Share News

GST Time Of Supply: పన్ను రేటులో తేడా ఉన్నప్పుడు టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ నిర్ధారణ ఎలా

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:32 AM

ఇటీవలి 56వ జీఎ్‌సటీ కౌన్సిల్‌ మీటింగ్‌లో జీఎ్‌సటీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ సంస్కరణలు చోటు చేసుకోవటం ఇదే తొలిసారి...

GST Time Of Supply: పన్ను రేటులో తేడా ఉన్నప్పుడు టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ నిర్ధారణ ఎలా

ఇటీవలి 56వ జీఎ్‌సటీ కౌన్సిల్‌ మీటింగ్‌లో జీఎ్‌సటీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ సంస్కరణలు చోటు చేసుకోవటం ఇదే తొలిసారి. ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చే జీఎ్‌సటీ తగ్గింపులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. తగ్గించిన పన్ను ప్రయోజనాలు కచ్చితంగా వినియోగదారులకు చేరాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నేరుగా వినియోగదారులకు అమ్మే వస్తువులకు అంటే బీ2సీ (బిజినెస్‌ టు కన్స్యూమర్‌) సరఫరాలో పెద్ద సమస్య లేకపోవచ్చు. ఎందుకంటే, ఈ నెల 22 నుంచి అమ్ముడయ్యే ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి తగ్గించిన ధరనే తీసుకోవచ్చు. కానీ బీ2బీ (బిజినెస్‌ టు బిజినెస్‌) సరఫరాలలో కొంత సమస్య ఉంటుంది. కారణం ఒక్కొక్కసారి అడ్వాన్స్‌ ముందే రావచ్చు. అలాగే ఇన్వాయిస్‌ కూడా ముందే ఇవ్వవచ్చు లేదా సరఫరా జరిగిన తర్వాత పేమెంట్‌ అందవచ్చు. మరి అలాంటప్పుడు పైకం ముట్టిన తేదీ, ఇన్వాయిస్‌ తేదీ లేదా వాస్తవ సరఫరా జరిగిన తేదీ, దేని ప్రాతిపదికన పన్ను శాతం తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే సర్వీ్‌సలకు సంబంధించి ఈ సమస్య కొంత అధికం. ఎందుకంటే సర్వీ్‌సలకు సంబంధించి ఇన్వాయిస్‌ గరిష్ఠంగా నెల రోజుల వరకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఏదేనీ సర్వీస్‌ సెప్టెంబరు 20న అందిస్తే అంటే పాత రేటు ఉన్న సమయంలో అందిస్తే, ఇన్వాయిస్‌ నెలలోపు అంటే కొత్త రేటు అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చే సౌలభ్యం సర్వీస్‌ అందించే వ్యక్తికి ఉంటుంది. ఒక్కొక్కసారి పేమెంట్‌ ముందు తీసుకుని, సర్వీస్‌ తర్వాత ఇవ్వవచ్చు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.


ఒక వ్యక్తి ఒక హోటల్‌లో సెప్టెంబరు 25న రూమ్‌ కావాలని సెప్టెంబరు 1న ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నాడు. రూమ్‌ రెంట్‌ రూ.5,000 కూడా అప్పుడే చెల్లించారు. అలాగే ఆ రోజు అమల్లో ఉన్న 12 శాతం ప్రకారం రూ.600 జీఎ్‌సటీ కింద చెల్లించటం జరిగింది. కానీ, నిజానికి ఆ వ్యక్తి రూమ్‌ను వాడుకునే నాటికి పన్ను శాతం 12 నుంచి 5 శాతానికి తగ్గటం జరిగింది. మరి సదరు హోటల్‌ యాజమాన్యం ఎంత పన్ను చెల్లించాలి?

ఒక సరఫరాకు సంబంధించిన పన్ను ఎప్పుడు చెల్లించాలనేది జీఎస్‌టీ చట్టంలోని ‘టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌’ ప్రకారం ఉంటుంది. ఏదేనీ ఒక సరఫరాకు సంబంధించి పన్ను రేటులో తేడా ఉన్నప్పుడు ఏ రేటును పరిగణనలోకి తీసుకోవాలనేది కూడా ఈ టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ ప్రకారం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం వాస్తవ సరఫరా జరిగిన తేదీ, ఇన్వాయిస్‌ జారీ చేసిన తేదీ లేదా సంబంధిత మొత్తం ముట్టిన తేదీ...ఈ మూడింటిలో కనీసం రెండు ఏ పీరియడ్‌లో జరిగితే ఆ పీరియడ్‌లో ఏ రేటు అమల్లో ఉందో దానినే పరిగణనలోని తీసుకోవాలి. పైన చెప్పిన ఉదాహరణలో సరఫరా సెప్టెంబరు 25న..అంటే కొత్త పన్ను రేటు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతుంది. అలాగే పేమెంట్‌ పాత పన్ను రేటు ఉన్న సమయంలో అంటే సెప్టెంబరు 22 కంటే ముందు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇన్వాయిస్‌ తేదీ అనేది కీలకం. ఒకవేళ ఇన్వాయిస్‌ కూడా సెప్టెంబరు 22 తర్వాతే ఇచ్చి ఉంటే అప్పుడు సరఫరా, ఇన్వాయిస్‌ రెండు కొత్త రేటు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగాయి కాబట్టి అప్పుడు కొత్త రేటు అంటే 5 శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని హోటల్‌ యాజమాన్యం సదరు అతిధికి కచ్చితంగా వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇన్వాయిస్‌ కూడా పేమెంట్‌ అందిన తేదీన అంటే సెప్టెంబరు 1నే ఇచ్చి ఉంటే.. అప్పుడు పేమెంట్‌, ఇన్వాయిస్‌, సరఫరా ఈ మూడింటిలో రెండు పాత రేటు అమల్లో ఉన్న సమయంలో ఉన్నాయి కాబట్టి రూమ్‌ వాడుకున్నది సెప్టెంబరు 25నే అయినప్పటికీ సంబంధిత పన్ను రేటు ప్రకారం అంటే 12 శాతం చెల్లించాలి. ఒక్కొక్కసారి సరఫరా పాత రేటు ఉన్న సమయంలో జరిగి.. అంటే సెప్టెంబరు 22 కంటే ముందు జరిగి ఇన్వాయిస్‌ లేదా పేమెంట్‌ తర్వాత రావచ్చు. అప్పుడు కూడా ఇదే పద్ధతి అంటే ఈ మూడింటిలో కనీసం రెండు ఏ పక్కన ఉన్నాయో చూసుకోవాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 03:32 AM