Universal Pension Scheme: సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలో అందరికీ పెన్షన్
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:31 PM
దేశంలో సాధారణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో సార్వత్రిక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ప్రధాన లక్ష్యం అందరికీ పెన్షన్ అందుబాటులోకి తీసుకురావడమే. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలో ప్రజలందరీ కోసం సరికొత్త స్కీం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అందరికీ పెన్షన్ ప్రయోజనాలు లభించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సార్వత్రిక పెన్షన్ స్కీం (Universal Pension Scheme) ద్వారా అందరికీ సామాజిక భద్రత అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించింది. ఈ పథకం ఉపాధికి లింక్ చేయకుండా, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఈ స్కీం ద్వారా ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితోపాటు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారంతా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రయోజనం పొందడానికి అవకాశం లభిస్తుంది. దీంతోపాటు ప్రస్తుత ప్రభుత్వ పెన్షన్ స్కీంలను కూడా ఇదే స్కీం కిందకు తీసుకురానున్నారు. తద్వారా 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈ పెన్షన్ ప్రయోజనం పొందడం మరింత ఈజీ అవుతుంది.
ఈ క్రమంలో ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM), వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న జాతీయ పెన్షన్ పథకం (NPS-ట్రేడర్స్) వంటి ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఈ స్కీంలో విలీనం చేయనున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి. 60 సంవత్సరాల వయస్సు తర్వాత వీటిని తీసుకున్న వారికి నెలవారీ రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో భాగంగా ఆయా వ్యక్తులు రూ. 55 నుంచి రూ. 200 వరకు చందా చెల్లిస్తారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని చందాగా అందిస్తుంది.
మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కూడా ఈ పథకాన్ని అభివృద్ధి చేయడానికి చురుగ్గా పనిచేస్తోంది. ఈ స్కీం బ్లూ ప్రింట్ సిద్ధమైన తర్వాత మంత్రిత్వ శాఖ తదుపరి విషయాల కోసం వాటాదారులతో చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక పెన్షన్ పథకం అనేది సమాజంలో ప్రతి ఒక్కరికీ భద్రతను కల్పించే దిశగా రూపొందించిన ఒక స్వచ్ఛందమైన, సహకార ఆధారిత చర్య అని చెబుతున్నారు. ఈ పథకం ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట ఆదాయం లేని వ్యక్తులకు కూడా పెన్షన్ అందించేలా చేస్తుందంటున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News