Share News

పీపీఎఫ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏది బెటర్‌

ABN , Publish Date - May 18 , 2025 | 01:58 AM

చేతిలో నాలుగు డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు వాటిని ఎలా మదుపు చేయాలా అని చూస్తారు. నష్ట భయానికి (రిస్క్‌) సిద్ధపడితే స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తారు. ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) లేదా పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీపీఎ్‌ఫ)ను...

పీపీఎఫ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏది బెటర్‌

చేతిలో నాలుగు డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు వాటిని ఎలా మదుపు చేయాలా అని చూస్తారు. నష్ట భయానికి (రిస్క్‌) సిద్ధపడితే స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తారు. ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) లేదా పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీపీఎ్‌ఫ)ను ఆశ్రయిస్తారు. అయితే ఇందులో ఏది ఎవరికి అనుకూలమంటే అది ఆయా వ్యక్తుల అవసరాలు, లక్ష్యాలను బట్టి ఉంటుంది.

అసలుకు ఢోకా లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే ప్రతి మదుపరికి ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాంకు ఎఫ్‌డీలు లేదా పీపీఎఫ్‌. ఎందుకంటే ఈ రెండింటిలో చెల్లింపులకు పెద్దగా ఢోకా లేదు. పీపీఎఫ్‌ చెల్లింపులకైతే కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. అయితే ఈ రెండు పథకాలు అందిరికీ ఒకేలా వర్తించవు. ఆర్థిక లక్ష్యాలు, నగదు అవసరాలు, ఆదాయ పన్ను (ఐటీ) భారాన్ని బట్టి ఈ పథకాలను ఎంచుకోవాలి. ఇందులో ఒక్కో పథకానికి సంబంధించిన అనుకూల, ప్రతికూలతలను పరిశీలిద్దాం.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎ్‌ఫసీ).. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ఆఫర్‌ చేస్తాయి. ఈ ఎఫ్‌డీల కాలపరిమితి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. కాలపరిమితిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ప్రస్తుతం కాలపరిమితి.. బ్యాంకులను బట్టి ఎఫ్‌డీలపై 6 నుంచి 8 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ చెల్లింపులను ఎఫ్‌డీ కాలపరిమితి తీరిన తర్వాతనా? లేదా నిర్ణీత గడువులోగా అనే విషయాన్ని మదుపరులే నిర్ణయించుకోవాలి.

పీపీఎఫ్‌

ఇది 15 ఏళ్ల కాలపరిమితితో కూడిన కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకం. ఈ పథకంపై చెల్లించే వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఎవరైనా ఈ పథకంలో సంవత్సరానికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద రూ..1.5 లక్షల వరకు మినహాయింపు కూడా లభిస్తుంది.

రాబడులు, పన్ను పోటు

పీపీఎ్‌ఫతో పోలిస్తే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువ. ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను పోటు ఉంటుంది. పీపీఎ్‌ఫకు మాతరం ఎలాంటి పన్ను పోటు ఉండదు. పీపీఎ్‌ఫలో పెట్టుబడులు, వాటిపై వచ్చే వడ్డీ ఆదాయం, 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వచ్చే మొత్తాలన్నింటి పైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు.

రెండింటిలో ఏది మంచిదంటే

రాబడులపరంగా చూస్తే ఎఫ్‌డీలతో పోలిస్తే పీపీఎఫ్‌ పెట్టుబడులే బెటర్‌. ఎలాగంటే, 30 శాతం టాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్న వ్యక్తి ఎఫ్‌డీలో మదుపు చేస్తే 7 శాతం వడ్డీ వస్తుందనుకుందాం. పన్ను పోటు పోయే సరికి అతడికి నికరంగా లభించే వడ్డీ రేటు 5 శాతం లోపే ఉంటుంది. అదే పీపీఎ్‌ఫను తీసుకుంటే ప్రస్తుతం చెల్లిస్తున్న 7.1 శాతం మొత్తం మదుపరి ఖాతాలోనే పడుతుంది. పైగా ఈ పథకంపై చెల్లించే వడ్డీని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చక్రవడ్డీ పద్దతిలో లెక్కిస్తారు. కాకపోతే ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.5 లక్షలకు మించి మదుపు చేసేందుకు వీల్లేదు.

లిక్విడిటీ-వెసులుబాటు

పీపీఎ్‌ఫతో పోలిస్తే ఎఫ్‌డీలకు లిక్విడిటీ ఎక్కువ. అంటే వీటిని నిర్ణీత గడువు కంటే ముందే వెనక్కి తీసుకోవచ్చు. కాకపోతే అందుకు కొద్దిగా ఫీజు చెల్లించాలి. పైగా ఎఫ్‌డీలు హామీగా చూపి రుణాలు కూడా తీసుకోవచ్చు. అదే పీపీఎఫ్‌ పెట్టుబడులను 15 ఏళ్ల కంటే ముందే వెనక్కి తీసుకోవాలంటే అనేక షరతులు వర్తిస్తాయి. ఏడేళ్లు పూర్తి అయితే గానీ పీపీఎఫ్‌ పెట్టుబడులను అది కూడా పాక్షికంగా మాత్రమే వెనక్కి తీసుకోవడం సాధ్యపడుతుంది. అదే పీపీఎఫ్‌ మొత్తాన్ని హామీగా చూపి రుణాలు తీసుకోవాలంటే మూడు నుంచి ఆరేళ్ల లోపు మాత్రమే సాధ్యం. హామీతో కూడిన సురక్షిత రాబడుల కోసం చూసే దీర్ఘకాలిక మదుపరులకు మాత్రమే పీపీఎఫ్‌ మంచి ఆప్షన్‌ అని చెప్పక తప్పదు.


నష్ట భయం- భద్రత

రెండూ సురక్షిత పథకాలే. కాకపోతే ఎఫ్‌డీలతో పోలిస్తే పీపీఎఫ్‌ మరింత సురక్షితం. ఎందుకంటే ఈ పథకం చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. మంచి పెద్ద బ్యాంకుల్లో చేసే ఎఫ్‌డీల చెల్లింపులకూ పెద్దగా ఢోకా ఉండదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు దివాలా తీసినా రూ.5 లక్షల వరకు ఉండే ఎఫ్‌డీల చెల్లింపులకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) హామీ ఉంటుంది.

ఎఫ్‌డీలు ఎవరికి ?

స్వల్ప, మధ్యకాలిక అవసరాలు ఉన్న మదుపరులు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెనక్కు తీసుకోవాలనుకునే వారు, తక్కువ ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్న మదుపరులు ఎఫ్‌డీలను ఎంచుకోవడం మంచిది.

పీపీఎఫ్‌ ఎవరికి?

పన్ను పోటు లేకుండా దీర్ఘకాలిక ఆస్తుల కల్పన కోసం చూసే వ్యక్తులు, రిటైర్మెంట్‌, పిల్లల విద్య, వివాహ ఖర్చుల కోసం చూసే మదుపరులు, అధిక ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉండి సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా కోసం చూసే వ్యక్తులు పీపీఎ్‌ఫను ఎంచుకోవడం మంచిది. ఆర్థికంగా స్థితిమంతులైన వ్యక్తులు తమ పెట్టుబడుల పోర్టుఫోలియోలో ఎఫ్‌డీలతో పాటు పీపీఎ్‌ఫను ఉంచుకోవడం మంచిది. అయితే వారి పెట్టుబడుల లక్ష్యం, కాలపరిమితి, పన్ను పోటు ఆధారంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 01:58 AM