Share News

Retirement Planning Mistakes: రిటైర్మెంట్‌ పొదుపులో పొరపాట్లు వద్దు

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:39 AM

సంపాదించేటప్పుడే రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం ప్లాన్‌ చేసుకోవాలి. ప్రణాళికాబద్దంగా పెట్టుబడులతోనే మలి దశ జీవితానికి ఆర్థిక భరోసా. లేదంటే ఇబ్బందులు తప్పవు...

Retirement Planning Mistakes: రిటైర్మెంట్‌ పొదుపులో పొరపాట్లు వద్దు

జాగ్రత్త వహిస్తేనే మలిదశ జీవితానికి ఆర్ధిక భరోసా

సంపాదించేటప్పుడే రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం ప్లాన్‌ చేసుకోవాలి. ప్రణాళికాబద్దంగా పెట్టుబడులతోనే మలి దశ జీవితానికి ఆర్థిక భరోసా. లేదంటే ఇబ్బందులు తప్పవు. రిటైర్మెంట్‌ ఆర్థిక భద్రతను ఎలా ప్లాన్‌ చేసుకోవచ్చనే వివరాలు మీకోసం..

రెక్కాడేటప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ఇందుకోసం నెలనెలా కొద్ది మొత్తంలోనైనా పొదుపు చేయాలి. తర్వాత ఆ సొమ్ముతో మన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులుగా పెట్టాలి. ఇళ్లు, పొలాలతో పాటు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రమానుగుత పెట్టుబడులు (సిప్‌) లేదా ఇతర పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయాలి. ఇందుకు ముందుచూపుతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. ఈ విషయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటంటే..

అవాస్తవ లక్ష్యాలు

తెలివైన రిటైర్మెంట్‌కు వాస్తవిక లక్ష్యాలే పునాది. చాలీచాలని జీతాలతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటే అవి కలలుగానే మిగిలిపోతాయి తప్ప ఆచరణకు నోచుకోవు. కాబట్టి మన ఆదాయం, ఖర్చులను దృష్టిపెట్టుకుని పెట్టుబడులు ప్లాన్‌ చేసుకోవాలి.

ద్రవ్యోల్బణం

రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేసే వారిలో చాలా మంది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని సరిగా పట్టించుకోరు. ద్రవ్యోల్బణం పొదుపు విలువను ఏటేటా తగ్గించేస్తుంది. ఈ రోజు రూ.లక్ష ఉన్న పొదుపు విలువ, రిటైర్మెంట్‌ నాటికి బాగా తగ్గిపోతుంది. మంచి కంపెనీల షేర్లు, మంచి రాబడులు పంచుతున్న ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం సెగ నుంచి తప్పించుకోవచ్చు.


అత్యవసర నిధి

ఏ సమయంలో ఎలాంటి ఆపద లేదా అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే, అత్యవసర, ఆకస్మిక ఖర్చుల కోసం ప్రత్యేక నిధి తప్పనిసరి. కానీ, చాలా మంది ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్‌ చేసుకోరు. దీర్ఘకాలిక పెట్టుబడి నుంచే ఈ ఖర్చులు భరిస్తారు. దాంతో రిటైర్మెంట్‌ పెట్టుబడులకు గండి పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వ్యక్తి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవాలి.

ఈపీఎఫ్‌

విత్‌డ్రాయల్స్‌

కొత్త ఇంటి కొనుగోలు, పిల్లల పెళ్లిళ్లు లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం చాలా మంది తమ ఈపీఎఫ్‌ నుంచి కొంత మొత్తాన్ని మధ్యలోనే వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఈపీఎఫ్‌ పొదుపును రిటైర్మెంట్‌ తర్వాత ఏర్పడే అవసరాలు తీర్చే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలే తప్ప, స్వల్పకాలిక అవసరాలు తీర్చే పెట్టుబడిగా చూడకూడదు.

పీపీఎ్‌ఫపై ఉపేక్ష

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) పెట్టుబడులు, రాబడులకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పైగా ఈ పెట్టుబడి మొత్తాల చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు తక్కువనే కారణంతో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగం లేదా సంపాదన ప్రారంభమైన వెంటనే పీపీఎ్‌ఫలో కొద్ది స్థాయిలోనైనా పెట్టుబడులు ప్రారంభిస్తే, రిటైర్‌ అయ్యే నాటికి ఎలాంటి పన్నుల భారం లేకుండా పెద్ద మెత్తంలో చేతికొస్తుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పథకంలో ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 కనీస స్థాయి నుంచి రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఆరోగ్య బీమా

ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. సంపాదించేటప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యల కంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలే జేబుకు ఎక్కువగా చిల్లు పెడతాయి. ఆర్జిస్తున్న సమయంలోనే వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది. కంపెనీ హెల్త్‌ పాలసీ ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే.. రిటైర్మెంట్‌ తర్వాత వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత తక్కువ వయసులో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం పడుతుంది.


టర్మ్‌ పాలసీలపై నిర్లక్ష్యం వద్దు

ఒకవేళ మీకేదైనా జరిగితే, మీపై ఆర్థికంగా ఆధారపడిన కుటుంబసభ్యులు రోడ్డున పడాల్సిందే. ఆదాయానికి తగ్గట్టు కవరేజీ ఉండేలా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయట పడవచ్చు. ఈ పాలసీ కవరేజీ మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లు ఉండేలా చూసుకోవాలి. అప్పులు, పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత అవసరమనుకుంటే టర్మ్‌ పాలసీ కవరేజీ మార్చుకోవచ్చు.

సాగదీయ వద్దు

రిటైర్మెంట్‌ పెట్టుబడులను సంపాదన ప్రారంభించిన వెంటనే ఆరంభించాలి. ఎంత త్వరగా ప్రారంభిస్తే మీ పెట్టుబడుల విలువ అంత త్వరగా పెరుగుతుంది. ఉదాహరణకు పాతికేళ్ల వయసున్న వ్యక్తి నెలకు రూ.15,000తో ఈక్విటీ పథకాల్లో సిప్‌ ప్రారంభించాడనుకుందాం. ఈ పెట్టుబడులపై సగటున 12 శాతం రాబడులు వచ్చినా రిటైర్‌ అయ్యే నాటికి రూ.10 కోట్లు పోగై ఉంటుంది. అదే ఒక 10 సంవత్సరాలు ఆలస్యంగా ప్రారంభిస్తే నెలకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఆస్తుల వివిధీకరణ

అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదనేది సామెత. ఇది రిటైర్మెంట్‌ పెట్టుబడులకూ వర్తిస్తుంది. రుణ పత్రాల్లో పెట్టుబడులు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చినా.. ద్రవ్యోల్బణం ఆ రాబడులను మింగేస్తుంది. దీర్ఘకాలంలో మన పెట్టుబడులు ద్రవ్యోల్బణానికి మించి రాబడులు ఇవ్వాలంటే మంచి కంపెనీల ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ మదుపు చేయాలి. ఇదంతా ఎందుకనుకుంటే ఈక్విటీ, రుణ పత్రాలు, బంగారం, వెండిలో సమానంగా మదుపు చేయడం మంచిది. ఇది కూడా మా వల్ల కాదనుకుంటే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ లు.. మల్టీ అసెట్‌ ఫండ్స్‌ పేరుతో ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. మంచి రాబడులు అందించడంతో ఇటీవల ఈ ఫండ్స్‌ మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 03:39 AM