Stock Market: చివరి గంటలో అమ్మకాలు.. ఆరంభ లాభాలు ఆవిరి..
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:07 PM
సానుకూల సంకేతాల నడుమ ఉదయం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. అయితే ఇరాన్ కాల్పుల నిబంధనలను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ప్రకటించడం మదుపర్లలో భయాందోళనలకు కారణమైంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ లాభాలను కోల్పోయాయి. స్వల్ప లాభాలతో రోజును ముగించాయి
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చల్లారడంతో స్టాక్ మార్కెట్లు ఉదయం సానుకూలంగా కదలాడాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగివచ్చాయి. ఈ సానుకూల సంకేతాల నడుమ ఉదయం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. అయితే ఇరాన్ కాల్పుల నిబంధనలను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ప్రకటించడం మదుపర్లలో భయాందోళనలకు కారణమైంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ లాభాలను కోల్పోయాయి. స్వల్ప లాభాలతో రోజును ముగించాయి (Business News).
సోమవారం ముగింపు (81, 896)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో దాదాపు 1100 పాయింట్లు లాభపడి 83, 018 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్ లాభాలను కోల్పోయింది. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 82, 055 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 72 పాయింట్ లాభంతో 25, 044 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25 వేల మార్క్‌ను అందుకుంది.
సెన్సెక్స్‌లో టిటాగర్ రైల్వే, వోడాఫోన్ ఐడియా, డెలివరీ, ఎల్‌టీ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కేపీఐటీ టెక్నాలజీస్, ఆయిల్ ఇండియా, భారత్ డైనమిక్స్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 415 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 402 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.97గా ఉంది.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి