Inflation Impact India: నేడు రూ కోటి మరి పాతికేళ్ల తర్వాత
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:01 AM
ప్రస్తుతానికి ఆర్థికంగా బలంగానే ఉన్నా.. ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్‌లో బలహీనపడే ప్రమాదం ఉంది. మీ ప్రస్తుత సంపద విలువను ఏటేటా పెంచుకుంటూ పోవడం ద్వారానే ఈ ముప్పు నుంచి...
ఈ రోజుల్లో కోటి రూపాయలంటే చాలా పెద్ద మొత్తమే. అంత డబ్బుంటే విలాసంగానే బతికేయొచ్చు. మంచి ఇళ్లు కొనుగోలు చేయొచ్చు. పిల్లల్ని విదేశాల్లో చదివించవచ్చు. ఆర్భాటం గా పెళ్లిళ్లూ చేయొచ్చు. మరి పాతికేళ్ల తర్వాత మాటేమిటి..? 2050లోనూ రూ.కోటితో ఇవన్నీ సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే, ధరాఘాతం కరెన్సీ విలువను కరిగించేస్తోంది. ఏటేటా ధరలు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో కరెన్సీ నోటు కొనుగోలు సామర్థ్యం కూడా అదే స్థాయిలో తగ్గుతూ వస్తోంది. గతంలో మనం చూసిన 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా, అర్ధ రూపాయి నాణేలు ధరాఘాతం కారణంగా కాలక్రమేణా కనుమరుగైపోవడమే ఇందుకు మంచి ఉదాహరణ. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూపాయి, రూ.2, రూ.5, రూ.10 నాణేలదీ భవిష్యత్‌లో అదే పరిస్థితి. కాబట్టి మన ఆర్థిక భవిష్యత్‌ను మెరుగుపర్చుకోవాలంటే.. ధరల పరుగును మించిన వేగంతో ఆదాయాన్ని, పొదుపు సొమ్ము విలువను పెంచుకోవడమే మన ముందున్న మార్గం. అదెలాగో తెలుసుకుందాం..
ప్రస్తుతానికి ఆర్థికంగా బలంగానే ఉన్నా.. ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్‌లో బలహీనపడే ప్రమాదం ఉంది. మీ ప్రస్తుత సంపద విలువను ఏటేటా పెంచుకుంటూ పోవడం ద్వారానే ఈ ముప్పు నుంచి తప్పించుకోగలరు. అది కూడా ద్రవ్యోల్బణం కంటే వేగంగా. ధరల వార్షిక పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. గత 20-25 ఏళ్లలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 6 శాతం పైమాటే. ప్రస్తుతం ఇది కాస్త తగ్గి 5 శాతానికి దిగివచ్చింది. వచ్చే 25 ఏళ్లూ ద్రవ్యోల్బణం సగటు 5 శాతంగా ఉండవచ్చనుకుంటే, నేటి కోటి రూపాయల వాస్తవిక విలువ 2050లో రూ.30 లక్షల దిగువకు (రూ.29.53 లక్షలు) పడిపోనుందన్నమాట. అలాగే, ప్రస్తుతం రూ.కోటితో పొందగలిదేదైనా 2050లో కావాలంటే దాదాపు రూ.3.4 కోట్లు చెల్లించాల్సి రావచ్చు. అంటే, వచ్చే పాతికేళ్లలో ధర దాదాపు మూడున్నర రెట్లు కానుందన్నమాట. అందుకే, మీ దగ్గరున్న సొమ్ము విలువను కాపాడుకోవాంటే ధరల పరుగుతో పోటీపడాల్సిందే.
సంపద లేదా పెట్టుబడుల విలువను పెంచుకునేందుకు పలు మార్గాలున్నాయి. ఈక్విటీ మార్కెట్లో నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా పెట్టుబడులు మీ సంపద విలువను వేగంగా పెంచే అవకాశం ఉంది. అయితే, ఇది అధిక రిస్క్‌తో కూడుకున్నది. స్థిరాస్తి, బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులూ దీర్ఘకాలంలో ఆకర్షణీయ ప్రతిఫలాలు అందించగలవు. అయితే, వీటిలోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడులు భద్రమైనవి. పైగా ద్రవ్యోల్బణం కంటే అధిక రిటర్నులు లభిస్తాయి. వీటితో పాటు రిస్క్ లేని మరిన్ని పెట్టుబడి సాధనాలు..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌సీసీ)
చిన్న మదుపరులు పన్ను రాయితీ ప్రయోజనాలతో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌సీసీ మంచి ప్రత్యామ్నాయం. ప్రభుత్వ హామీతో కూడిన ఈ ఐదేళ్ల కాలపరిమితి పథకంపై వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం 7.7 శాతంగా ఉంది.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకమైన కేవీపీపై ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో (9.5 సంవత్సరాలు) రెట్టింపు అవుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
(ఎస్‌సీఎ్‌సఎస్)
60 ఏళ్లు దాటిన వారికోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకమిది. ప్రభుత్వ హామీ, సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ వంటి ప్రయోజనాలున్న ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. దీంట్లో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)
బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలూ సురక్షితమైనవే. అయితే, దీర్ఘకాలపరిమితి డిపాజిట్లపైనే ఆకర్షణీయ వడ్డీ లభించేందుకు అవకాశం ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
దీర్ఘకాల వ్యూహంతో సురక్షిత పెట్టుబడి కోసం పీపీఎఫ్ మంచి ఆప్షన్. చక్రవడ్డీ ద్వారా మంచి ప్రతిఫలాలూ లభిస్తాయి. ప్రస్తుతం పీపీఎ్‌ఫపై వార్షిక వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పన్ను రహిత వడ్డీ, ఐటీ చట్టంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలూ ఉన్నాయి.
Also Read:
సిద్ధార్థ్ రెడ్డిపై అఖిల ప్రియ సెటైర్లు..
వైఎస్ భారతిపై మాజీ మంత్రి సుజాత కీలక వ్యాఖ్యలు..
For More Business News and Telugu News..