Swiggy Instamart: ఒక్కరే.. రూ.22 లక్షల కొనుగోళ్లు..
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:33 AM
ఓ యూజర్ 2025లో తమ ప్లాట్‌ఫామ్‌పై ఏకంగా రూ.22 లక్షలను ఖర్చు చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. అంతేగాక దేశంలోనే అత్యధికంగా ఒకే ఆర్డర్‌పై రూ.4.3 లక్షలను ఓ హైదరాబాదీ ఐ ఫోన్‌ల కోసం ఆర్డర్ చేశాడని స్విగ్గీ పేర్కొంది. ఆ సంస్థ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో హైదరాబాదీ టాప్
- రూ.4.3 లక్షల విలువైన ఐఫోన్ల ఆర్డర్
- అత్యధిక సింగిల్ ఆర్డర్‌లో నంబర్ 1
- కండోమ్‌ల కోసం రూ.లక్షకు పైగా ఖర్చు చేసిన చెన్నై వాసి
- ఇన్‌స్టామార్టెడ్ 2025 నివేదికలో స్విగ్గీ వెల్లడి
హైదరాబాద్ సిటీ: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్(Swiggy Instamart) ఆర్డర్లలో దేశంలోనే హైదరాబాద్ టాప్‌లోకి దూసుకెళ్లింది. అత్యధిక సింగిల్ ఆర్డర్లలో నగరవాసి నంబర్ 1 గా నిలిచాడు. దేశంలోనే అత్యధికంగా ఒకే ఆర్డర్‌పై రూ.4.3 లక్షలను ఓ హైదరాబాదీ ఐ ఫోన్‌ల(iPhones) కోసం ఆర్డర్ చేశాడని స్విగ్గీ పేర్కొంది. అంతేగాక పాలు, బంగారం, స్మార్ట్‌ఫోన్లు, కండోమ్‌లను కూడా బాగానే ఆర్డర్ చేశారని ఆ నివేదికలో పేర్కొంది.
భారతీయులు ఈ క్విక్‌కామర్స్ యాప్‌లపై ఆర్డర్ చేస్తోన్న తీరుని ‘హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ -2025’ అంటూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఓ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫామ్‌పై 2025లో జరిగిన ఆర్డరింగ్ తీరుతెన్నులను గురించి ఆ నివేదికలో వివరించింది. ఓ యూజర్ 2025లో తమ ప్లాట్‌ఫామ్‌పై ఏకంగా రూ.22 లక్షలను ఖర్చు చేశారని చెబుతూ వీటిలో 22 ఐఫోన్-17, 24 కారెట్ బంగారు నాణేలు, ఎయిర్‌ఫ్రైయర్‌తో పాటుగా పాలు, ఐస్‌క్రీమ్‌లు, తాజా పళ్లు లాంటివి కూడా ఆ ఆర్డర్లలో ఉన్నాయంది.
పాలతో 26వేల స్విమ్మింగ్ పూల్స్ నింపొచ్చు
ఇండియాలో ప్రతి సెకనుకీ నాలుగు పాల ప్యాకెట్లను ఈ వేదిక ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. 2025లో ఆర్డర్ చేసిన ఈ పాలతో 26వేల ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ ఫూల్స్ నింపవచ్చని నివేదికలో వెల్లడించారు.
కండోమ్స్ ఆర్డర్‌లు కుమ్మేశాయి
ఇన్‌స్టామార్ట్‌లో జరుగుతున్న ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ఆర్డర్ ఉంటుందట. చెన్నైలో ఓ వినియోగదారుడు ఈ కండోమ్‌ల కోసమే ఈ ఏడాది ఏకంగా రూ.1.06 లక్షలు ఖర్చు చేశాడని, మొత్తంమీద 228 ఆర్డర్‌లను ఆయన కండోమ్‌ల కోసం చేశాడని ఆ నివేదిక తెలిపింది. ఇక వాలెంటైన్స్ రోజున గులాబీల కోసం బెంగళూరు ఏకంగా నిమిషానికి 1,780 ఆర్డర్‌లను చేసి రికార్డు సృష్టించింది. మొత్తంగా చూస్తే ప్రతి నిమిషం 666 ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. అయితే అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం హైదరాబాదీయేనని, గులాబీల కోసమే రూ.31,240 ఖర్చు చేశారని పేర్కొంది.

ఇక ఆసక్తికర అంశాలను చూస్తే...
బెంగళూరులో ఓ వ్యక్తి నూడిల్స్ కోసం రూ.4.36 లక్షలకు పైగానే ఖర్చు చేస్తే, చెన్నైలో ఓ పెట్ పేరంట్ రూ.2.41లక్షలను తనపెంపుడు జంతువుల ఆహారం, తదితరాల కోసం ఖర్చు చేశారు. ముంబైలో ఓ వినియోగదారుడు బంగా రం కోసం రూ.15.6 లక్షలు ఖర్చు చేయగా, ఆసక్తికరంగా ఓ బెంగళూరు వినియోగదారుడు రూ.1.7లక్షల ఐఫోన్‌తో పాటుగా 178 లైమ్‌సోడాలను కూడా ఒకే ఆర్డర్‌లో బుక్ చేశాడు.
దానంలో బెంగళూరు టాప్
దానగుణంలో కూడా ఆయా నగరాల మధ్య పోటీ నెలకొంది. బెంగళూరులో ఓ వినియోగదారుడు ఏకంగా రూ.68,600 టిప్స్ రూపంలో ఖర్చుచేస్తే, చెన్నై వాసి ఒకరు రూ.59,505 టిప్స్ కింద ఇచ్చారట.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!
Read Latest Telangana News and National News