Share News

Devotional: ఛలో...‘చార్‌ధామ్‌’.. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్...

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:57 PM

మన జీవిత పుస్తకంలో ‘చార్‌ధామ్‌’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్‌ధామ్‌’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...

Devotional: ఛలో...‘చార్‌ధామ్‌’.. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్...

‘చార్‌ధామ్‌’ అంటే నాలుగు క్షేత్రాలని అర్థం. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న 4 పుణ్య క్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను దర్శించుకునేందుకు చేసే యాత్రనే ‘చార్‌ధామ్‌’ యాత్ర అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించాలని ప్రతీ హిందువు కలలు కంటారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మొదలై... అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచులో కప్పబడి ఉంటాయి. అందుకే చలికాలం వాటిని దర్శించడం కుదరదు. కావున ఆరు నెలలపాటు దేవాలయాలు మూసేసి ఉంచుతారు.


ఎక్కడ నుంచి ఎలా?

యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్‌, బద్రీనాథ్‌ దర్శనంతో ముగుస్తుంది. అందరూ ఇలానే చేయాలని లేదు. కొందరు కొన్నింటిని మాత్రమే దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. విమానంలో వెళ్లాలనుకునేవారు డెహ్రాడూన్‌, రైలులో రిషికేశ్‌ వరకు వెళ్లవచ్చు లేదా ఢిల్లీ నుంచి 206 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి హరిద్వార్‌ చేరుకోవాలి. అక్కడ రాత్రి బస చేసి గంగా హారతి, మానసా దేవి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే హరిద్వార్‌ నుంచి బారాకోట్‌ మీదుగా యమునోత్రికి వెళ్లే బస్సులు ఉంటాయి.


book10.2.jpg

200 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి, లేదా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికేష్‌ చేరుకొని... అక్కడి నుంచి ఉత్తరకాశి మీదుగా 235 కిలో మీటర్లు ప్రయాణించి యమునోత్రి చేరుకోవచ్చు. అక్కడ ఒక రోజు గడిపి మరుసటి రోజు ఉదయాన్నే యమునోత్రి నుంచి 124 కి.మీ. దూరంలో ఉన్న ఉత్తరకాశి చేరుకొని, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి ధామ్‌ని చేరుకోవాలి. అక్కడ ఒకరోజు గడిపిన తర్వాత తిరిగి ఉత్తర కాశీ చేరుకోవాలి. ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీ మీదుగా 225 కి.మీ. ప్రయాణించి సోన్‌ ప్రయాగ్‌ చేరుకొని, అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ దేవాలయానికి హెలికాప్టర్‌ లేదా నడుచుకుంటూ లేదా డోలీలో వెళ్ళాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్‌లో దర్శనం అనంతరం తిరిగి సోంప్రయాగ్‌ నుంచి 203 కి.మీ. ప్రయాణించి సరాసరి బద్రీనాథ్‌ దేవాలయానికి చేరుకోవచ్చు. చివరిగా బద్రీనాథ్‌ నుంచి రుషికేశ్‌ అక్కడి నుండి ఢిల్లీ తిరుగు ప్రయాణం ఉంటుంది.


రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి!

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలంటే ముందుగా ఉత్తరాఖండ్‌ టూరిజం వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఎంతమంది, ఎన్ని రోజులు ఆయా క్షేత్రాల వద్ద ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకొని స్లాట్లు బుక్‌ చేసుకోవాలి. పేరు, మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, ఆధార్‌ నెంబర్‌, అడ్రస్‌... అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు బంధువులు లేదా స్నేహితుల వివరాలు ఐడీ ప్రూఫ్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా యాత్రికుల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ప్రవేశపెట్టింది. సందర్శనకు వచ్చే భక్తులకు ఫొటోమెట్రిక్‌ లేదా బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి.


book10.3.jpg

పర్యటన ప్యాకేజీలిలా...

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన అనేక ట్రావెల్‌ ఏజెన్సీలు చార్‌ధామ్‌ యాత్ర కోసం రవాణా, హోటల్‌ సేవలందిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ టూరిజం శాఖ వివిధ రూట్లలో ప్యాకేజీలను అంది స్తోంది. ఉత్తరాఖండ్‌ టూరిజం వెబ్‌సైట్‌లో అనువైన ప్యాకేజీలను బుక్‌ చేసుకోవచ్చు. హెలికాప్టర్లో వెళ్లే ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముందు చార్‌ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత... ఈ ప్యాకేజీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వెంట వెళ్లే రెండేళ్ల లోపు పిల్లలకు హెలికాప్టర్‌ ప్రయాణం ఉచితం. కాకపోతే వారికి సీటు ఉండదు, హెలికాప్టర్లో వెళ్లే ప్రయాణికుల బరువును కొలుస్తారు. ఒక వ్యక్తి బరువు బిడ్డతో కలిపి 80 కిలోల కన్నా అదనంగా ఉంటే అదనంగా కిలోకి 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


ఆరోగ్య జాగ్రత్తలు అవసరం

ఈ యాత్ర చేయాలని బలమైన కోరిక, డబ్బు ఉన్నా... ఆరోగ్యం సహకరించకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కష్టం. ఎత్తైన కొండలు మధ్య సుదీర్ఘ నడక మార్గం ఉంటుంది. తీవ్రమైన మంచు, చలి, వర్షంతో పాటు ఆక్సిజన్‌ అందడం కూడా గగనమే. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే గాని యాత్రకు అనుమతించదు ప్రభుత్వం. ‘చార్‌ ధామ్‌’ క్షేత్రాలు సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులు ఉన్న కారణంగా వాతావరణ పరిస్థితిలు భిన్నంగా ఉంటాయి. అనుహ్యంగా వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి ముందుగానే అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. యాత్రకు ముందు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందులను దగ్గర ఉంచుకోవాలి. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ను యాత్రికులు దగ్గర ఉంచుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సూచిస్తుంది. ఒక్కోసారి కొండచరియలు విరిగి పడటం లేదా ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ఒకటి రెండు రోజులు మార్గం మధ్యలోనే నిలిచిపోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు తినేందుకు డ్రైఫ్రూట్స్‌, ఎనర్జీ డ్రింకులు వెంట తీసుకువెళ్లాలి.


book10.4.jpg

గంగోత్రి

గంగోత్రి గంగానది జన్మస్థలం ఉత్తర కాశీ. జిల్లాలోని భాగీరథీ నదీతీరంలో ఉన్న పుణ్యక్షేత్రమే గంగోత్రి. ఇది హిమాలయ పర్వతశ్రేణుల్లో 4042 మీటర్ల ఎత్తులో ఉంది. గంగను భూమికి తీసుకురావడానికి భాగీరథుడు చేసిన ప్రయత్నం కారణంగా ఇక్కడ గంగానది భాగీరఽథి పేరుతో పిలుస్తారు. 18వ శతాబ్దం లేదా 19 శతాబ్దపు ఆరంభంలో గంగాధర్‌ ఆలయం గుర్కా జనరల్‌ అమర్‌ సింగ్‌ దాపాచే నిర్మించినట్లు చెబుతారు, ఆలయంలో ఉన్న గంగా దేవిని దీపావళి నుంచి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ... మిగిలిన సమయంలో ఆర్సిలు సమీపంలోని ముఖ్భలో ఉంచుతారు. ఇక్కడ సాంప్రదాయ పూజలు సెమ్వాల్‌ కుటుంబానికి చెందిన పూజారి నిర్వహిస్తారు. గంగా నది విగ్రహంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరు కుంటారు. ఏదైనా వాహనం ద్వారా సరాసరి ఆలయం వద్దకు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్‌ 40 కిలోమీటర్లు ఎగువున మంచు పర్వతాలలో ఉంటుంది. కొందరు సాహస యాత్రీకులు గౌముక్‌ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.


యమునోత్రి

భారతదేశంలో రెండో అత్యంత పవిత్రమైన నది యమున. ఈ నది యమునోత్రి వద్ద ఉద్భవించింది... అందువల్ల యమునోత్రి ఆలయం చార్‌ధామ్‌ యాత్ర ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. పశ్చిమ గర్వాల్‌ హిమాలయాల్లో దాదాపు 3291 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని 1839లో తెహ్రీ రాజు నరేష్‌ సుదర్శన్‌ షా నిర్మించారు. తర్వాత కాలంలో జైపూర్‌ మహారాణి గులారియా దేవి ఆలయాన్ని పున:నిర్మించారు. జానకి చెట్టి నుంచి సుమారు 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేసి ఆలయానికి చేరుకోవాలి. ఆలయంలో యమునా దేవిని దర్శించుకుని, సహజ వేడి నీటి కొలనులైన సూర్యకుండ్‌, గౌరీకుండ్‌లలో స్నానం చేయడం వల్ల అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం.


కేదార్‌నాథ్‌

కేదార్‌నాథ్‌ శైవ క్షేత్రం ఆలయంలో శివుడికి పూజలు చేస్తారు. మందాకిని నది సమీపంలో గర్హాల్‌ హిమాలయ శ్రేణుల్లో ఈ ఆలయం ఉంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్‌ (అక్షయ తృతీయ) నుంచి నవంబర్‌ (కార్తీక పూర్ణిమ శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయం నుంచి దేవత విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి, ఉక్రిమత్‌ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీ కుండ్‌ నుంచి 22 కిలోమీటర్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకోవచ్చు. లేదంటే డోలీ సేవ అందుబాటులో ఉంటుంది. ఇటీవల ఆదిశంకరాచార్యుల సమాధి వద్ద ఆయన స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


బద్రీనాథ్‌

బద్రీనాథ్‌ లేదా బదరీ నారాయణ ఆలయం చమోళి జిల్లాలోని బద్రీనాథ్‌ పట్టణంలో ఉంది. హిమాలయ ప్రాంతంలో క్లిష్ట వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ ఆలయాన్ని ఏడాదిలో 6 నెలలు ఏప్రిల్‌ చివరి నుంచి నవంబర్‌ ప్రారంభం వరకు తెరిచి ఉంచుతారు. అలకనంద నది ఒడ్డున గర్హాల్‌ కొండ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. భారతదేశంలో అత్యధికంగా దర్శించే తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. తొమ్మిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్య బద్రీనాథ్‌ని తీర్థయాత్ర స్థలంగా స్థాపించాడు. ఆలయంలో నారద కుండ్‌, సూర్య కుండ్‌ అనే సహజ వేడి నీటి కొలనులున్నాయి. ఆలయం ఎనిమిదవ శతాబ్దం వరకు బౌద్ధ మందిరంగా ఉండేది. తర్వాత అభిశంకరాచార్యులు ఈ మందిరాన్ని పునరుద్ధరించి హిందూ దేవాలయంగా మార్చారు. వాహనాల్లో ఈ ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు.


ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు...

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకునేటప్పుడే ఎనిమిది రోజులకు తప్పనిసరిగా స్లాట్స్‌ బుక్స్‌ చేసుకోవాలి. రిషికేశ్‌, హరిద్వార్లో రెండు రోజులు గడపాల్సి ఉంటుంది. ఇంకా ఇంటి నుంచి ఢిల్లీకి రాను పోను 4 రోజులు వేసుకున్నా హడావుడి లేకుండా 15 రోజులు కేటాయిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది


భోజనం-వసతి - బడ్జెట్‌

రిషికేశ్‌ చేరుకున్న తర్వాత స్థానిక ఆహార అలవాట్ల ప్రకారం ఆహారం దొరుకుతుంది. చపాతీ, పరోటా, మ్యాగీ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ప్రతీరోజు ఆహారంలో పండ్లు, డ్రైఫ్రూట్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవడం వలన ఆహార సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఒకరిద్దరూ యాత్రకు వెళ్ళినట్లయితే ఆయా ప్రాంతాలలో గుడారాలలో బసచేయడం మంచిది. ఒక్కరికి 300 నుంచి 500 రూపాయలకు దొరుకుతాయి. పదిమంది కన్నా ఎక్కువమంది గ్రూపుగా వెళ్ళినట్లయితే ఢిల్లీ నుంచి మినీ వ్యాన్‌ పది రోజులు పాటు బుక్‌ చేసుకొని వెళ్లడం వల్ల తక్కువ ఖర్చుకు యాత్ర చేసి రావచ్చు. 15 రోజులు యాత్ర కాస్త సౌకర్యవంతంగా చేయడానికి... ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. విమానం, హెలికాప్టర్లో వెళ్లే వారికి ట్రావెల్‌ ఏజెన్సీలు నిర్దేశించిన ధరల ప్రకారం అధిక మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది.


ఈ యాత్రలో అనేక రకాల క్లిష్ట వాతావరణ పరిస్థితులు దాటుకుంటూ వెళుతున్న కొద్దీ... శారీరక దృఢత్వం, మానసిక విశ్వాసం పెరుగుతుంది. అనేక ప్రాంతాల మీదుగా వెళ్లడం వలన అక్కడ స్థానిక సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహార అలవాట్లు తెలుసుకోవచ్చు. గంగా యమునా అలకనంద సరస్వతీ నదులను... వాటి ఉప నదులను ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ఇంతకంటే జీవితంలో కావాల్సింది ఇంకేముంటుంది?

- వెంకట మహేష్‌ వెల్లంకి

98489 19121


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 01:11 PM