BJP councillor's husband controversy: అత్యాచారం కేసులో బాధితురాలికి బెదిరింపులు.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:35 PM
బీజేపీ కౌన్సిలర్ భర్త తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడిపై స్థానిక మహిళ అత్యాచార ఆరోపణలు చేయడం కలకలానికి దారి తీసింది. సత్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ కౌన్సిలర్ భర్త తనపై అఘాయిత్యానికి ఒడిగట్టి, వీడియోలో రికార్డు కూడా చేశాడని మహిళ ఆరోపించింది (Madhya Pradesh Rape Case).
రామ్‌పూర్ బాఘేలన్ నగర్ పరిషత్‌లో బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్న మహిళ భర్త అశోక్ సింగ్ బాధిత మహిళను బెదిరిస్తున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అతడి బెదిరింపులను రికార్డు చేసిన నెట్టింట పెడతానని బాధితురాలు హెచ్చరించగా అశోక్ సింగ్ లక్ష్య పెట్టలేదు. ‘నాకేమీ అవుతుంది? ఏమీ కాదు. ఎవరికైనా ఫిర్యాదు చేసుకో. నాకేమీ జరగదు’ అంటూ బాధితురాలిపై బెదిరింపులకు దిగినట్టు వీడియోలో రికార్డయ్యింది. ఆ సమయంలో మహిళ రోదిస్తున్న వైనం కూడా వీడియోలో వినిపించింది.
సోమవారం బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆరు నెలల క్రితం అశోక్ సింగ్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భద్రత, కుటుంబ భద్రత కోసం ఇంతకాలం మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపింది. ఘటన రోజు అశోక్ సింగ్ తన ఇంట్లోకి వచ్చి కత్తితో బెదిరించి దారుణానికి ఒడిగట్టాడని చెప్పింది. వీడియోలో రికార్డు కూడా చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని అంతమొందిస్తానని బెదిరించాడని కూడా పేర్కొంది. డిసెంబర్ 20న మరోసారి తనను వేధించాడని పేర్కొంది. చెప్పినట్టు చేయకపోతే తన వీడియోను బయట పెడతానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అశోక్ సింగ్‌కు నేర చరిత్ర ఉందని, గతంలో ఒకసారి జిల్లా నుంచి బహిష్కరణకు కూడా గురయ్యాడని తెలిపింది. నిత్యం తన షాపునకు వచ్చి బెదిరింపులకు దిగుతాడని చెప్పింది. భీతావహ వాతావరణం సృష్టిస్తున్నాడని తెలిపింది. ఐదు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కూడా పేర్కొంది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..
పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ