Share News

E Commerce Regulations: అమెజాన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వస్తువులు విక్రయిస్తున్నారా

ABN , Publish Date - Aug 31 , 2025 | 03:06 AM

ఇటీవలికాలంలో ఆన్‌లైన్‌ ద్వారా వస్తు కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయి. దాంతో చాలా వ్యాపార సంస్థలు షోరూమ్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్ల ద్వారా భారీగా కొనుగోళ్లు...

E Commerce Regulations: అమెజాన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వస్తువులు విక్రయిస్తున్నారా

ఇటీవలికాలంలో ఆన్‌లైన్‌ ద్వారా వస్తు కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయి. దాంతో చాలా వ్యాపార సంస్థలు షోరూమ్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్ల ద్వారా భారీగా కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది విక్రేతలు ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని అమ్మకాలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వ్యాపారులు ఈ-కామర్స్‌ ఆపరేటర్స్‌ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. వీరు జీఎ్‌సటీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ఎవరికి అవసరమో చెప్పేందుకు వ్యాపారులను అంటే, సరఫరాదారులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం సాధారణ వ్యాపారులు. వీరికి వార్షిక టర్నోవర్‌ నిర్ధారిత పరిమితి దాటేంతవరకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. రెండో వర్గం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అయినవారు. వీరు టర్నోవర్‌తో సంబంధం లేకుండా ముందే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

సాధారణ వ్యాపారుల విషయానికొస్తే, వీరికి ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ పరిమితిని రూ.20 లక్షలుగా నిర్ణయించారు. అంటే, పూర్తిగా పన్ను మినహాయింపు పొందిన సరఫరాలు, రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చే సరఫరాదారులు తప్ప మిగతా వారు రూ.20 లక్షల వార్షిక టర్నోవర్‌ దాటితే తప్పక రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అయితే, చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకు కేవలం వస్తువులు మాత్రమే విక్రయించే వర్తకులకు ఈ పరిమితిని కొన్ని రాష్ట్రాల్లో రూ.40 లక్షలుగా నిర్ధారించారు. వారి సరఫరాల్లో సేవలు కూడా ఉంటే మాత్రం పెంచిన పరిమితి వర్తించదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పరిమితి రూ.40 లక్షలుగా ఉండగా.. తెలంగాణలో మాత్రం రూ.20 లక్షలకే పరిమితం చేశారు. అంటే, కేవలం వస్తువులను మాత్రమే విక్రయిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.40 లక్షలు, తెలంగాణలో రూ.20 లక్షల వార్షిక టర్నోవర్‌ వరకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.


అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ ఆపరేటర్ల ద్వారా వస్తువులు విక్రయించేవారు, ముఖ్యంగా ఇంటి నుంచే విక్రయాలు జరిపేవారు తమ టర్నోవర్‌ చాలా తక్కువ గనుక రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, ఈ-కామర్స్‌ ఆపరేటర్స్‌ ద్వారా వస్తు అమ్మకాలను జరిపేవారిని ప్రభుత్వం రెండో వర్గంగా గుర్తించింది. అంటే, వీరు తప్పనిసరిగా జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. సాధారణ వ్యాపారులకు వర్తించే రూ.20 లక్షలు లేదా రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ పరిమితి వీరికి వర్తించదు. కాబట్టి, ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు ప్రారంభించే ముందే జీఎ్‌సటీ నెట్‌వర్క్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తాము ఆర్జించే తొలి రూపాయి నుంచి పన్ను చెల్లించాలి. చాలా మంది ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు ఇతర మార్గాల్లోనూ విక్రయాలు జరుపుతుంటారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ తీసుకుంటే ఈ-కామర్స్‌ ఆపరేటర్స్‌ ద్వారా విక్రయించిన సరుకుతోపాటు ఇతర మార్గాల్లో అమ్మకాలకూ జీఎ్‌సటీ వర్తిస్తుంది.

సాధారణంగా ఈ-కామర్స్‌ ఆపరేటర్లు తమతో ఒప్పందం కుదుర్చుకున్న విక్రేతలకు జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తపడతాయి. చాలా మంది చిరు వ్యాపారులు ఈ-కామర్స్‌ ఆపరేటర్ల సూచన మేరకు జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ పొందినప్పటికీ, వార్షిక టర్నోవర్‌ పరిమితి దాటనంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదని, రిటర్నులూ సమర్పించాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, ఈ-కామర్స్‌ సైట్ల ద్వారా విక్రయాలు జరిపేవారు ముందుగానే జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ పొందడమే కాకుండా సమయానికి రిటర్నులు దాఖలు చేయడంతోపాటు సంబంధిత పన్నును సకాలంలో చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రిటర్నుల ఫైలింగ్‌లో అనుభవం లేనివారు అకౌంటెంట్ల సలహాలు, సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 03:06 AM