Inherited Jewellery Tax: వారసత్వంగా వచ్చిన ఆభరణాలపై పన్ను పోటు ఉంటుందా
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:56 AM
మన దేశంలోని సంపన్నులు, మధ్య తరగతి వర్గాలకు బంగారు ఆభరణాలు కూడా ప్రఽధాన ఆస్తే. వీరిలో చాలా మంది తమ తర్వాత లేదా తమ జీవిత కాలంలో తమ ఆభరణాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ...
మన దేశంలోని సంపన్నులు, మధ్య తరగతి వర్గాలకు బంగారు ఆభరణాలు కూడా ప్రఽధాన ఆస్తే. వీరిలో చాలా మంది తమ తర్వాత లేదా తమ జీవిత కాలంలో తమ ఆభరణాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేస్తుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారసత్వ ఆభరణాలపైనా పన్ను పోటు తప్పదు. కొద్దిగా జాగ్రత్త పడితే ఈ పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
మన సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారం, బంగారు ఆభరణాలు ఒక భాగం. పిల్లల పెళ్లిళ్లు ఆ మాటకొస్తే మన దేశంలో జరిగే ప్రతి శుభకార్యమూ వీసమెత్తు బంగారమైనా లేకుండా పూర్తి కాదు. చాలా కుటుంబాల్లో బంగారం, వెండి లేదా వాటితో చేసిన ఆభరణాలు ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. ఇలా వారసత్వంగా వచ్చిన ఆభరణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అవసరం కోసం అమ్మాల్సి రావచ్చు. అప్పుడు ఈ అమ్మకాలపై పన్ను పోటు తప్పదు. అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ పోటు నుంచి బయటపడవచ్చు.
పన్ను ప్రభావం
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వారసత్వంగా సంక్రమించిన బంగారం, వెండి లేదా వాటితో చేసిన ఆభరణాలను ‘ఆదాయం’గా పరిగణించదు. కాబట్టి వారసత్వంగా వాటిని అందుకున్న వ్యక్తులపై వెంటనే ఎలాంటి పన్ను పోటు ఉండదు. ఐటీ చట్టంలోని సెక్షన్ 47 (ఐఐఐ), సెక్షన్ 56 (2) (ఎక్స్) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పన్ను ఎప్పుడు?
వారసత్వంగా వచ్చిన ఆభరణాలను అమ్మినప్పుడు మాత్రమే పన్ను వర్తిస్తుంది. అది కూడా ఆ అమ్మకంపై వచ్చిన మూలధన లాభాల (సీజీటీ) ఆధారంగా నిర్ణయిస్తారు.
పన్ను లెక్కింపు ఇలా
ఎవరి నుంచి ఈ ఆభరణాలు సంక్రమించాయో వారు కొనుగోలు చేసిన ధర లేదా 2001 ఏప్రిల్ 1 కంటే ముందు కొనుగోలు చేసి ఉంటే 2001 ఏప్రిల్ 1 నాటికి ఉన్న సముచిత మార్కెట్ ధర (ఎఫ్‌ఎంవీ), ఆ ఆభరణాలు ఎంత కాలంగా (హోల్డింగ్ పీరియడ్) వాటిని కొన్న వ్యక్తి, వారసుల వద్ద ఉన్నాయనే అంశాల ఆధారంగా ఈ మూలధన లాభాలను స్వల్ప (ఎస్‌టీసీజీ) లేదా దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ)గా లెక్కిస్తారు.
పరిగణనలోకి తీసుకునే అంశాలు
ద్రవ్యోల్బణ వ్యయ సూచీ (సీఐఐ) ఆధారిత ఇండెక్సెడ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ (ఐసీఏ)
20 శాతం ఎల్‌టీసీజీ+సర్‌చార్జీ+హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్
ఉదాహరణ: ఆభరణాల అమ్మకం ధర -ఐసీఏ=ఎల్‌టీసీజీ
ఎల్‌టీసీజీ గీ 20 శాతం (+సర్‌చార్జి) = చెల్లించాల్సిన పన్ను
మూలధన ఆస్తులు అంటే?
మూలధన ఆస్తులు అంటే ఏంటో ఐటీ చట్టంలోని సెక్షన్2 (14) స్పష్టంగా నిర్వచించింది. ఇళ్లు, భూములతో పాటు బంగారం, వెండి, ప్లాటినం లేదా ఏ ఇతర విలువైన లోహాలతో చేసిన ఆభరణాలను కూడా మూలధన ఆస్తులుగానే పరిగణిస్తారు. వీటి అమ్మకాలపై వచ్చే లాభాలనూ మూలధన లాభాలుగానే చూస్తారు. ఏదైనా మిశ్రమ లోహాల్లో బంగారం, వెండి, ప్లాటినం లేదా విలువైన రాళ్లు పొదిగి చేసినా, అవి కూడా ఆభరణాల పరిధిలోకే వస్తాయి.
పన్ను రేటు
గత ఏడాది.. జూలై 2023 కంటే ముందు వారసత్వ ఆభరణాలను మూడేళ్లలోపు అమ్మితే వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలు (ఎస్‌టీసీజీ)గా పరిగణించి, ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను విధించే వారు. మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే వచ్చిన లాభాలను ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలిపి 20 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను విధించేవారు. అయితే గత ఏడాది జూలై 23 నుంచి ఎల్‌టీసీజీ గడువును రెండేళ్లకు కుదించారు. పన్ను పోటును ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5 శాతానికి తగ్గించారు. వారసత్వంగా వచ్చిన ఆభరణాలను రెండేళ్ల లోపు అమ్మితే వచ్చే స్వల్పకాలిక మూలధన లాభాలపై మాత్రం ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు.
మినహాయింపులు,
పొదుపు ఆప్షన్లు
ఈ ఆభరణాలను విక్రయిం చగా వచ్చిన మూలధన లాభాలను ఏడాదిలోగా లేదా బదిలీ జరిగిన రెండేళ్లలోగా నివాస గృహ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 54 ఎఫ్ కింద పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే మన దేశంలోని ఆస్తుల కొనుగోళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఆభరణాలు అమ్మగా వచ్చిన మూలధన లాభాలను మూడేళ్ల లోపు సొంతింటి నిర్మాణానికి వినియోగించినా రూ.10 కోట్ల వరకు ఈ మినహాయింపు లభిస్తుంది.
ఆభరణాలను అమ్మగా వచ్చిన లాభాల్లో రూ.30 లక్షల వరకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) లేదా గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) జారీ చేసే క్యాపిటల్ బాండ్స్‌లో మదుపు చేసినా సెక్షన్ 54 ఈసీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే ఈ పెట్టుబడిని ఆభరణాలు అమ్మిన ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News