Bengaluru Burglar Arrest: రేచీకటితో దొంగ సతమతం.. పగటిపూట సీరియల్ యాక్టర్ ఇంట్లో చోరీ.. చివరకు..
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:32 AM
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రేచీకటితో బాధపడే అతడు పగటి వేళల్లోనే దొంగతనాలు చేస్తాడని తెలిపారు. ఇటీవల ఓ కన్నడ సీరియల్ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన అతడిని అరెస్టు చేసి చోరీకి గురయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పోలీసులు తాజాగా ఓ అంతర్ రాష్ట్ర దొంగకు చెక్ పెట్టారు. ఇటీవల కన్నడ సీరియల్ నటుడు ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ చేసిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహబూబ్ ఖాన్ పఠాన్ అని, రేచీకటి కారణంగా అతడు పగటి పూట మాత్రమే చోరీలు చేస్తుంటాడని తెలిపారు (Bengaluru Burglar Arrest).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జేపీ నగర్‌లో ప్రవీణ్ కుమార్, మానస దంపతుల ఇంట్లో మహబూబ్ ఖాన్ మార్చ్ నెలలో చోరీ చేశాడు. ఇంటి ముందు చెప్పుల స్టాండ్‌లో ఉన్న తాళం చెవి సాయంతో లోపలికెళ్లి విలువైన వస్తువులను దొంగిలించాడు. దీంతో, మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ పెండెంట్, నాలుగు ఉంగరాలు, చెవి దుద్దులు పోయాయని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 478 గ్రాముల బంగారు నగలు, 1.5 కేజీల వెండి వస్తువులు, రూ.4.6 లక్షల నగదు, ఒక టూవీలర్ వెరసి మొత్తం రూ.65.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
విచారణ సందర్భంగా మహబూబ్ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. నటుడి ఇంటి వద్ద తాళం చెవి లభించకపోయి ఉంటే తాను తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉండేవాడినని చెప్పాడు. పలు జిల్లాల్లో ఇదే తరహా దొంగతనాలు చేశానని అంగీకరించాడు. చోరీ చేసిన బంగారు నగలను తన ఇంట్లో కరిగించి మళ్లీ మార్కెట్‌లో విక్రయించే వాడినని చెప్పాడు (Bengaluru Thief With Nightblindness).
‘రాత్రి పూట నాకు కళ్లు సరిగ్గా కనబడవు. అందుకే పగటి పూట చోరీలు చేస్తుంటా’ అని నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. టీనేజ్ వయసు నుంచే అతడు దొంగతనాలకు అలవాటుపడ్డాడని తెలిపారు. పలు రాష్ట్రాల్లో నిందితుడిపై 32 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఒంటరిగానే అతడు ఈ దొంగతనాలు చేస్తాడని వివరించారు. ఇక సరాయ్ పాళ్యలోని అతడి ఇంట్లో, హసన్ జిల్లాలోని ఓ జువెలరీ షాపులో పలు నగలను స్వాధీనం చేసుకున్నారు. జేపీ నగర్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని 7 చోరీ కేసులకు మహబూబ్ అరెస్టుతో పరిష్కారం లభించిందని అన్నారు.
ఇవీ చదవండి..
పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ