PayPals CEO Alex Chriss: గ్లోబల్ చెల్లింపులకు కొత్త వేదిక..యూపీఐ గురించి పేపాల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:50 PM
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ క్రమంలో యూపీఐ ఊహించని విధంగా పేమెంట్స్ విధానానాలను మార్చేసిందని పేపాల్ సీఈఓ అలెక్స్ క్రిస్ పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.
భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో దూసుకెళ్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా భారత్‌లో చెల్లింపుల విధానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ గ్లోబల్ పేమెంట్ కంపెనీ పేపాల్ సీఈఓ అలెక్స్ క్రిస్ (Alex Chriss) భారత్‌లో యూపీఐ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పేపాల్ వరల్డ్ లాంచ్ సందర్భంగా ముంబయిలో ఆయన ప్రసంగించారు.
పేపాల్ ఒక అద్భుతమైన వేదికను సృష్టించిందని, దీని ద్వారా ప్రపంచంలో ఏ డిజిటల్ వాలెట్‌కు అయినా ఈజీగా అనుసంధానం చేసుకోవచ్చన్నారు. ఈ వేదిక భారత్‌లోని యూపీఐతో సహా ప్రపంచంలోని అతిపెద్ద చెల్లింపు వ్యవస్థలను ఒకే చోట కలిపేందుకు రూపొందించబడిందన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో, పేపాల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని ఇంటిగ్రేట్ చేస్తోంది.
ఈ భాగస్వామ్యం పేపాల్, వెన్మో వంటి ఇతర డిజిటల్ వాలెట్‌లతో కూడా అనుసంధానం కలిగి ఉంటుంది. వినియోగదారులు ఆన్‌లైన్, ఇన్-స్టోర్‌లో షాపింగ్ చేసి, చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. భారత్‌లో పర్యాటకం కోసం వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తమ పేపాల్ వాలెట్‌లను ఉపయోగించి యూపీఐ ద్వారా ఈజీగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం దేశీయ సౌలభ్యం, గ్లోబల్ యాక్సెసిబిలిటీని మరింత ఈజీగా చేస్తుంది.
జులైలో, పేపాల్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్ అగ్రిగేటర్-క్రాస్ బోర్డర్-ఎక్స్‌పోర్ట్స్ (PA-CB-E)గా పనిచేయడానికి సూత్రప్రాయంగా అనుమతి పొందింది. ఈ అనుమతి పేపాల్‌కు భారత్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పేమెంట్స్ చెల్లింపులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి