AP News: అమ్మా.. ఇక సెలవ్..హరితా క్షమించు... నా టైం ఇక్కడితో అయిపోయింది
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:30 AM
స్థానిక గుత్తి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి రవికుమార్ (40) అప్పుల బాధలు భరించలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులోనే ఉరేసుకుని, ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రూ.35 వేలకు రూ.1.20 లక్షలు కట్టా.. ఇక కట్టలేను..
సెంట్రల్ బ్యాంకు ఉద్యోగి ఆవేదన
అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య
బ్యాంకులోనే ఉరి
అప్పుల వేధింపులు అంటూ సూసైడ్ నోట్
‘అమ్మా.. ఇక సెలవ్. హరితా నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభం లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపం అయ్యాయి. నా టైం ఇక్కడితో అయిపోయింది. రూ.50 వేలు అప్పు తీసుకుంటే... రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చారు. ప్రతినెలా రూ.15,000 ఇచ్చాను. వడ్డీ కడుతూ ఇప్పటి వరకూ రూ. 1.20 లక్షలు కట్టాను. ఇంక నా వల్ల కాదు.’ ఇవీ అప్పుల బాధలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్న బ్యాంకు ఉద్యోగి రాసుకున్న ఆఖరి మాటలు. రూ.35 వేలు తీసుకుంటే... ఇప్పటి వరకూ రూ.1.20 లక్షలు కట్టాడంటే.. వడ్డీ వ్యాపారులు ఏ స్థాయిలో వసూళ్లు చేశారో చెప్పనక్కర్లేదు.
అనంతపురం: స్థానిక గుత్తి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి రవికుమార్ (40) అప్పుల బాధలు భరించలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులోనే ఉరేసుకుని, ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలులోని సీ క్యాంపు ప్రాంతానికి చెందిన సంకుల రవికుమార్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థానిక వినాయకనగర్‌లో స్థిరపడ్డాడు. భార్య హరిత, పిల్లలు సూర్యతేజ(13), దీక్షిత(11), వీక్షిత (10) ఉన్నారు. 12 ఏళ్లుగా బ్యాంకులో సబ్ స్టాఫ్(దస్తరీ)గా పనిచేస్తుండేవాడు.

బుధవారం ఉదయం 9.45 గంటలపుడు బ్యాంకుకు వెళ్లాడు. కాసేపు అక్కడి ఉద్యోగులతో మాట్లాడాడు. అంతకుమందు భార్యకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పాడు. తర్వాత 9.50గంటలకు బ్యాంకులోని వాష్ రూమ్‌కు వెళ్లి కిటికీకి కొత్తగా తెచ్చుకున్న నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నాడు. వాష్‌రూమ్ తలుపులు తీయకపోవడంతో గుర్తించిన బ్యాంకు సిబ్బంది, ఇంటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్, అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో కార్పెంటర్ ఓపెన్ చేసి చూడ గా... ఉరివేసుకుని, మరణించాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ శాంతిలాల్, వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
అధిక వడ్డీ వేధింపులే..
రవికుమార్‌ను అప్పులు, అధిక వడ్డీ వేధింపులే బలి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 35 వేలకు ఇప్పటికే రూ.1.20 లక్షలు కట్టాననీ, ఇక కట్టలేనంటూ సూసైడ్ లెటర్‌లో పేర్కొనడం చూస్తేంటే.. వడ్డీలు కట్టడానికి జీతం చాలట్లేదని స్పష్టమవుతోంది. మరికొందరి వద్ద తీసుకున్న అప్పులు కూడా అతడికి భారంగా మారినట్లు స్పష్టమవుతోంది. రవికుమార్ మూడు రోజులపాటు సెలవు తీసుకున్నాడని బ్యాంకు సిబ్బంది ద్వారా తెలుస్తోంది. సెలవు ముగించుకుని వచ్చీ రాగానే... బ్యాంకు ఉద్యోగులు, కుటుంబీకులను ఒకసారి మాట్లడించి, అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. రవికుమార్ మృతదేహాన్ని వాష్‌రూమ్ నుంచీ బయటకు తీయగానే... భార్య హరిత, ఇతర కుటుంబీలు కన్నీరుమున్నీరయ్యారు. తోటి బ్యాంకు ఉద్యోగులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ఉద్యోగులకు నోట మాట రాలేదు. హరిత ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అధిక వడ్డీలకు అడ్డుకట్ట వేయాలి
అధిక వడ్డీ వేధింపుల కారణంగానే బ్యాంకు ఉద్యోగి రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని అధిక వడ్డీల వ్యతిరేక పోరాట స మితి జిల్లా అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. రవి మృతదేహాన్ని హరితోపాటు మరికొందరు మార్చురీ వద్ద సందర్శించి, అతడి కుటుంబీకులను ఓదార్చారు. తర్వాత ఆయన మాట్లాడుతూ... నగరంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే... ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. కాల్‌మనీ కేటుగాళ్లను ప్రభుత్వం, పోలీసులు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News