప్తమి రోజున జిల్లేడు స్నానం ఎందుకంటే..

క్రమంగా తప్పకుండా ఉదయిస్తూ, అస్తమిస్తూ తన పని కొనసాగించే సూర్యుడు సకల జీవకోటికి మార్గదర్శి. తన తేజస్సుతో రోగాలు నశింపజేసి ప్రతి ప్రాణి ఆయురారోగ్యాలతో జీవించేలా చేసే ప్రత్యక్ష దైవం. రథసప్తమి నాడు ఆదిత్యుడిని ఆరాధిస్తే రోగాలు, శోకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారని పండితులు సూచిస్తుంటారు. రథసప్తమి రోజున జిల్లేడు స్నానం అనే ఆనవాయితీ పుట్టడం వెనక ఓ పురాణ గాథ ఉంది.


తనువు చాలించిన అగ్నిష్వాత్తులు అనే పండితుడు రథసప్తమి రోజున స్వర్గానికి వెళ్లాలని యజ్ఞం చేయగా.. అతడి భక్తికి మెచ్చిన శివకేశవులు స్వర్గం నుంచి దేవ విమానాన్ని పంపిస్తారు. తనవైపు దేవవిమానం రావటం చూసిన ఆనందోత్సాహంలో అగ్నిష్వాత్తులు చివరి ఘట్టాన్ని హడావుడిగా ముగించేందుకు ప్రయత్నిస్తాడు. యజ్ఞద్రవ్యమైన ఆవునేతిని అగ్నిగుండంలో కంగారుగా వేసేస్తాడు. అది హఠాత్తుగా సమీపంలో ఉన్న మేక పిల్లపై పడి దాని చర్మం ఊడుతుంది. ఆ చర్మం వెళ్లి ఒక జిల్లేడు చెట్టుపై పడటంతో మేకకే స్వర్గప్రాప్తి దక్కుతుందని ఆకాశవాణి బదులిస్తుంది. దేవ విమానంలో మేకని చూడగానే పండితుడికి దుఃఖం ముంచుకొస్తుంది. ఇది చూసి దేవతలు అగ్నిష్వాత్తుడికి ఒక పరిష్కార మార్గం సూచిస్తారు. నీ యజ్ఞఫలం మేకకు, జిల్లేడు చెట్టుకు దక్కింది. అది నీకూ దక్కాలంటే జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై ఉంచుకుని స్నానం చేయాలని చెప్తారు. ఆనాటి నుంచే ఈ ఆనవాయితీ పుట్టిందనేది పురాణ గాథ.


పుణ్యస్నానం ఇలా చేయాలి..

రథసప్తమి నాడు వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు తీసుకోవాలి. తలమీద ఒకటి, రెండు భుజాలు, మోకాళ్లపైనా, పాదాలపైనా ఒక్కొక్క ఆకు పెట్టుకుని తలారా స్నానం చేయాలి. ఈ సమయంలో ఈ కింది శ్లోకాన్ని పఠించాలి.

'సప్త సప్త మహా సప్త

సప్త ద్వీప వసుంధర

సప్త అర్క పర్ణ మదయా

సప్తమ్యం స్నానమాచరేత్||' ఇలా చేస్తే ఆ ఏడాదిలో ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుందని భక్తుల విశ్వాసం.


రథ సప్తమి శుభ సమయం తెలుసుకోండి..

వేద క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్ష సప్తమి తిథి 2025 ఫిబ్రవరి 4న ఉదయం 04:37 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 05 రాత్రి 02:30 గంటలకు పూర్తవుతుంది.

Updated Date - Feb 04 , 2025 | 02:51 PM