కొలువుల నెలవులు జీసీసీలు
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:18 AM
మన దేశంలో ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. 2030 నాటికి ఈ కేంద్రాల ద్వారా 33 లక్షల ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. వచ్చే ఆరేళ్లలో...
2030 నాటికి 33 లక్షల ఉద్యోగాలు
ఈ ఏడాది 4.5 లక్షల నియామకాలు
ముంబై: మన దేశంలో ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. 2030 నాటికి ఈ కేంద్రాల ద్వారా 33 లక్షల ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. వచ్చే ఆరేళ్లలో కొత్త నియామకాలు 10 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో 4.25 లక్షల నుంచి 4.5 లక్షల కొత్త నియామకాలు ఈ సంవత్సరం ఉంటాయని టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ విడుదల చేసిన ‘ఇండియా జీసీసీ గ్రోత్ ఔట్‌లుక్, 2024’ నివేదిక తెలిపింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 10 విభిన్న రంగాలకు చెందిన 207 జీసీసీల ప్రధాన అధికారులతో మాట్లాడి ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ ఈ నివేదిక రూపొందించింది. బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై నగరాల్లోని జీసీసీలు పెద్ద ఎత్తున ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని తెలిపింది.
2030 నాటికి 2,100 జీసీసీలు: ప్రస్తుతం మన దేశంలో దాదాపు 1,800 జీసీసీలున్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 2,100కు, మార్కెట్ పరిమాణం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.74 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, పెద్ద ఎత్తున నిపుణుల లభ్యతతో దాదాపు ప్రతి అంతర్జాతీయ కంపెనీ మన దేశంలో జీసీసీ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. దీంతో జీసీసీలకు సంబంధించిన టెక్నాలజీ, ఫైనాన్స్, తయారీ వంటి కీలక రంగాల్లో పని చేసేందుకు పెద్ద ఎత్తున నిపుణుల అవసరం ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కేంద్రాల్లో ఈ సంవత్సరం ఆర్థిక సేవల నిపుణుల నియామకాలు 79ు; మార్కెటింగ్, డిజిటల్ అడ్వర్‌టైజింగ్ నిపుణుల నియామకాలు 73ు; ఇంజినీరింగ్, తయారీ నిపుణుల నియామకాలు 69ు, హెచ్‌ఆర్-టాలెంట్ మేనేజ్‌మెంట్ నిపుణుల నియామకాలు 68ు పెరుగుతాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News