Share News

అష్టాదశ శక్తిపీఠాలు ఒకేచోట...

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:45 PM

ఆధ్యాత్మిక యాత్రలు అనేకరకాలుగా ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది యాత్రలతో పాటు ప్రత్యేకంగా... కొందరు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే... మరికొందరు శక్తి పీఠాలను చూడాలనుకుంటారు.

అష్టాదశ శక్తిపీఠాలు ఒకేచోట...

ఆధ్యాత్మిక యాత్రలు అనేకరకాలుగా ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది యాత్రలతో పాటు ప్రత్యేకంగా... కొందరు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే... మరికొందరు శక్తి పీఠాలను చూడాలనుకుంటారు. అయితే చాలామంది ఖర్చు, సమయం విషయాల్లో వెనకడుగు వేస్తుంటారు. ఇటీవల భక్తులను కొన్నిచోట్ల ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయ సముదాయాలు ఆకర్షిస్తున్నాయి.

అలాంటి ఓ విశిష్ట దివ్యధామమే ...

‘అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం’. శ్రీలంక నుంచి కశ్మీర్‌ వరకు విస్తరించి ఉన్న శక్తి పీఠాలను దర్శించుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే అనుకున్నంత సులువు కాదు... ఆయా పుణ్యక్షేత్రాల దర్శనం. కానీ దేశవ్యాప్తంగా, దేశం వెలుపల ఉన్న శక్తి పీఠాలన్నీ ఒకేదగ్గర వెలిస్తే... వాటిని చూడాలనుకునే సామాన్య భక్తులకు ఒక రకంగా అదృష్టమే. ఆ తల్లి అనుగ్రహం అందరికీ దక్కాలనే గొప్ప సంకల్పంతో వెలిసిన దివ్యధామమే ‘అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం’.


book11.2.jpg

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక ‘ఆనందనిలయం’ ఆవరణలో ఏర్పాటైన ఆధ్యాత్మిక కేంద్రమిది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లే రాజీవ్‌ రహదారి మార్గంలో... సిద్దిపేటకు సమీపంలో ఈ దివ్వధామం కొలువైంది. ‘ప్రపంచంలోని దేవాలయాలు, జీవనదులన్నింటిని కలిసి దర్శించుకున్న పుణ్య ఫలితం ఈ దేవాలయ దర్శనంతో కలుగుతుంద’ని పుష్పగిరి పీఠాధిశ్వరులు విద్యా శంకర భారతి స్వామి సందేశమిచ్చారు.


అచ్చంగా వాటిలాగే ...

మన దేశ శిఖరాగ్రన ఉన్న కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో కొలువైన శక్తిపీఠం సరస్వతీదేవి నుంచి... శ్రీలంక లోని ట్రింకోమలిలో ఉన్న శాంకరీదేవి దాకా... అష్టాదశ శక్తిపీఠాలు ఈ దేవాలయ ప్రాంగణంలో అద్భుతంగా కొలువు దీరాయి. కంచి కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (పాండురా, పశ్చిమ బెంగాల్‌), చాముండేశ్వరిదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబాదేవి (అలంపురం, తెలంగాణ), భ్రమరాం బికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌), మహాలక్ష్మిదేవి (కొల్హాపూర్‌, మహారాష్ట్ర), ఏకవీరికాదేవి (మహెర్‌, మహారాష్ట్ర), మహంకాళిదేవి (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్‌), పురూహుతికాదేవి (పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌), గిరిజాదేవి (వైతరణి, .ఒరిస్సా), మాణిక్యాంబ దేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్‌), కామ రూపిణిదేవి (కామాఖ్య, అసోమ్‌), మాధవేశ్వరీ దేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్‌), వైష్ణవీదేవి (కాలధర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌), మాంగల్య గౌరీదేవి (గయ, బీహార్‌), విశాలాక్షి దేవి (కాశి, ఉత్తరప్రదేశ్‌)... ఇలా అష్టాదశ శక్తిపీఠాలన్నీ ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు.


book11.3.jpg

రూ. ఆరుకోట్ల వ్యయంతో...

రెండేళ్ల క్రితం... 2023 నవంబర్‌ 25న శక్తిపీఠాల ప్రతిష్ట మహోత్సవాలు జరిగాయి. అప్పటి నుంచి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే... ఆర్థిక భారం, శరీరం సహకరించక పోవడం లాంటి వారికి ఈ దేవాలయం దర్శన భాగ్యం ఎనలేని సంతృప్తిని ఇస్తోంది. సిద్దిపేట ప్రాంత వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అష్టాదశ శక్తిపీఠ అమ్మ వార్లను దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులతో ఈ ప్రాంగణం కళకళలాడుతోంది. సుమారు ఆరు కోట్ల వ్యయంతో...అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తూ ఆలయ నిర్మాణాన్ని వాస్తు కళా నైపుణ్యంతో పూర్తి చేశారు.


అష్టాదశ శక్తిపీఠాలతో పాటు రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను కూడా నిర్మించారు. అష్టాదశ శక్తి సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత అమ్మవారి అనంతరూపాల్లో అష్టాదశ శక్తి స్వరూపాలు అత్యంత శక్తి వంత మైనవి. ఒక్కో రూపం ఒక్కోరకంగా ప్రభావ వంతమైనది. దేవాలయంలో ప్రతీ పౌర్ణమికి చండీ హోమము ప్రత్యేక ఉత్సవాలు, ప్రతీ నెల అభిషేకాలు జరుగుతాయి. పండగ పర్వదినాల రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం దర్శన వేళలు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.00 వరకు ఉంటుంది.


‘‘ఇలాంటి శక్తిపీఠం దేశంలో మరెక్కడా లేదు. ఆనందనిలయం ఆవరణలో ప్రశాంత వాతా వరణంలో నిర్మించాం’’ అని ట్రస్ట్‌ ప్రతినిధి అయిత నాగరాజు తెలిపారు. ఆనంద నిలయా నికి చైర్మన్‌గా రిటైర్ట్‌ ఐఎఎస్‌ అధికారి కె.వి.రమణాచారి వ్యవహరిస్తున్నారు. ‘‘ఆ తల్లి అనుగ్రహం అందరికీ అందడం కోసం అష్టాదశ శక్తి పీఠం ఏర్పాటైంది. అమ్మవారి భక్తులకు ఇదొక గొప్ప ఆఽధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందనే విశ్వాసం ఉంది’’ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలను దర్శించుకోవాలను కునే భక్తులకు... ఒకేచోట అంత మంది అమ్మవార్లను చూసే భాగ్యం కలగడం అదృష్టమే కదా.

- సి.హెచ్‌. రవి, కొండపాక


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 12:45 PM