Venkie Iyer Interview: ఈ ఏడాది ఆదాయంలో 20 శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:15 AM
భారత బీమా రంగంలో అపార అవకాశాలున్నాయి. అయితే ప్రజల్లో ఇప్పటికీ బీమా పట్ల అవగాహన చాలా తక్కువ. దేశంలో నూటికి 83 శాతం మందికి బీమా రక్షణ లేదు. ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పిస్తే బీమా రంగం దూసుకుపోవటం...
ఏపీ, తెలంగాణ నుంచి 7% ఆదాయం
రూ.1.22 లక్షల కోట్లకు ఏయూఎం
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ వెంకీ అయ్యర్
భారత బీమా రంగంలో అపార అవకాశాలున్నాయి. అయితే ప్రజల్లో ఇప్పటికీ బీమా పట్ల అవగాహన చాలా తక్కువ. దేశంలో నూటికి 83 శాతం మందికి బీమా రక్షణ లేదు. ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పిస్తే బీమా రంగం దూసుకుపోవటం ఖాయమంటున్నారు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈఓ వెంకీ అయ్యర్. బీమా రంగ పనితీరు, తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్ కార్యకలాపాల గురించి ఆయన ‘ఆంధ్రజ్యోతి బిజినె్‌స’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు..
దేశంలో చాలా మందికి బీమా రక్షణ లేకపోవటానికి కారణం?
ప్రజలకు పాలసీల ప్రీమియం అందుబాటులో లేకపోవటం కంటే సరైన అవగాహన లేకపోవటం ఇందుకు ప్రధాన కారణం. ఒకవేళ అవగాహన ఉన్నా పాలసీలు తీసుకునేలా చేయటం చాలా కష్టం. అందుకే బీమా పట్ల అవగాహన కల్పించేందుకు బీమా కంపెనీలన్నీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారత బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కూడా ఇందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
భారత జీవిత బీమా పరిశ్రమ భవిష్యత్‌పై మీ అంచనా?
దేశంలో బీమా పరిశ్రమ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. మన జనాభాలో ఇప్పటికీ 83 శాతం మందికి బీమా రక్షణ లేదు. ఇది బీమా రంగానికి పెద్ద అవకాశం. అయితే ఇందుకోసం కొన్ని సంస్కరణలు కూడా అవసరం. అంతేకాదు ప్రజల్లో బీమా తప్పనిసరిగా తీసుకోవాలన్న ఆలోచన వస్తే బీమా రంగం మరింత వృద్ధి పథంలోకి దూసుకుపోవటం ఖాయం. ప్రస్తుతం దేశీయ బీమా పరిశ్రమ ఏటా రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగిసే నాటికి బీమా రంగ మార్కెట్ రూ.20 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇక జీవిత బీమా రంగం కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.
2024-25లో బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు?
2024-25 ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్ల వరకు ఉంది. అందులో ప్రైవేట్ కంపెనీల వాటా రూ.92,000 కోట్ల నుంచి రూ.1.04 లక్షల కోట్ల వరకు ఉంది.
గత ఆర్థిక సంవత్సరం సంస్థ ప్రీమియం వసూళ్లు?
మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ప్రీమియం ఆదాయం రూ.31,000 కోట్ల వరకు ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ. ఇందులో రూ.9,200 కోట్ల వరకు తొలిసారిగా పాలసీలు తీసుకున్న వారి నుంచి వచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ వృద్ధి రేటు అంచనా?
ప్రీమియం ఆదాయ వృద్ధి రేటు ఈసారి కొంత స్తబ్దుగా ఉండవచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 20 శాతంగా ఉంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సంస్థ క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతం వరకు ఉంది. ప్రస్తుతం సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.1.22 లక్షల కోట్లుగా ఉంది.
కొత్త పాలసీలు ఏమైనా తీసుకువస్తున్నారా?
మార్కెట్ అవసరాలను బట్టి పాలసీలు మారుతుంటాయి. ప్రస్తుతం ప్రొటెక్షన్, చిల్ట్రన్స్, సేవింగ్స్, వెల్త్ క్రియేషన్, రిటైర్మెంట్, హెల్త్‌తో సహా అన్ని రకాల పాలసీలను అందిస్తున్నాం. మహిళల కోసం ఈ మధ్యనే శుభ శక్తి పేరుతో కొత్త పాలసీ ప్రారంభించాం. మహిళల జీవిత అవసరాలు, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని రూపొందించాం. ప్రజల దీర్ఘకాలిక పొదుపు, రక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా కొత్త పాలసీలు తీసుకొస్తాం.
మొత్తం ప్రీమియం వసూళ్లలో తెలుగు రాష్ట్రాల వాటా?
టాటా ఏఐఏ లైఫ్ మొత్తం ప్రీమియం వసూళ్లలో తెలుగు రాష్ట్రాల వాటా 5 నుంచి 7 శాతం వరకు ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ నుంచి వసూళ్లు ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధితో రూ.1,040 కోట్ల నుంచి రూ.1,460 కోట్లకు పెరిగింది. ఏపీలో 34 శాతం వృద్ధి చెంది రూ.503 కోట్ల నుంచి రూ.675 కోట్లకు చేరుకుంది. కొత్త ప్రీమియం ఆదాయం తెలంగాణలో 61 శాతం వృద్ధితో రూ.627 కోట్లకు చేరుకోగా, ఏపీలో 31 శాతం వృద్ధి చెంది రూ.266 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జూలై నాటికి తెలంగాణలో 21,744 మంది ఏజెంట్లు ఉండగా ఏపీలో 18,801 మంది ఏజెంట్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి