Share News

Budget-2025 : బడ్జెట్‌లో 10 ప్రధాన అంశాలివే..

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:18 PM

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు. కాగా, ఈ బడ్జెట్‌‌కు సంబంధించిన 10 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Budget-2025 : బడ్జెట్‌లో 10 ప్రధాన అంశాలివే..

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు. కాగా, ఈ బడ్జెట్‌‌కు సంబంధించిన 10 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


1. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా బలోనేతం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు.

2. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. 1.73 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.


3. ఎంఎస్ఎంఈలకు రూ. 10 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు చెప్పారు. స్టార్టప్‌లకు ఇచ్చే రుణాల పరిమితి రూ. 20 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. అలాగే దేశంలో బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు.

4. ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఐఐటీలలో మౌలిక వసతులను పెంచనున్నారు. మరో 6,500 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే అయిదేళ్లలో 75 వేల సీట్లు పెరగనున్నాయని మంత్రి తెలిపారు.


5. కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. గిగ్ వర్కర్లను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటూ వారికి గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. అదేవిధంగా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అందజేయన్నారు.

6. దేశంలోని 50 పర్యాటక స్థలాలను కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యటక రంగంలో ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే హోం స్టేస్‌కు ముద్ర యోజన పథకం వర్తింపజేయనున్నారు. టూరిస్ట్ డెస్టినేషన్లకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. అదేవిధంగా దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రైవేట్ రంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


7. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. రూ.0-రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. రూ.4-రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.8-రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12-రూ.16 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షలకు 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం.. రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు.

8. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్పాదకతను పెంపొందించడం, పంటల వైవిధ్యతను అనుసరించడంతో పాటూ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంట అనంతర నిల్వను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


9. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల కోసం ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మిషన్ క్లీన్ టెక్నాలజీకి మద్దతిస్తుందన్నారు. సౌర ఘటాలు, EV బ్యాటరీల కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుందని తెలిపారు.

10. దేశంలోని 8 కోట్ల మంది చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించేందుకు సక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే యువకుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలకు ప్రభుత్వం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కూడా అందిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 01:18 PM