Share News

Hyderabad: మధ్య వయసు మహిళలే టార్గెట్‌..

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:40 PM

మాటలు కలిపి, డబ్బులు చూపి మభ్యపెట్టి తర్వాత మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి, బంగారు నగలను కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను భువనగిరి పోలీసులు(Bhuvanagiri Police) అరెస్ట్‌ చేశారు.

Hyderabad: మధ్య వయసు మహిళలే టార్గెట్‌..

- మాటలు కలిపి, మభ్యపెట్టి.. మత్తుమందు కలిపి నీళ్లు ఇచ్చి..

- ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

- ఏడు కేసుల్లో కాజేసిన రూ.17లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: మాటలు కలిపి, డబ్బులు చూపి మభ్యపెట్టి తర్వాత మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి, బంగారు నగలను కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను భువనగిరి పోలీసులు(Bhuvanagiri Police) అరెస్ట్‌ చేశారు. దృష్టి మళ్లించి మోసాలు చేస్తున్న ముఠాలోని కీలక సూత్రధారి గుజరాతీ కిషన్‌(24) నగరానకి వచ్చి తెలుగు నేర్చుకున్నాడని, బాలుడితోపాటు ఢిల్లీ(Delhi)కి చెందిన ముఠా సభ్యులతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గద్దర్‌ వ్యక్తి కాదు.. సమూహ శక్తి.. ఆయన్ను విమర్శిస్తే సహించేది లేదు


నేరేడ్‌మెట్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితులు కూడా అత్యాశకు పోవడంతో మోసగాళ్ల పని సులభం అవుతుందని, వీరిని ఏమార్చేందుకు ముఠా సభ్యులు మత్తుమందులు వినియోగిస్తున్నారని తెలిపారు. ముఠాలోని మోసగాళ్లపై ఢిల్లీలో ఇదే తరహా మోసం కేసులున్నాయని, వీరు మధ్య వయసులో ఉన్న మహిళలనే టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన గుజరాతి కిషన్‌(24) కొంతకాలం క్రితం నగరానికి వచ్చి, ప్లాస్టిక్‌ పువ్వుల విక్రయం చేస్తున్నాడు.


ఢిల్లీలో పలు నేరాలు చేసిన ఇతడు దృష్టి మళ్లించి చోరీలు చేసేందుకు తెలుగు నేర్చుకున్నాడు. మరో బాలుడు, ఢిల్లీ బేగంపూర్‌కు చెందిన ప్లాస్టిక్‌ పూల వ్యాపారులు రామ్‌లాల్‌(42) శ్యాంలాల్‌(30), కోలి(50), గుల్షన్‌ అలియాస్‌ గుల్లు(26), దీపక్‌(28)లతో ముఠాను తయారు చేశాడు. రూ. 500నోట్లు పైన రెండు కింద రెండు పెట్టి మధ్యలో కాగితాలతో నోట్ల కట్టలను తయారు చేస్తారు. బాలుడి వద్ద నోట్లకట్టలు చూపుతూ మోసాలు చేస్తారు. ఈ ముఠా సభ్యులు నగరంలో అఫ్జల్‌గంజ్‌, దుండిగల్‌, ఎస్‌ఆర్‌నగర్‌, జీడిమెట్ల, హుస్సేనిఆలం, భువనగిరి పోలీస్టేషన్ల పరిధిలో మోసాలు చేసి, మహిళల బంగారు పుస్తెల తాళ్లు కాజేశారు.


ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్..

ముఠా సభ్యులు నగరంలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మధ్య వయసు మహిళను టార్గెట్‌ చేస్తారు. వారి వద్దకు మైనర్‌ బాలుడిని పంపుతారు. చేతిలో నోట్ల కట్టలతో ఉన్న కవర్‌ను పట్టుకున్న బాలుడు టార్గెట్‌ చేసిన మహిళ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న కవర్‌ను కొరియర్‌ ద్వారా పంపాలని అడ్రస్‌ అడుగుతాడు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ముఠా సభ్యులు మహిళతో మాట కలుపుతారు. బాలుడి వద్ద ఉన్న కవర్‌ను కొద్దిగా చించిన ముఠాలోని సభ్యుడు అందులో డబ్బు ఉన్నట్లు చూపుతాడు. మాటలు కలిపి నోట్ల కవర్‌ను ఆమె వద్ద ఉంచుతారు. నమ్మకం కలిగేందుకు డబ్బులకు బదులుగా పుస్తెలతాడు ఇవ్వాలని చెబుతారు. ఈ సమయంలో మాటల మధ్యలో మహిళకు మత్తు ముందు కలిపిన నీళ్లను మహిళతో తాగిస్తారు. ఆమె మత్తులోకి జారుకున్న వెంటనే నగలు, నగదుతో ఉడాయిస్తారు.


పట్టించిన సీసీ ఫుటేజ్‌..

నగరంలో వరుసగా దృష్టి మళ్లింపు మోసాల కేసులు వెలుగులోకి రావడంతో రాచకొండ పోలీసులు(Rachakonda Police) రంగంలోకి దిగారు. ముఠా సభ్యులు జవహర్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ మోసాలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించిన పోలీసులు ముఠా సభ్యులు జవహర్‌నగర్‌ నుంచి రాకపోకలు చేస్తున్నట్లు గుర్తించారు. జవహర్‌నగర్‌లో ముఠా సభ్యులు ఉన్న ఇంటిపై దాడిచేసిన పోలీసులు ప్రధాన నిందితుడు గుజరాతి కిషన్‌తోపాటు రామ్‌లాల్‌, శ్యాంలాల్‌, కోలితోపాటు బాలుడిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఏడు కేసుల్లో కాజేసిన రూ.17లక్షల విలువైన 7బంగారు పుస్తెల తాళ్లతోపాటు మత్తును కలిగించే ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న భువనగిరి అధికారులను, సిబ్బందిని సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..

ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 30 , 2025 | 01:40 PM