Hyderabad: తాళం వేసి ఉన్న ఇంట్లో రక్తపు మరకలు..
ABN , Publish Date - Jun 20 , 2025 | 09:53 AM
ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గురువారం స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
- దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం
హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్(IS Sadan Police Station) పరిధిలోని ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గురువారం స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఇంట్లో మొత్తం రక్తపు మరకలు కనిపించాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మరకలు పోలీసులను సైతం ఉలిక్కిపాటుకు గురిచేశాయి. క్లూస్‌టీం, ఫోరెనిక్స్ టీంలను రప్పించి ఆధారాలను సేకరించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో ఎవరు ఉంటున్నారన్న వివరాలను స్థానికుల నుంచి సేకరించారు. ఆ ఇంటికి ఎవరెవరు వచ్చి పో యే వారు అనే వివరాలు తెలుసుకోవడానికి పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు.
కుటుంబ సభ్యుల గొడవేనా..
పోలీసుల దర్యాప్తులో బీహార్‌కు చెందిన ధర్మేందర్‌కుమార్(33)తో పా టు మొత్తం ఆ ఇంట్లో ఐదుగురు వ్యక్తులు ఉంటున్నట్లు సమాచారం. ధర్మేందర్‌కుమార్ తరుచూ మద్యం సేవించి వచ్చేవాడు. అదేక్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి మిగితా వారితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో కిటికీని చేతితో పగులగొట్టి చేతిని కోసుకున్నాడు. దీంతో ఇంటి నిండా రక్తపు మరకలు ఏర్పడ్డాయి. గొడవ అనంత రం మిగిలిన నలుగురు బయటికి వెళ్లి పోగా ధర్మేందర్‌కుమార్ మాత్రం మద్యం మత్తులో ఇంట్లోనే పడుకున్నాడు.
ఉదయం మత్తు వదిలిన తర్వా త ఇంటికి తాళం వేసి తాను కూడా బయటికి వెళ్లిపోయాడు. ఇంట్లో నుం చి రక్తం మరకల దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసు లు అక్కడికి చేరుకున్నారు. ధర్మేందర్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇంట్లో రక్తం మరకలు పెద్దగా ఉండడం ధర్మేందర్ చేతికి గాయం కావడం ద్వారా మరకలు ఏర్పడ్డాయా, లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంట్లో ఉండే మిగితా వారి వివరాల గురించి కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News