Hyderabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 23 , 2025 | 07:58 AM
ఒక చిన్నగొడవ ఏకంగా ప్రాణాలు తీసే వరకు వచ్చింది. వారంరోజుల క్రితం జరిగిన గొడవను మనసులో పెట్టుకొని వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత జరిగిన గొడవను మనసులోపెట్టుకొని మద్యంమత్తులో బండరాయితో మోది హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- మద్యం మత్తులో హత్య
- కేసును ఛేదించిన మహంకాళి పోలీసులు
- గొడవ పడినందుకే బండరాయితో దాడి
- ఆ తర్వాత ఆలయంలో చోరీ
- పలు చోరీల కేసుల్లో కూడా నిందితుడిగా గుర్తింపు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్యచేసిన కేసును మహంకాళి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ పరశురామ్, అదనపు ఇన్‌స్పెక్టర్ కేసరిప్రసాద్‌లతో కలిసి ఏసీపీ సైదయ్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మారేడుపల్లి మహాత్మాగాంధీనగర్‌లో నివసించే శివ (31) టైల్స్ వర్కర్‌గా పనిచేసేవాడు.

2018లో వివాహం చేసుకున్న ఇతనికి ఇద్దరు పిల్లలు. గంజాయికి అలవాటు పడ్డ ఇతను ఆదాయం సరిపోక చోరీల బాటపట్టాడు. మద్యంతాగి తల్లితోపాటు భార్యను తీవ్రంగా కొట్టి హింసించేవాడు. వేధింపులను భరించలేక అతని భార్య మూడు నెలల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా నిందితుడు ఈనెల 17న రాత్రి సికింద్రాబాద్ జానీ వైన్స్ వద్ద మద్యం తాగుతుండగా ఓ వ్యక్తితో గొడవ జరిగింది. కక్ష పెంచుకున్న శివ తనతో గొడవపడిన వ్యక్తి పాత మంజు థియేటర్ ఎదురుగా ఉన్న ఓ ఫర్నిచర్ షాపు వద్ద నిద్రిస్తుండగా కర్ర, బండరాయితో తలపై మోది హత్య చేసి ఉడాయించాడు.

మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితుడి శివ అని గుర్తించారు. విచారించగా తాగిన మత్తులో హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య అనంతరం మల్కాజిగిరి వెళ్లి అక్కడి ఆలయంలో ఇత్తడి సింహాలను దొంగిలించినట్లు తెలిపాడు. గతంలో తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలను తానే చేసినట్లు అంగీకరించాడని, చోరీకి గురైన రెండు ఇత్తడి సింహాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. అయితే, మృతుడి వివరాలు తెలియరాలేదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News