Share News

Gayatri Projects: ప్రమోటర్ల చేతికే గాయత్రి ప్రాజెక్ట్స్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:05 AM

హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌పై దాఖలైన దివాలా పరిష్కార పిటిషన్‌ కొలిక్కి వచ్చింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రూ.2,400 కోట్లు చెల్లించి కంపెనీని తిరిగి సొంతం...

Gayatri Projects: ప్రమోటర్ల చేతికే గాయత్రి ప్రాజెక్ట్స్‌

రూ.2,400 కోట్ల ఓటీఎ్‌సకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

70% బకాయిల మాఫీ

బ్యాంకులపై రూ.5,700 కోట్ల భారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌పై దాఖలైన దివాలా పరిష్కార పిటిషన్‌ కొలిక్కి వచ్చింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రూ.2,400 కోట్లు చెల్లించి కంపెనీని తిరిగి సొంతం చేసుకునేందుకు సంస్థ ప్రమోటర్లయిన మాజీ ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ బెంచ్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగం గా రూ.750 కోట్లను 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ)లోని 97 శాతం మంది ఇందుకు ఆమోదం తెలపడంతో ఎన్‌సీఎల్‌టీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గాయత్రి ప్రాజెక్ట్స్‌ నుంచి తమకు రావాల్సిన రూ.8,100 కోట్ల రుణ బకాయిల్లో రూ.5,700 కోట్లకు (70 శాతం) ఆశలు వదులుకున్నట్టయింది. గాయత్రికి రుణాలిచ్చిన బ్యాంకుల్లో కెనరా బ్యాంక్‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఐడీబీఐ బ్యాంక్‌ ఉన్నాయి. కాగా గాయత్రి ప్రాజెక్ట్స్‌ ఇప్పటికే రుణదాతల వద్ద రూ.115 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది.

ఇదీ కథ: సుబ్బరామి రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు గాయత్రి ప్రాజెక్ట్స్‌ను ప్రమోట్‌ చేశారు. ఈపీసీ రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టిన ఈ కంపెనీ కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకులకు రూ.8,100 కోట్ల రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో 2022 నవంబరులో బ్యాంకులు కంపెనీపై దివాలా పిటిషన్‌ ఫైల్‌ చేశాయి. అయితే ఏ కంపెనీ కూడా గాయత్రి ప్రాజెక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 2024 జనవరిలో రుణదాతలు కంపెనీ లిక్విడేషన్‌కు అనుమతి కోరుతూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. తాజాగా సుబ్బరామి రెడ్డి కుటుంబమే ఓటీఎస్‌ కింద రూ.2,400 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. దీంతో బ్యాంకులు ఈ రుణ ఖాతాను క్లోజ్‌ చేయాలని నిర్ణయించాయి.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 04:05 AM